Hyderabad: ఒక వ్యక్తి జాతీయ జెండాతో టేబుల్ తుడిచి, చైర్ మీద దుమ్ము దులిపినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో జాతీయ జెండాను అవమానించేలా ప్రవర్తించింది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా డిప్యూటీ రిజిస్ట్రార్ అనే క్లెయిమ్‌లతో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి క్యాప్షన్‌లో ఈ విధంగా వ్రాశారు, "ఇతను అనంతపురం డిప్యూటీ రిజిస్ట్రార్... ఇతని అహంకారం తగ్గే వరకు షేర్ చేయండి, జాతీయ జెండాను ఎలా అవమానిస్తున్నాడో చూడండి. ఈ అనంతపురం బహుశా ఆంధ్రప్రదేశ్‌కి చెందినది. జాతీయ జెండాను ఓ అధికారి అగౌరవపరచడం చింతను కలిగిస్తోంది." (హిందీలో నుండి అనువాదించబడింది) (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్స్ ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
Fact Check
ఈ క్లెయిమ్స్ తప్ప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి అనంతపురంకు చెందిన వ్యక్తి కాదు, ఒడిశాకి చెందిన పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.
వీడియో కీ ఫ్రేములను రివర్స్ ఇమాజ్ సెర్చ్ చేయగా Odisha Bytes 2023 జనవరి 12న ప్రచురించిన కథనం దొరికింది. ఈ కథనంలో వైరల్ వీడియో నుండి తీసిన స్క్రీన్ షాట్ ఉపయోగించారు. (ఆర్కైవ్)
వైరల్ వీడియోలో త్రివర్ణ పతాకంతో కుర్చీలు, బల్లలు శుభ్రం చేస్తున్న వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన పూరి జిల్లా సిమిలి పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ స్వైన్ అని Odisha Bytes కథనంలో పేర్కొన్నారు.
OdishaTV 2023 జనవరి 12న ప్రచురించిన కథనంలో, 2023 జనవరిలో వీడియో వైరల్ అవ్వడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేశారని, దాంతో ప్రశాంత్ కుమార్ స్వైన్ మీడియా ముందు క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు. ఫ్లాగ్ కోడ్ అఫ్ ఇండియాను ఉల్లంఘించినందుకు ప్రశాంత్ కుమార్ స్వైన్ అరెస్ట్ అయ్యారు. (ఆర్కైవ్)
వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఘటన అక్టోబర్ 2022లో జరిగినట్లు పోలీసులు తెలిపారని Times of India కథనంలో వ్రాశారు. (ఆర్కైవ్)
"పంచాయతీ ఆఫీసులో మీటింగ్ ప్రారంభానికి ముందు పిఈఓ బల్లలపై, కుర్చీలపై ఉన్న దుమ్ము శుభ్రం చేయడానికి జాతీయ జెండా ఉపయోగించారు. దీన్ని ఒక వార్డు మెంబెర్ వీడియోలో చిత్రీకరించారు" అని పోలీస్ ఆఫీసర్ తెలిపినట్లు వ్రాశారు.
గతంలో కూడా అనంతపురం జిల్లా డిప్యూటీ రిజిస్ట్రార్ జాతీయ పతాకాన్ని అవమానించారన్న ఆరోపణలతో ఈ వీడియో వైరల్ అయినట్టు కనుగొన్నాం. ఆ క్లెయిమ్స్ ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)
ఈ క్లెయిమ్స్ మీద స్పందిస్తూ Andhra Pradesh Fact Check ఇవి తప్పుడు కథనంతో తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, క్లెయిమ్స్ కొట్టిపారేశారు. (ఆర్కైవ్)
వైరల్ వీడియోలో కనిపిస్తున్నది ఒడిశా పూరి జిల్లాకు చెందిన పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అనంతపురం డిప్యూటీ రిజిస్ట్రార్ కాదు. కాబట్టి వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ గుర్తించింది.