Fact Check: అంబాసిడర్ కారు మళ్లీ లాంచ్, కొత్త మోడల్ దృశ్యాలు? లేదు, ఇవి ఏఐ ఫోటోలు

ఒకప్పుడు భారతీయ రోడ్లపై రాజసం ఒలకబోసి, కోట్లాది మంది భారతీయుల జ్ఞాపకాలతో ముడిపడిన మన హిందుస్తాన్ అంబాసిడర్ కార్ మళ్ళీ అందుబాటులోకి వస్తుందంటూ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు నిజం ఏంటి, ఈ ఫోటోలు ఎక్కడివి...

By -  K Sherly Sharon
Published on : 4 Oct 2025 9:13 PM IST

Fact Check: అంబాసిడర్ కారు మళ్లీ లాంచ్, కొత్త మోడల్ దృశ్యాలు? లేదు, ఇవి ఏఐ ఫోటోలు
Claim:హిందుస్తాన్ మోటార్స్ 2014లో నిలిపివేసిన అంబాసిడర్ కార్ కొత్త మోడల్‌ని 2025లో లాంచ్ చేయబోతోంది, ఇవే కొత్త మోడల్ ఫోటోలు.
Fact:వైరల్ క్లెయిమ్‌లో నిజం లేదు. అంబాసిడర్ కార్ కొత్త మోడల్‌ లాంచ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటనలు లేవు. వైరల్ పోస్టులో చిత్రాలు కూడా ఏఐ ద్వారా సృష్టించబడినవి

Hyderabad: ఒకప్పుడు భారతీయ రోడ్లపై రాజసం ఒలకబోసిన హిందూస్తాన్ మోటార్స్ అంబాసిడర్ కారు మళ్ళీ లాంచ్ అవ్వబోతోంది అంటూ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాత క్లాసిక్ రెట్రో లుక్‌ను నిలబెట్టుకుంటూనే, ఆధునిక ఫీచర్లు, టెక్నాలజీతో 'అంబాసిడర్ 2025' అందుబాటులోకి వస్తుందని ఓ X పోస్టులో రాశారు. రెండు తెల్ల రంగులో 'హిందూస్తాన్', 'అంబాసిడర్' అని రాసి ఉన్న కార్ల ఫోటోలు కూడా పంచుకుంటూ, ప్రీమియం ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉంటాయి అని అన్నారు.

X పోస్టులో ఫొటోలతో పాటు క్యాప్షన్‌లో ఇలా రాశారు:

"ద కింగ్ ఈజ్ బ్యాక్! హిందుస్తాన్ అంబాసిడర్ ఫైనల్లీ లాంచ్!..'ది ఐకాన్ ఈజ్ బ్యాక్!' అనే నినాదంతో వస్తున్న ఈ కొత్త మోడల్, తన పాత క్లాసిక్ రెట్రో లుక్‌ను నిలబెట్టుకుంటూనే, ఆధునిక ఫీచర్లతో మరియు టెక్నాలజీతో వస్తోంది. అంబాసిడర్ 2025 (Expected Details): * డిజైన్: క్లాసిక్ రౌండెడ్ బాడీ షేప్‌ను ఉంచుతూనే, LED హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ గ్రిల్ వంటి ఆధునిక హంగులు జోడించారు. * ధర (Expected Price): ఇది సుమారు ₹ 12.5 లక్షల నుండి ₹ 20 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. (వేరియంట్ మరియు మార్కెట్‌ను బట్టి ధర మారుతుంది). * ఇంజిన్/మైలేజ్: కొత్త మోడల్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, EV (ఎలక్ట్రిక్) వేరియంట్‌లో కూడా రానుందని తెలుస్తోంది. పెట్రోల్ వేరియంట్‌లో 18 kmpl వరకు మైలేజ్ ఆశించవచ్చు. * ముఖ్య ఫీచర్లు: పెద్ద డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS మరియు ప్రీమియం ఇంటీరియర్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఈ కారు విడుదల కేవలం ఒక కొత్త మోడల్ లాంచ్ కాదు, ఒక చరిత్ర పునరాగమనం! పాత తరానికి నాస్టాల్జియాను, కొత్త తరానికి యూనిక్ స్టైల్‌ను అందించేందుకు ఇది సిద్ధమవుతోంది. మీరు ఈ కొత్త అంబాసిడర్‌ను చూడటానికి ఎంత ఆసక్తిగా ఉన్నారు? 👇 #HindustanAmbassador #IconIsBack #IndianCars #Ambassador2025 #ClassicReborn"

ఈ పోస్టు ఆర్కైవ్ చేయబడిన వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. అంబాసిడర్ కార్ కొత్త మోడల్‌ లాంచ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటనలు లేవు. వైరల్ అవుతున్న ఫోటోలు కృత్రిమ మేధస్సు (ఏఐ) తో చేయబడినవి.

