Fact Check: ఘజియాబాద్ లో ఆహారంలో మూత్రం కలిపిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ ముస్లిం కాదు

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ ప్రీతి ఈ ఘటనపై స్పందించారు రీనా హిందూ సమాజానికి చెందినదని ధృవీకరించారు.

By Newsmeter Network  Published on  18 Oct 2024 11:04 AM GMT
Fact Check: ఘజియాబాద్ లో ఆహారంలో మూత్రం కలిపిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ ముస్లిం కాదు
Claim: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రుబీనా ఖాటూన్ అనే ముస్లిం మహిళ ‘రీనా’గా నటిస్తూ.. యజమానుల ఆహారంలో మూత్రాన్ని కలిపి దొరికిపోయింది.
Fact: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రీనా హిందూ సమాజానికి చెందినదని ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ ప్రీతి ధృవీకరించారు.

వంటగదిలో ఓ మహిళ అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. చేతిలో పాత్రతో తన కుర్తాను ఎత్తి ఫ్రిజ్ వెనుకకు వెళ్లడం, ఒక గుడ్డతో చేతులు తుడుచుకోవడం లాంటి పనులు చేస్తూ కనిపించింది.

చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. రుబీనా ఖాటూన్ అనే ముస్లిం మహిళ రీనా అనే పేరుతో పని మనిషిగా చేరిందని, యజమానుల ఆహారంలో మూత్రం కలుపుతూ పట్టుబడినట్లు చెబుతున్నారు.

ఒక ఫేస్‌బుక్ వినియోగదారు వీడియోను షేర్ చేసి.. “రుబీనా ఖాటూన్ అనే పనిమనిషి రీనాగా నటిస్తోంది. ఎనిమిది సంవత్సరాలుగా ఒక ఇంటి కోసం వంట చేస్తోంది. ఆమె ఆహారంలో మూత్రాన్ని కలిపి కుటుంబ సభ్యులకు తినిపిస్తోంది. కుటుంబం అనారోగ్యం పాలైనప్పుడు, పరీక్షల్లో మూత్రం జాడలు బయటపడ్డాయి. ఆ ఇంటి ఓనర్ కు అనుమానం వచ్చి రహస్యంగా కెమెరా అమర్చగా నిజం బయటకు వచ్చింది. ఖాతూన్ తన మూత్రాన్ని ఆహారంలో కలుపుతోంది. హిందువులారా, మీ ఇంట్లోకి ఎవరినైనా అనుమతించే ముందు క్షుణ్ణంగా ధృవీకరించండి లేదా మీరు ఉమ్మివేయబడిన లేదా మూత్ర విసర్జన చేసిన ఆహారాన్ని తినే అవకాశం ఉంది" అంటూ పోస్టులు పెట్టారు.


ఇదే కథనాన్ని చెబుతూ పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు వీడియోను షేర్ చేశారు. అందుకు సంబంధించిన పోస్ట్‌లను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

Fact Check

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మా బృందం కనుగొంది. వీడియోలో ఉన్న మహిళ ముస్లిం కాదు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ ప్రీతి ఈ ఘటనపై స్పందించారు రీనా హిందూ సమాజానికి చెందినదని ధృవీకరించారు.

గౌతమ్ కుమార్ భార్య రూపమ్ ఫిర్యాదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్ కాపీ మాకు లభించింది. ఎఫ్ఐఆర్ ప్రకారం, ఘజియాబాద్‌లోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ప్రమోద్ కుమార్ భార్య రీనా గత ఎనిమిదేళ్లుగా రూపమ్ ఇంటిలో వంట పని చేస్తోంది. అక్టోబర్ 14, 2024న రూపమ్ తన మొబైల్ కెమెరా ద్వారా, రీనా పాత్రలో మూత్ర విసర్జన చేసి, రోటీలు సిద్ధం చేయడానికి ఉపయోగించడాన్ని పట్టుకుంది. రూపమ్ కుటుంబం చాలా నెలలుగా కాలేయ వ్యాధితో బాధపడుతోందని, కొంతకాలంగా ఆహారంలో కలుషితం జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఘజియాబాద్‌లో గత ఎనిమిదేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారికి హౌస్‌హెల్ప్‌గా పనిచేస్తున్న 32 ఏళ్ల రీనా రోటీలు చేయడానికి ఉపయోగించే పిండిలో మూత్రం కలిపిన ఆరోపణలపై అరెస్టు చేసినట్లు అక్టోబర్ 16న NDTV నివేదిక పేర్కొంది.

అరెస్టుకు సంబంధించిన వీడియోను ANI షేర్ చేసింది. "ఘజియాబాద్‌లోని ఒక రెసిడెన్షియల్ సొసైటీలోని ఒక ఫ్లాట్‌లో పిండిని తయారు చేసే ముందు రీనా మూత్రాన్ని కలిపింది. రీనాను క్రాసింగ్స్ రిపబ్లిక్ PS బృందం అరెస్టు చేసింది" అని పోస్ట్ ఉంది.

ఎఫ్‌ఐఆర్, ఇన్‌స్పెక్టర్ ప్రీతి వాంగ్మూలం ఆధారంగా, ఆహారంలో మూత్రాన్ని కలుపుతూ పట్టుబడిన మహిళ ముస్లిం కాదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim Review:ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో రుబీనా ఖాటూన్ అనే ముస్లిం మహిళ ‘రీనా’గా నటిస్తూ.. యజమానుల ఆహారంలో మూత్రాన్ని కలిపి దొరికిపోయింది.
Claimed By:X users
Claim Source:X
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రీనా హిందూ సమాజానికి చెందినదని ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ ప్రీతి ధృవీకరించారు.
Next Story