Fact Check: ఉచితాలు, మైనారిటీల కోసం డబ్బు వృధా చేసినందుకు ఢిల్లీలో ఆప్ నేతలపై దాడి? ఇవిగో నిజాలు
ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌కు సంబంధించిన 2022 సంఘటన తప్పుడు వాదనలతో ప్రచారం చేయబడుతోంది.
By Newsmeter Network Published on 20 Nov 2024 1:09 PM GMTClaim: ఢిల్లీ సొమ్మును వృధా చేసారని, ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నాంలో హిందువులను విస్మరించారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఢిల్లీ ప్రజలు దాడి చేసారు అని వీడియో చూపిస్తుంది.
Fact: వైరల్ అవుతున్న వాదనలు అవాస్తవం. ఈ వీడియోలో కనిపిస్తున్నది ఎన్నికల టిక్కెట్లు అమ్ముకున్నారనే ఆరోపణల మూలంగా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై ఆప్ కార్యకర్తలు 2022లో దాడి చేసిన ఘటన.
Hyderabad: ఉచితాలతో సొమ్మును వృధా చేసిందని, ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నాంలో హిందువులను విస్మరించిందని ఆరోపిస్తూ నగర వాసులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై దాడికి పాల్పడినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో కొంత మంది ఒక వ్యక్తి తో తీవ్రగా వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తుంది. ఆ వాదనలో అతని మీద దాడి చేసి, వీధిలోకి తరుముతున్నట్లు చూడగలము. ఆ వ్యక్తని ఒక వర్గం కాపాడే ప్రయత్నంలో కనిపిస్తున్నారు, అందులో కొంతమంది ఆప్ టోపీలు ధరించిన వారు ఉన్నారు.
ఈ వీడియో ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఇందులో ఢిల్లీ కార్యాకర్తలు, ప్రజలు ఉచితాల కోసం డబ్బును వృధా చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపై దాడి చేసారు అని పేర్కొన్నారు. (ఆర్కైవ్)
“ఉచితాలు ఇచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ సొమ్మును వృధా చేసిందని ఢిల్లీ కార్యాకర్తలు, ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను కడిగిపారేయడం మొదలుపెట్టారు తరిమితరిమి కొడుతున్న వీడియో చూడండి” అని ఫేస్‌బుక్‌లో వ్రాసారు.
ఇదే పోస్ట్‌లో హిందీలో ఈ విధంగా వ్రాసారు… “ఆమ్ ఆద్మీ పార్టీ ఉచితాలు ఇచ్చి ఢిల్లీ సొమ్మంతా వృధా చేసింది. దీంతో కంగుతిన్న ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ఉతికి ఆరేశారు. వచ్చే నెల నుంచి ఢిల్లీ కార్యాకర్తలకు ఇవ్వడానికి ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర డబ్బులు లేవు.. ఏం జరుగుతుందో వేచి చూడాలి.” (హిందీలోనుండి అనువాదించబడింది)
ఈ వీడియోను Xలో కూడా షేర్ చేసిన వ్యక్తి ఇలా వ్రాసారు… “ఉచితాల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను ఢిల్లీ ప్రజలు కొట్టడం మొదలుపెట్టారు. మేము చాలా కష్టపడి పన్నులు చెల్లిస్తున్నామని, ముస్లింలను ఆకర్షంచుకోడానికి మీరు హిందువులను విస్మరిస్తున్నారు అని సామాన్యులు ఈ వీడియోలో అంటున్నారు”. (హిందీలోనుండి అనువాదించబడింది) (ఆర్కైవ్)
న్యూస్ మీటర్ ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించే విధంగా ఉంది అని గుర్తించింది. ఈ వీడియో కనిపించేది మటియాలా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై పార్టీ కార్యకర్తలు దాడి చేసినప్పటి సంఘటన.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, ది ట్రిబ్యూన్ 2022 నవంబర్ 22న ప్రచురించిన ఒక కథనాన్ని కనుగొన్నాము. “ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఢిల్లీలోని పార్టీ కార్యకర్తలచే మ్యాన్ హ్యాండిల్, తనను తాను రక్షించుకోవడానికి పరిగెత్తుతున్నట్లు చూపిస్తున్న వీడియో వైరల్ అవుతుంది” అని వ్రాసారు.