భారత్‌లో అంబాసిడర్ కారు ఉత్పత్తి 1957 నుండి 2014 వరకు సాగింది. ఈ కారు బ్రిటిష్ మోడల్, మోరిస్ ఆక్స్ఫర్డ్ ఆధారంగా రూపొందించబడింది. కారణం కఠినమైన ఎమిషన్ నియమాలు, పెరుగుతున్న ఖర్చులు, మార్కెట్లో సమర్థవంతమైన ఆధునిక సెడాన్ కార్లతో పోటీ వంటి కారణాల వల్ల 2014లో అంబాసిడర్ కార్ ఉత్పత్తి నిలిచిపోయింది.

చివరి అంబాసిడర్ అదే సంవత్సరం ఉత్తర్‌పరా ఫెసిలిటీలో తయారు చేయబడింది. సీకే బిర్లా గ్రూప్‌కి చెందిన హిందుస్తాన్ మోటార్స్ తన దృష్టిని ఇతర వ్యాపారాలపై మళ్లించింది. 2017లో, ప్యుగోట్ (ఇప్పుడు స్టెల్లాంటిస్) అంబాసిడర్ బ్రాండ్ హక్కులను జాయింట్ వెంచర్ ద్వారా పొందింది.

కీవర్డ్ సెర్చ్ ద్వారా 2025లో అంబాసిడర్ కార్ కొత్త మోడల్ లాంచ్ అవుతుందని పేర్కొంటున్న వార్త కథనాలు కానీ, అధికారిక ప్రకటనలు కానీ లేవు అని కనుగొన్నాం.

హిందూస్తాన్ మోటార్స్ లేదా ప్యుగోట్ అధికారిక వెబ్‌సైట్లలో ఈ విషయం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఈ కంపెనీలు మీడియాతో మాట్లాడినట్లు కూడా ఎటువంటి సమాచారం లేదు.

టైమ్స్ అఫ్ ఇండియా మే 28, 2022 న ప్రచురించిన వార్త కథనం ప్రకారం, హిందూస్తాన్ మోటార్స్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ అంబాసిడర్ కారును కొత్త లుక్ తో తిరిగి 2024 లో లాంచ్ చేయనున్నట్లు చెప్పారు. హిందుస్తాన్ మోటార్స్, ప్యుగోట్ కొత్త కారు ఇంజిన్, డిజైన్ పై పనిచేయనున్నాయి అని ఈ కథనంలో పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో ఎలాంటి అప్‌డేట్‌లు దొరకలేదు.

మార్చి 4న జిగ్‌వీల్స్ వెబ్‌సైట్‌లో వచ్చిన ఒక కథనం కొత్త అంబాసిడర్ మోడల్ గురించిన వార్తలు కేవలం పుకార్లేనని పేర్కొంది.

కొత్త అంబాసిడర్ కార్ గురించి గతంలో కూడా చాలా సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

వైరల్ ఫోటోలు ఎక్కడివి?

వైరల్ చిత్రంలో రెండు కార్లు తెలుపు రంగులో ఉన్నట్లు మనం చూడవచ్చు, అయితే వాటి బాడీ డిజైన్లలో గణనీయమైన తేడాలు ఉన్నాయి. రెండిటిపై హిందుస్తాన్ లేదా ప్యుగోట్ బ్రాండ్ లోగోలు ఏవీ కనిపించడం లేదని గమనించాం.

అయితే, కొన్ని అసమానతలు ఉన్నాయని కనుగొన్నాం. ఈ అసమానతలు కృత్రిమ మేధస్సు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించిన చిత్రాల సాధారణ సంకేతాలు. మొదటి చిత్రంలో లోగో ఎడమ వైపున ఉన్న గ్రిల్ల్స్ సంఖ్య 7 అయితే లోగో కుడి వైపున 6 గ్రిల్స్ ఉన్నాయి. అదేవిధంగా రెండవ చిత్రంలో కూడా 3, 4 వంటి అసమానమైన గ్రిల్ల్స్ సంఖ్య ఉంది.

రెండు కార్ల ఫోటోలు ఉన్న చిత్రాన్ని ఏఐ డిటెక్షన్ టూల్ ద్వారా పరిశీలించాం. హైవ్ మోడరేషన్ ఈ చిత్రం 76.5 శాతం ఏఐ - జనరేటెడ్ లేదా డీప్‌ఫేక్ కంటెంట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది అని కనుగొంది.

సైట్ ఇంజిన్ అనే మరో టూల్ ఈ చిత్రం 99 శాతం ఖచ్చితత్వంతో ఏఐ ద్వారా సృష్టించబడింది అని ధ్రువీకరించింది.

హిందుస్తాన్ మోటార్స్ 2014లో నిలిపివేసిన అంబాసిడర్ కార్ కొత్త మోడల్‌ని 2025లో లాంచ్ చేయబోతోంది అన్న క్లెయిమ్‌లో నిజం లేదు అని తేలింది. వైరల్ పోస్టులో చిత్రాలు కూడా ఏఐ ద్వారా సృష్టించబడినవి అని కనుగొన్నాం. కాబట్టి, న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్‌లు తప్పు నిర్ధారించింది.

Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ క్లెయిమ్‌లో నిజం లేదు. అంబాసిడర్ కార్ కొత్త మోడల్‌ లాంచ్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటనలు లేవు. వైరల్ పోస్టులో చిత్రాలు కూడా ఏఐ ద్వారా సృష్టించబడినవి
Next Story