తెలంగాణ ఉద్యమం తర్వాత 2014 లో ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా ఆంధ్ర ప్రదేశ్ నుండి స్వాతంత్ర్యం పొందిన తెలంగాణ, వేగంగా జాతీయ స్థాయికి ఎదిగింది. సాంప్రదాయకంగా తెలంగాణ, కాంగ్రెస్ కంచుకోట. కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి [TRS]గా పిలువబడే భారత రాష్ట్ర సమితి [BRS] ఆవిర్భావంతో రాజకీయ దృశ్యం గణనీయమైన పరివర్తనకు గురైంది. 2022 లో పేరు మార్పు వ్యూహాత్మకంగా 2024 సాధారణ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంది.
అయితే, లోక్ సభ ఎన్నికల్లో BRS 8 నుండి 10 కి పైగా స్థానాల్లో గెలవబోతుందని జాతీయ మీడియా సర్వే తెలుపుతుంది, అధికార కాంగ్రెస్ మీద వ్యతిరేకతనే దీనికి కారణం అంటూ, న్యూస్24 సర్వే యొక్క స్క్రీన్ షార్ట్ ఒకటి సోషల్ మీడియా వినియోగదారులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
నిజ నిర్ధారణ :
ఈ దావా తప్పు అని మరియు తప్పుదారి పట్టించేదని న్యూస్‌మీటర్ కనుగొంది.
న్యూస్24 సర్వే యొక్క స్క్రీన్ షార్టును రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, న్యూస్24 యూట్యూబ్ ఛానెల్లో ఈ సర్వే యొక్క వీడియోకి దారి తీసింది.
ఈ వీడియోను పరిశీలించగా, ఇది 7 అక్టోబర్ 2023న ప్రచురించబడిన వీడియో అని తెలుసుకున్నాం. అంటే, ఈ సర్వే 2023 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందు, BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రచురించబడ్డ సర్వే.
వీడియోలో, ఈ డేటా CNX మీడియా సర్వే చేసి ప్రచురించింది అని తెలిపారు. దీనిని ఆధారంగా తీసుకొని తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ఇవే నంబర్లు ప్రచురించిన India TV వార్తా కథనం ఒకటి కనుగొన్నాము. “ఈరోజు లోక్‌సభ ఎన్నికలు జరిగితే వారు ఎవరికి ఓటు వేస్తారనే దానిపై ఓటర్ల మానసిక స్థితిని అంచనా వేయడానికి India TV-CNX అభిప్రాయ సేకరణను నిర్వహించింది” అనే హెడ్లైన్స్ తో 6 అక్టోబర్ 2023న ఈ డేటా ప్రచురించబడినది.
ఇది India TV-CNX ఒపీనియన్ పోల్‌లో మొదటి భాగం అని, ఇందులో 28,309 మంది పురుషులు మరియు 25,941 మంది మహిళలతో సెప్టెంబర్ 20 మరియు అక్టోబర్ 3 మధ్య నిర్వహించిన పోల్ అని ఈ వార్తా కథనం ద్వారా తెలుసుకున్నాం.
ఏప్రిల్ 2, 2024న ప్రచురించబడ్డ India TV-CNX ఒపీనియన్ పోల్ సర్వే,“తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు వస్తాయని అంచనా వేయగా, భారతీయ జనతా పార్టీ (BJP) ఐదు స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది, భారత రాష్ట్ర సమితి (BRS) రెండు సీట్లు, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్ -ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM)కి ఒక్క సీటు మాత్రమే దక్కే అవకాశం ఉంది” అని తెలిపింది.
అందువల్ల India TV-CNX అక్టోబర్ 2023లో ప్రచురించిన లోక్ సభ ఒపీనియన్ పోల్ సర్వే డాటాను ఇప్పుడు షేర్ చేస్తున్నారని మేము నిర్ధారించాము.