Fact Check: గర్భిణీ హిందూ ప్రియురాలిని చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టిన ముస్లిం వ్యక్తి ? లేదు, ఇక్కడ నిజం తెలుసుకోండి
ఒక ముస్లిం వ్యక్తి తన గర్భవతి అయిన హిందూ ప్రియురాలు వివాహం చేసుకోవాలని కోరినందుకు ఆమెను హత్య చేశాడనే క్లెయిమ్‌లతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon
Claim:ఒక ముస్లిం వ్యక్తి తన గర్భవతి అయిన హిందూ ప్రియురాలితో పెళ్లిని తప్పించుకోవడానికి ఆమెను చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టాడు.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. బాధితురాలు, నిందితుడు ఇద్దరు ముస్లిం సమాజానికి చెందినవారు. ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు.
(హెచ్చరిక: ఈ కథనంలో ఉన్న గ్రాఫిక్ దృశ్యాలు అసౌకర్యాన్ని కలిగించగలవు, కాబట్టి మేము ఈ కథనంలో అసలు లింక్‌ను పొందుపరచడం లేదు.)
Hyderabad: ఉత్తరాఖండ్‌లో హరిద్వార్‌లో ఓ ము
స్లిం యువకుడు తన హిందూ ప్రియురాలిని హత్య చేశాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మహిళ గర్భవతి అని ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడం మూలంగానే చంపేశాడనే క్లెయిమ్‌లతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఒక మహిళ మృతదేహం సూట్‌కేస్‌లో ఉండడం కనిపిస్తుంది. పక్కన ఒక వ్యక్తి కూర్చుండగా, చుట్టుపక్కల ఉన్నవారు అతడిని తిడుతున్నారు.
ఫేస్‌బుక్‌లో ఈ వీడియోని షేర్ చేస్తూ ఈ విధంగా రాశారు, “కామం మత్తులో ఉండి గుడ్డిగా ముస్లిం యువకులను నమ్మితే మన హిందూ అమ్మాయిలకు సూట్ కేసే గతి ఇదే పరమ సత్యం. హరిద్వార్ హలాలాలోని జ్వాలాపూర్ లో మహ్మద్ గుల్షేర్ తన ప్రియురాలు కాజల్ మొదటి 2 సంవత్సరాలు గర్భవతిని చేసినట్లుగా సమాచారం అందుతోంది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో మహ్మద్ గుల్షేర్ హత్య చేశాడు. ఆ తర్వాత క్లియర్ గెస్ట్ హౌస్ కు స్థలం కోసం వెళ్తుండగా సూట్ కేసులో కాజల్ మృతదేహాన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం పోలీసులు మహ్మద్ గుల్షేర్ ను అరెస్ట్ చేశారు.
నా గుల్షర్ పందిలా కాదని, చాలా మంచి వాడు, అనీ నన్ను ప్రేమిస్తున్నాడని కాజల్ తల్లితో చెప్పిందని చెప్పారు. ఇప్పుడేమో Suiutcase లో నిద్ర పుచ్చాడు. హిందూ అమ్మాయిలు ఇప్పుడు అన్నా మారండి.” (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఈ సంఘటనకు మతపరమైన కోణం లేదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, మార్చి 25, 2022న TV9 Uttar Pradesh Uttarakhand అప్‌లోడ్ చేసిన వీడియోను కనుగొన్నాం. ఈ వీడియో శీర్షిక ‘రూర్కీ క్రైమ్ న్యూస్: ప్రేమికుడు తన ప్రియురాలి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి తిరుగుతుండగా, పోలీసులు అతన్ని పట్టుకున్నప్పుడు, అతను ఈ కారణాన్ని చెప్పాడు…’ (హిందీ నుండి అనువదించబడింది)
వీడియోలో 2:03 నిమిషాల మార్క్ వద్ద వైరల్ వీడియోను కనిపిస్తుంది. ఈ కథనం ప్రకారం ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పిరాన్ కలియార్‌లో జరిగింది.
