Fact Check: UPIలో 2000 రూపాయలకు మించిన లావాదేవీలపై పన్ను? లేదు, నిజం తెలుసుకోండి
2000 రూపాయలకు మించిన UPI లావాదేవీలపై ఏప్రిల్ 1వ తారీకు నుండి 1.1% పన్ను అని క్లెయిమ్ చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది.
By K Sherly Sharon Published on 14 Dec 2024 12:02 PM ISTClaim: 2000 రూపాయలకు మించిన UPI లావాదేవీలపైన 1.1% పన్ను వచ్చే ఏప్రిల్ 1వ తారీకు నుంచి అమలు.
Fact: ఈ క్లెయిమ్ తప్పు. 1.1% పన్ను కేవలం PPI ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుంది, ఇది 2023 ఏప్రిల్ 1 నుంచే అమలులో ఉంది.
Hyderabad: UPI నెమ్మదిగా భారతదేశం అంతటా అత్యంత సాధారణంగా ఉపయోగించే చెల్లింపు ఎంపికలలో ఒకటిగా మారింది. ఏప్రిల్ 1 2025 నుండి, UPI లావాదేవీలపై 1.1% పన్ను విధించబడుతుందని ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
ఒక X వినియోగదారు సోషల్ మీడియాలో క్లెయిమ్‌లను షేర్ చేసి ఇలా వ్రాసారు, “ఏప్రిల్ 1 నుంచి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఇతర ఏ UPI ద్వారైన 2 వేలకు పైన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 1.1% ట్యాక్స్ పడనున్నాయి… ఉదాహరణకు ఎవరికైనా 10 వేలు పంపిస్తే 110 రూపాయిలు ట్యాక్స్ రూపం లో కట్ అవుతాయి.” (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని గుర్తించింది.
వైరల్ క్లెయిమ్‌తో పాటు, UPI పన్ను గురించిన Tv9 Telugu బులెటిన్ వీడియోను షేర్ చేశారు. వాలెట్లు, కార్డులను ఉపయోగించి చేసే చెల్లింపులపై మాత్రమే పన్ను వర్తిస్తుందని Tv9 Telugu బులెటిన్‌లో పేర్కొంది. మరింత స్పష్టత కోసం YouTubeలో ఈ క్లిప్‌ను కనుగొనలేకపోయాము.
కీవర్డ్ సెర్చ్‌ని ఉపయోగించి, 2023 మార్చి 30న ప్రచురించబడిన “₹2,000 కంటే ఎక్కువ విలువైన PPI వ్యాపారి లావాదేవీలపై ఏప్రిల్ 1 నుండి 1.1% ఛార్జీ వర్తించబడుతుంది,” అనే The Hindu కథనం కనుగొన్నాము. ఈ కథనంలో ఇలా వ్రాసారు “ఏప్రిల్ 1 నుండి, UPIలో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI వాలెట్‌లు) ఉపయోగించి చేసే ₹2,000 కంటే ఎక్కువ ఉన్న వ్యాపారి లావాదేవీలకు 1.1% ఇంటర్‌చేంజ్ ఛార్జీ విధించబడుతుంది.”
UPIని నియంత్రించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని ఉటంకిస్తూ, కొత్త ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు PPI మర్చంట్ లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని, కస్టమర్‌లకు ఎటువంటి ఛార్జీలు ఉండవని కథనం పేర్కొంది.
PPI వ్యాపార లావాదేవీలపై పన్ను 2023 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు అదే పన్ను విధానం కొనసాగుతోందని ఈ కథనం నుండి అర్థమవుతుంది.
ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (PPI) లావాదేవీలు అంటే UPI వాలెట్‌ల ద్వారా జరిగే లావాదేవీలు.
UPI వాలెట్ లావాదేవీలంటే ఏంటి?
