Hyderabad: ఆపరేషన్ సిందూర్‌లో ప్రాణాలు కోల్పోయిన 209 మంది సైనికుల పేర్లను పాకిస్తాన్ రక్షణ శాఖ వెల్లడించిందని పేర్కొంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. జాబితాలో 155 సైనికులు, 54 వాయుసేన సైనికుల పేర్లు ఉన్నట్లు ఆరోపించారు.
26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించబడింది.
ఈ ఫొటోలో "పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ, 2025 మేలో ఆపరేషన్ సిందూర్లో భారత దాడుల్లో మరణించిన 155 మంది పాకిస్తాన్ ఆర్మీ, 54 మంది పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ సైనికులు, అధికారుల జాబితాను విడుదల చేసింది. శవాల సంఖ్య లెక్కపెట్టకూడదని ఎయిర్ మార్షల్ ఏ.కే. భారతి చేసిన ప్రకటనను గుర్తు తెచ్చుకోండి..." అని రాసి ఉంది.
వేరే ఒక సోషల్ మీడియా పోస్ట్ స్క్రీన్‌షాట్ తీసి, ఫేస్‌బుక్‌లో షేర్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ పోస్టు క్యాప్షన్‌లో, "పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ, సింధూర్ ఆపరేషన్స్ లో భారత సైన్యం చేతిలో మరణించిన తమ 155 మంది సైనికుల, 54 మంది వాయుసేన సైనికుల లిస్ట్ విడుదల చేసింది. మేర భారత్ మహాన్", అని రాశారు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) 11 మంది సైనికులు మరణించినట్లు మే 13న వెల్లడించింది.
ఆపరేషన్ సిందూర్‌లో 155 మంది సైనికులు, 54 మంది వైమానిక సైనికులు మరణించారని పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించినట్లు పాకిస్తాన్ వార్తా సంస్థలు ప్రచురించినట్లు ఎటువంటి కథనాలు మాకు దొరకలేదు.
పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లను కూడా తనిఖీ చేసాం. వైరల్ వాదనలను నిజమని చెప్పడానికి మాకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు.
కీవర్డ్ శోధనలను ఉపయోగించి మే 13న ఇండియా టుడే ప్రచురించిన నివేదికను కనుగొన్నాం. ఆ నివేదిక శీర్షిక 'భారత దాడుల్లో మరణించిన 11 మంది సైనికులలో పాక్ వైమానిక దళ చీఫ్ టెక్నీషియన్'. ఇటీవలి భారత దాడుల్లో 11 మంది సైనికులు, 40 మంది పౌరులు మరణించారని పాకిస్తాన్ సైన్యం పేర్కొన్నదని, ఏప్రిల్ 22 నుండి మే 10 వరకు జరిగిన సంఘర్షణను మార్కా-ఎ-హక్ అని పేర్కొన్నట్లు ఈ నివేదికలో రాశారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ స్టాండర్డ్ వంటి ఇతర భారతీయ వార్తా సంస్థలు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఆరుగురు సైనికులు, వైమానిక దళంకి చెందిన ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు ప్రచురించాయి.
డాన్, ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్, జియో న్యూస్ వంటి అనేక పాకిస్తాన్ వార్తా సంస్థలు కూడా ISPR వెల్లడించినట్లు ప్రస్తావిస్తూ ఇదే సమాచారాన్ని ప్రచురించాయి.
ISPR అధికారిక వెబ్‌సైట్‌లో మే 13న ప్రచురించబడిన పత్రికాా ప్రకటనను కనుగొన్నాం. ఈ ప్రకటనలో కూడా 11 పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు, 78 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. వారి ఫోటోలు కూడా ప్రచురించారు. ISPR పత్రికా ప్రకటన స్క్రీన్‌షాట్‌ను కింద పొందుపరిచాం.
వైరల్ క్లెయిమ్‌లు నిజం అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. పాకిస్తాన్ రక్షణ శాఖ మే 13న చేసిన ప్రకటనలో 11 సైనికులు మరణించినట్లు తెలిపింది.
కాబట్టి వైరల్ క్లెయిమ్‌లో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.