Hyderabad: వక్ఫ్ సవరణ బిల్లు- 2025కు రెండు రోజుల సుదీర్ఘ చర్చల తర్వాత ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు. 2025 ఏప్రిల్ 5 నుండి చట్టంగా అమల్లోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో, వక్ఫ్ బిల్లు ఆమోదించబడింది తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చిట్ చాట్ చూపిస్తున్న వీడియో అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో రెండు వీడియోలను ఉపయోగించారు. మొదటి వీడియోలో అసదుద్దీన్ ఒవైసీ కళ్ళు తుడుచుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. రెండవ వీడియోలో పలువురు నేతలతో కూర్చొని అసదుద్దీన్ ఒవైసీ నవ్వుతూ మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది.
ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ, "వక్ఫ్ బిల్లు పాస్ అయిన తర్వాత బీజేపీ నేతలతో అసదుద్దీన్ చిట్ చాట్" అని రాశారు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది. ఇది పాత వీడియో అని తేలింది.
వీడియో కీ ఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా 2025 ఏప్రిల్ 4న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్టు దొరికింది. ఈ పోస్టులో ఉన్నది వైరల్ వీడియో అని గుర్తించాం. ఇది అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సకియా పోస్ట్ చేశారు.
పోస్ట్ క్యాప్షన్‌లో ఈ విధంగా రాశారు, "ఎంతో చర్చనీయాంశమైన, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వక్ఫ్ (సవరణ) బిల్లులు, 2025 పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) సభ్యుడిగా ఉండటం గౌరవంగా ఉంది. మా చర్చలు బలమైన వాదనలు, తీవ్రమైన చర్చలతో నిండి ఉన్నాయి. ఈ వీడియోలో NDA, INDIA అలయన్స్ రెండింటి నుండి గౌరవనీయులైన MPలు కలిసి కూర్చున్నట్లు చూడవచ్చు. మాకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ స్ఫూర్తిలో ఎటువంటి విభజన లేదు. సమావేశాల తర్వాత, మేము స్నేహపూర్వక సంభాషణల్లో పాల్గొన్నాం..."
PRS Legislative Research వెబ్సైటు, జాయింట్ కమిటీ బిల్లు రిపోర్ట్ ప్రకారం వక్ఫ్ బిల్లు మీద వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంఐఎంకి చెందిన అసదుద్దీన్ ఒవైసి కూడా ఉన్నారని తెలుస్తోంది.
కీవర్డ్ సెర్చ్ ద్వారా 2025 జనవరి 29న ANI Xలో పోస్ట్ చేసిన వీడియో దొరికింది. ఈ వీడియోలో వక్ఫ్ బిల్లులు జెపిసి సభ్యులు కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ తో సంభాషిస్తున్నారు అని రాశారు.
అదే రోజు PTI కూడా ఈ వక్ఫ్ బిల్లులు జెపిసి సభ్యులు, చైర్మన్ జగదంబికా పాల్ ఉన్న వీడియోని ప్రచురించింది.
DD News కూడా జనవరి 29 "వక్ఫ్ బిల్లులుపై ముగిసిన జెపిసి సమావేశం; తుది ముసాయిదా ఆమోదం" అనే కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో వక్ఫ్ సవరణ బిల్లులును పరిశీలించడానికి సమావేశమైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) సమావేశం 2025 జనవరి 29న మూసింది, ప్యానెల్ 14 అనుకూల, 11 వ్యతిరేక ఓట్ల తేడాతో బిల్లులును ఆమోదించింది అని రాశారు.
"జెపిసి చైర్మన్, బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఇది ప్యానెల్ చివరి సమావేశం అని, మెజారిటీ ఓట్ల ఆధారంగా 14 సవరణలను ఆమోదించామని చెప్పారు," అని పేర్కొంది.
అయితే వైరల్ వీడియోలో అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ నేతలతో పాటు NDA, INDIA కూటమికి చెందిన పలువురు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వీడియోలో కనిపించిన దృశ్యం వక్ఫ్ బిల్లులు ఆమోదం తర్వాత జరిగింది కాదు, వక్ఫ్ బిల్లు మీద చర్చించడానికి ఏర్పాటు చేసిన జెపిసి చివరి సమావేశంలో, అంటే 2025 జనవరి 29న జరిగింది అని తేలింది.
కాబట్టి వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.