“UPI Vs UPI వాలెట్: చిన్న చెల్లింపుల కోసం UPI వాలెట్‌లకు మారడం ఎందుకు చాలా తెలివైన చర్య” అనే కథనం Money Control 2024 అక్టోబర్ 21న ప్రచురించింది. ఈ కథనం ప్రకారం “UPI అనేది మొబైల్ ద్వారా రెండు బ్యాంక్ ఖాతాల మధ్య తక్షణ నగదు బదిలీని అనుమతించే చెల్లింపు వ్యవస్థ. మరోవైపు, Google Pay, PhonePe, Amazon pay లేదా Paytm UPI వాలెట్‌లు మీ UPI యాప్‌లకు లింక్ చేయబడిన ప్రీపెయిడ్ వాలెట్‌లు, ఇవి బ్యాలెన్స్‌ను నిల్వ చేస్తాయి, మీ బ్యాంక్ ఖాతాను నేరుగా యాక్సెస్ చేయకుండా చిన్న లావాదేవీలకు ఉపయోగించవచ్చు.”
PPI వ్యాపారి లావాదేవీలపై 1.1% పన్ను సగటు UPI వినియోగదారుని ఎలా ప్రభావితం చేస్తుంది?
కీవర్డ్ సెర్చ్‌ని ఉపయోగించి, ఆగస్ట్ 21, 2024న ప్రచురించిన Fi Money కథనం కనుగొన్నాము. కథనం శీర్షిక... “UPI కోసం మీకు ఛార్జీ విధించబడుతుందా? అయోమయాన్ని తొలగిస్తున్నాము.”
నివేదిక ఇలా పేర్కొంది, “ఈ ఛార్జీలు PhonePe లేదా Paytm వాలెట్ల ద్వారా చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తాయి, బ్యాంకు నుండి బ్యాంక్ చేసే లావాదేవీలకు కాదని NPCI స్పష్టం చేసింది.
"ప్రీ-పెయిడ్ వాలెట్‌లు వాలెట్‌కు డబ్బును జోడించడం కోసం రుసుమును వసూలు చేస్తాయి. ఈ రుసుము ధరను భర్తీ చేయడంలో ఈ ఛార్జీలు సహాయపడతాయని NPCI విశ్వసిస్తుంది" అని కథనం పేర్కొంది.
NPCI ప్రకటించిన UPI చెల్లింపులపై కొత్త ఛార్జీలు ప్రీ-పెయిడ్ వాలెట్‌ల ద్వారా చెల్లింపులను స్వీకరించే వ్యాపారులకు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి సగటు UPI వినియోగదారుని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ కథనం ధ్రువీకరించింది.
కీవర్డ్ సెర్చ్‌ని ఉపయోగించి, PIB Fact Check చేసిన ఓ పోస్ట్‌ను కనుగొన్నాము, అది ఇదే విధమైన దావాను సూచిస్తుంది, “సాధారణ UPI లావాదేవీలపై ఎటువంటి ఛార్జీ లేదు. @NPCI_NPCI సర్క్యులర్ అనేది డిజిటల్ వాలెట్ల వంటి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్(PPI)ని ఉపయోగించే లావాదేవీల గురించి. 99.9% లావాదేవీలు PPIకు సంబందించినవి కావు. (ఆర్కైవ్)
.@IndiaToday claims that UPI transactions over Rs 2000 will be charged at 1.1%#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2023
➡️There is no charge on normal UPI transactions.
➡️@NPCI_NPCI circular is about transactions using Prepaid Payment Instruments(PPI) like digital wallets. 99.9% transactions are not PPI pic.twitter.com/QeOgfwWJuj
ఈ పన్ను 2000 రూపాయల కంటే ఎక్కువ ఉన్న PPI వ్యాపార లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుంది. వ్యాలెట్ల ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలపై 2023 ఏప్రిల్ నుంచే 1.1% పన్ను అమలౌతోంది. ఈ పన్ను బ్యాంకు నుండి బ్యాంకు లావాదేవీలు చేసే సగటు UPI వినియోగదారుని ప్రభావితం చెయ్యదు.