అ ఘర్షణ వేరొక కోణం నుంచి తీసిన ఫోటోను ది ట్రిబ్యూన్ కథనంలో ఉపయోగించారు. వైరల్ వీడియోలో దాడి చేయబడిన వ్యక్తి, మరొక వ్యక్తి కూడా ఇందులో కనిపిస్తున్నారు. ఈ రెండు ఫోటోల మధ్య పోలిక మీరిక్కడ చూడవచ్చు.
ఈ కథనంలోని సమాచారం ప్రకారం, మటియాలా ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికల టిక్కెట్లను విక్రయించినందువల్ల పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేపై దాడి చేశారని బీజెేపి ఆరోపించింది.
కీవర్డ్ సెర్చ్ ద్వారా 2022 నవంబర్ 22న NDTVలో ప్రచురించబడిన “కెమెరాలో, ఢిల్లీలో AAP ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ పై దాడి, తనను తాను రక్షించుకోవడానికి పరుగులు తీసాడు” కథనం దొరికింది.
ఈ కథనం ప్రకారం, యాదవ్ మరియు ఆప్ కార్యకర్తల మధ్య రాత్రి 8 గంటలకు జరిగిన సమావేశంలో వాగ్వాదం జరిగింది. టిక్కెట్ విక్రయాలపై ఆరోపణలు రావడంతో దుమారం రేగి దాడికి దారితీసింది. పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తికి దారితీసే విధంగా ఆప్ సివిక్ ఎన్నికల 'టికెట్లను అమ్ముకుంటోంది', దానికి ఈ వీడియో సాక్ష్యం అని బీజేపీ పేర్కొంది. ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ ఈ వాదనను తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా, గుజరాత్ ఎన్నికల సమయంలో ఓటర్ల దృష్టి మరల్చేందుకు బీజేపీ తప్పుడు కథనాలను ప్రచారం చేసిందని ఆరోపిస్తూ, ఈ వివాదాన్ని రాజకీయ ప్రేరేపితమని ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు.
పలువురు బీజేపీ నాయకులు ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. సంబిత్ పాత్ర చేసిన పోస్ట్‌లో ఈ ఘర్షణ కోణంలో చూపిస్తున్న వీడియో ఉంది.
“‘నిజాయితీ రాజకీయాలు’ అనే నాటకీయ డ్రామాని బోధించే పార్టీ నుండి అపూర్వమైన దృశ్యాలు. స్వంత సభ్యులు కూడా తమ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మారే స్థాయికి ఆప్ అవినీతి చేరుకుంది! రాబోయే MCD ఎన్నికలలో వారికి ఇదే విధి ఎదురుచూస్తుంది” అని సంబిత్ పాత్ర ఈ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.
గులాబ్ సింగ్ యాదవ్ దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టైమ్స్ ఆఫ్ ఇండియా వ్రాసింది.
"నేను ఫిర్యాదు నమోదు చేసాను, నా స్వంత పార్టీ కార్యకర్తలతో సహా మరి కొంతమందిని పేర్కోన్నాను" అని గులాబ్ సింగ్ ఉటంకిస్తూ ఈ కథనంలో వ్రాసారు. కొందరు వ్యక్తులు బీజేపీచే ప్రభావితమయ్యారని ఆయన ఆరోపించారు. యాదవ్‌కు వైద్యపరీక్షలు చేయగా ఎలాంటి గాయాలు కాలేదని తేలింది, టిక్కెట్ పంపిణీపై జరిగిన వివాదంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఢిల్లీ పోలీసులు తెలిపారని టైమ్స్ ఆఫ్ ఇండియా వ్రాసింది.
ఢిల్లీ సొమ్మును వృధా చేసిందని లేక ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నంలో హిందువులను విస్మరించిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఢిల్లీ ప్రజలు దాడి చేసారు అని వీడియోతో వైరల్ అవుతున్న వాదనలు అవాస్తవం. ఇక్కడ కనిపిస్తున్నది ఎన్నికల టిక్కెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలపై ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై ఆప్ కార్యకర్తలు దాడి చేసిన ఘటన.