Fact Check: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వివాదంతో పాకిస్థాన్‌కు చెందిన సంస్థకు సంబంధం లేదు
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాం.
By Newsmeter Network Published on 24 Sep 2024 8:43 AM GMTClaim: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ వెనుక పాకిస్థాన్ కు చెందిన సంస్థ ఉంది
Fact: వైరల్ స్క్రీన్‌షాట్ పాకిస్తాన్ ఆధారిత కంపెనీ AR ఫుడ్స్ (ప్రైవేట్) లిమిటెడ్ ఉద్యోగుల పేర్లను చూపుతుంది. భారతదేశంలోని తమిళనాడుకు చెందిన AR ఫుడ్స్ కు సంబంధించింది కాదు.
తిరుపతి లడ్డూలకు సంబంధించిన వివాదంపై ఒక్కో రోజు ఒక్కో విషయం బయటకు వస్తోంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా మద్దతు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీకి చెందిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఆరోపణలు కరెక్ట్ కాదని, దారుణం అని ఆరోపణలను ఖండించారు.
తమిళనాడుకు చెందిన కంపెనీ ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కల్తీ నెయ్యిని సరఫరా చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముస్లిం పేర్లతో కూడిన లింక్డ్‌ఇన్ స్క్రీన్‌షాట్, AR డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్‌మెంట్ టీమ్‌కు చెందినవారని పేర్కొంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఒక X వినియోగదారు స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసి, “తిరుపతి బాలాజీకి దేశీ నెయ్యిని సరఫరా చేసే తమిళనాడుకు చెందిన కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ వివరాలను చూడండి” అని రాశారు.
పలువురు ఫేస్ బుక్ వినియోగదారులు కూడా అదే వాదనతో వీడియోను పోస్టు చేశారు.
Fact Check
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాం.
స్క్రీన్‌షాట్‌లో పాకిస్తాన్‌కు చెందిన కంపెనీ AR ఫుడ్స్ (ప్రైవేట్) లిమిటెడ్ ఉద్యోగుల పేర్లను చూపుతూ ఉంది. భారతదేశానికి చెందిన తమిళనాడు సంస్థ AR డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వివరాలు కావు కాబట్టి ఆ వాదన తప్పు అని మా బృందం కనుగొంది.
స్క్రీన్‌షాట్‌లో AR Foods (Pvt) Limited నుండి వచ్చిన ఉద్యోగి పేర్లు, లొకేషన్‌ను పాకిస్తాన్ అని ఉండడాన్ని మేము గమనించాము. ఈ క్లూ ద్వారా మేము లింక్డ్‌ఇన్‌లో కంపెనీ కోసం వెతికాం. ఇది పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న సంస్థ అని, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ఉప్పు, వెనిగర్, వెర్మిసెల్లీ వంటి పదార్థాలను అమ్మే సంస్థ అని కనుగొన్నాము. మేము కంపెనీకి సంబంధించిన ఉద్యోగుల పేర్లను కూడా తనిఖీ చేసాము. వైరల్ స్క్రీన్‌షాట్‌లో చూపిన విధంగా అదే పేర్లు ఉన్నాయని కూడా మేము నిర్ధారించాము.
మేము AR ఫుడ్స్ (ప్రైవేట్) లిమిటెడ్ వెబ్‌సైట్‌ను కూడా సమీక్షించాము. ఆ సైట్ ప్రకారం, 1970లో స్థాపించిన AR ఫుడ్స్, పాకిస్తాన్‌లో బాగా ఫేమస్ అయినా బ్రాండ్. ఈ బ్రాండ్ పేరుతో వివిధ రకాల ఆహార ఉత్పత్తులను సరఫరా చేయడంలో కంపెనీ ప్రసిద్ధి చెందింది. వెబ్‌సైట్‌లో కంపెనీ నిర్వహణపై ఎలాంటి సమాచారం లేదు.
ఇక తిరుమలకు నెయ్యిని సరఫరా చేసిన AR డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ని తనిఖీ చేసాము. సైట్ ప్రకారం, కంపెనీని 1995లో స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం దిండిగల్‌లోని మదురై రోడ్ లో ఉంది. కంపెనీ పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, ఇతర పాల ఆధారిత ఉత్పత్తుల సరఫరాలో భాగంగా ఉంది. ఇది కేరళలో రాజ్ మిల్క్ పాన్ ఇండియా, మలబార్ మిల్క్ బ్రాండ్ పేరుతో తన ఉత్పత్తులను విక్రయిస్తుంది.
వెబ్‌సైట్‌లోని డైరెక్టర్ల ప్రొఫైల్ విభాగం ఆర్. రాజశేఖరన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా చూపించింది. ఆర్. సూర్య ప్రభ, ఎస్.ఆర్. శ్రీనివాసన్ లు డైరెక్టర్లుగా ఉన్నారు. కంపెనీని ముస్లింలు నడుపుతున్నారనే వైరల్ వాదనకు విరుద్ధంగా ఉంది. అదేవిధంగా, స్క్రీన్‌షాట్‌లో కనిపించే పేర్లు ఏవీ కనిపించలేదు.
సెప్టెంబరు 21న హిందూస్తాన్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని కూడా మేము కనుగొన్నాము. ఇది తమిళనాడుకు చెందిన డైరీ కంపెనీ అని.. 1995లో స్థాపించగా, ముగ్గురు డైరెక్టర్లు రాజశేఖరన్ ఆర్, సూర్య ప్రభ ఆర్, శ్రీనివాసన్ ఎస్ఆర్ నిర్వహిస్తున్నారని నివేదించింది. కల్తీ ఆరోపణలను రాజశేఖరన్ ఆర్ ఖండించారని నివేదిక తెలిపింది.
మా బృందం వివరణ కోసం పాకిస్తాన్ ఆధారిత కంపెనీ AR ఫుడ్స్ (ప్రైవేట్) లిమిటెడ్‌ను సంప్రదించింది. వారు ప్రతిస్పందించినప్పుడు కథనాన్ని అప్డేట్ చేస్తాం.
అందువల్ల, తమిళనాడుకు చెందిన AR డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పేర్లను వైరల్ స్క్రీన్‌షాట్ లో చూపడం లేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.