Hyderabad: ఒక వ్యక్తిపై యూనిఫాం ధరించిన సైనికుడు దాడి చేయడాన్ని చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిందని, బంగ్లాదేశ్ జాతీయ జెండాలను అమ్ముతున్నందుకు ఆ వ్యాపారికి యూనిఫాంలో ఉన్న ఒక సైనికుడు గుణపాఠం చెప్పాడనే క్లెయిమ్‌లు ఈ వీడియోతో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
వైరల్ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా రాశారు, "బెంగాల్లో.. బంగ్లాదేశీ జెండాలమ్ముతున్న వాడికి ఘనసత్కారం చేసిన మన జవాన్.." (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్‌లు చేస్తున్న మరొక పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది.
కీవర్డ్ సెర్చ్ ద్వారా పశ్చిమ బెంగాల్లో ఓ వ్యక్తి బాంగ్లాదేశ్ జాతీయ జెండాలు అమ్ముతున్నాడని చూపిస్తున్న వార్త కథనాలు, విశ్వసనీయమైన సోషల్ మీడియా పోస్టులు దొరకలేదు.
వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా జూన్ 12న ఢాకా పోస్ట్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఒక వీడియో దొరికింది. ఈ వీడియోలో 1:00 నిమిషం మార్కు వద్ద వైరల్ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియో శీర్షికలో, "లాఠీచార్జికి గురైన జెండా విక్రేతకు సైన్యం లక్ష టాకా బహుమతిగా ఇచ్చింది" అని రాశారు.
"జెండా విక్రేత హన్నాన్ కు 100,000 టాకా బహుమతి" అనే శీర్షికతో బాంగ్లాదేశ్ పత్రిక జుగంటర్ జూన్ 12న ఒక కథనాన్ని ప్రచురించింది.
జూన్ 10న నేషనల్ స్టేడియంలో జరిగిన బంగ్లాదేశ్ vs సింగపూర్ మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగిందని కథనం పేర్కొంది. "గేటు వెలుపల జెండా విక్రేత హన్నన్‌పై ఒక సైనికుడు అనుకోకుండా దాడి చేశాడు", అని రాశారు.
గులిస్తాన్ ఆర్మీ క్యాంప్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ అఫ్జలూర్ రెహమాన్ చౌదరిని ఉటంకిస్తూ ఇలా రాసారు, పలుసార్లు హెచ్చరించినప్పటికీ స్టేడియంలోకి టిక్కెట్లు లేకుండా ప్రవేశించడానికి జనం ప్రయత్నించారని, గుమికూడిన జనాన్ని చెదరగొట్టడానికి వేదిక వద్ద లాఠీచార్జి జరిగింది.
ఈ సంఘటనకు సానుభూతి సూచకంగా బంగ్లాదేశ్ సైన్యం గాయపడ్డ జెండా విక్రేత హన్నన్ కు 1 లక్ష టాకా విరాళంగా ఇచ్చిందని ఈ కథనం పేర్కొంది.
అయితే వైరల్ వీడియోలో కనిపిస్తున్నది జూన్ 10న బంగ్లాదేశ్‌లో జరిగిన ఘటన. దీనికి పశ్చిమ బెంగాల్‌కు ఎటువంటి సంబంధం లేదు.
కాబట్టి వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.