Hyderabad: హైదరాబాద్‌లోని మెట్రో స్తంభం మీద ఉన్న ఒక ప్రకటనను చూపిస్తున్న చిత్రం, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరామర్శలు గుప్పిస్తుంది అన్న క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలోని ప్రకటనలో 420 అనే నెంబర్, ప్రశ్నార్ధక గుర్తు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని Xలో షేర్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా వ్రాశారు, "హైదరాబాద్ లోని మెట్రో పిల్లర్లపై 420 యాడ్స్ కలకలం. రేవంత్ ఫోటో లేకుండా జస్ట్ 420? అంటూ వెలసిన పోస్టర్లు. కాంగ్రెస్ 420హామీలపై ప్రశ్నించడం కోసమే ఈ పోస్టర్లు అతికించి ఉంటారని టాక్". (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టులు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని గుర్తించింది. చిత్రంలో కనిపిస్తున్న ప్రకటన ఎడిట్ చేసి తయారు చేయబడినది.
వైరల్ అవుతున్న చిత్రంలో ఒక ద్విచక్రవాహనం మీద వెళ్తున్న వ్యక్తి, డివైడర్ పైనుండి రోడ్ దాటుతున్న మహిళను చూడవచ్చు. అలాగే పిల్లర్ మీద L&T మెట్రో లోగో, 'DGC 15' అని వ్రాసి ఉండడం కనిపిస్తుంది.
ఈ చిత్రాన్ని పరిశీలించి చూడగా మెట్రో పిల్లర్ మీద ఉన్న ప్రకటన అస్తవ్యస్తంగా కనిపించింది. ప్రశ్నార్ధక గుర్తు ప్రకటన రేఖ వెలుపల ఉంది. ఈ సంకేతాలను బట్టి ఈ చిత్రం ఎడిట్ చేయబడి ఉండవచ్చు అని అర్ధం అయ్యింది.
వైరల్ చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా Leadspaces అనే బహిరంగ ప్రకటనల సంస్థ వెబ్సైటులో అప్లోడ్ చేయబడిన చిత్రం దొరికింది. వైరల్ ఫోటో ఇక్కడి నుండే తీసుకోబడింది అని గుర్తించాం. వైరల్ చిత్రంలో ఉన్న అదే మహిళను ఇక్కడ చూడవచ్చు. ఈ రెండు చిత్రాల మధ్య పోలికలను క్రింద చూడవచ్చు. (ఆర్కైవ్)
Leadspaces వెబ్సైటులో దొరికిన ఫోటో ద్వారా వైరల్ చిత్రం హైదరాబాద్ మెట్రోకు చెందిన C - 1768, C - 1769 నెంబర్ పిల్లర్లను చూపిస్తుంది అని గుర్తించాం. ఈ పిల్లర్లు దుర్గం చెరువు, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ల మధ్య ఉన్నాయని గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ద్వారా తేలింది. క్రింద ఉన్న గూగుల్ మ్యాప్ స్క్రీన్‌షాట్‌లో వైరల్ చిత్రంలో కనిపిస్తున్న 'DGC 15' అనే వ్రాసివుంది, 'C - 1768, C - 1769' మెట్రో స్తంభాల సంఖ్యలను చూడవచ్చు.
28 జనవరి 2025 నాటికి మెట్రో పిల్లర్‌పై అలాంటి ప్రకటన లేదని న్యూస్‌మీటర్ ధృవీకరించింది. C 1768, C 1769 పిల్లర్‌లపై ప్రదర్శించబడిన ప్రస్తుత ప్రకటనల చిత్రాలను మా ప్రతినిధి మాకు పంపారు. చిత్రాలను క్రింద చూడవచ్చు.
వైరల్ అవుతున్న క్లెయిమ్స్ అవాస్తవమని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.