కీవర్డ్ సెర్చ్ ఉపయోగించి, మార్చి 26, 2022న ‘కలియార్ హత్య కేసు: సూట్‌కేస్‌లో అమ్మాయి మృతదేహం దొరికింది, అబ్బాయి మొదట ఒక కథను రూపొందించాడు, తరువాత హత్యకు కారణాన్ని వెల్లడించాడు’ అనే శీర్షికతో ప్రచురించబడిన News18 కథనం కనుగొన్నాం.
ఈ కథనం ప్రకారం, గుల్షేర్ అలియాస్ గుల్బెజ్ పిరాన్ కలియార్‌లోని ఒక గెస్ట్ హౌస్‌లో తన ప్రియురాలిని హత్య చేశాడు. వారు కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు, గుల్షేర్ ఆమెను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో, ఆ అమ్మాయి నిరాకరించింది. ఆమెను బలవంతంగా చంపినట్లు అతను ఒప్పుకున్నాడు. ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి, ఆ బరువైన సూట్‌కేస్‌ను లాగుతూ తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా హోటల్ సిబ్బంది అనుమానంతో అతన్ని ఆపారు అని News18 రాసింది.
మార్చి 26, 2022 నాటి Times of India కథనం ప్రకారం, ఈ సంఘటన మార్చి 24, 2022న జరిగింది.
‘ఉత్తరాఖండ్: హోటల్‌లో ఒక వ్యక్తి ప్రేమికురాలిని చంపి, సూట్‌కేస్‌లో మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు’ అనే శీర్షికతో ఈ కథనాన్ని ప్రచురించారు.
నిందితుడు హరిద్వార్‌లోని జ్వాలాపూర్‌కు చెందిన గుల్జెబ్ హుస్సేన్ అన్సారీ అని, చనిపోయిన మహిళ పేరు రంసా అన్సారీ అని ఈ కథనంలో పేర్కొన్నారు. బాధితురాలి తండ్రి పేరు మొహమ్మద్ రషీద్ అన్సారీ, బంధువు పేరు మొహమ్మద్ యూనస్ అన్సారీ అని పేర్కొన్నారు. బాధితురాలు, నిందితుడు ఇద్దరు ముస్లిం కుటుంబాలకు చెందిన వారని తేలింది.
ఈ ఘటనపై ETV Bharat కథనం మార్చి 25, 2022న “‘సూట్‌కేస్ హత్య కేసు’: ప్రేమికుడు స్త్రీని చంపి, వివాహ నిరాకరణ కారణంగా ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టాడు” అనే శీర్షికతో ప్రచురించబడింది.
ముందస్తు ప్రణాళికతోనే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పేర్కొన్నారు. “సూట్‌కేస్‌ను ముందే తీసుకువచ్చారు, కాజల్ అనే పేరుతో ఉన్న నకిలీ ఐడి హోటల్‌లో డిపాజిట్ చేయబడింది” అని రాశారు.
హోటల్‌లో మహిళ నకిలీ ఐడి ఉపయోగించారని పోలీసులు తెలిపినట్లు ETV Bharat పేర్కొంది. మహిళ నిందితుడికి దూరపు బందువు అని రాశారు.
నిందితుడు తన ప్రేమికురాలు పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడం వల్ల హత్య చేయలేదని తేలింది. పోలీసు విచారణలో, అమ్మాయి కుటుంబం వారి వివాహాన్ని వ్యతిరేకించిందని, ఆమె కూడా తన కుటుంబంతో అంగీకరించిందని నిందితుడు పోలీసులకు తెలియజేసినట్లు ETV Bharat కథనం పేర్కొంది. ఆమె నిర్ణయంతో ఆగ్రహించిన గుల్షేర్ ఆమెను చంపి, మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి గంగ్నహర్ కాలువలో పారవేయాలని యత్నించినట్లు రాశారు.
బాధితురాలు, నిందితుడు ఇద్దరు ముస్లిం సమాజానికి చెందినవారని, దూరపు బంధువులని కూడా స్పష్టంగా తెలుస్తుంది.
కాబట్టి, వైరల్ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది. ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు.