Fact Check: బంగ్లాదేశ్‌లో మహంకాళి ప్రతిమను ధ్వంసం చేయట్లేదు; నిజం ఇక్కడ తెలుసుకోండి
బంగ్లాదేశ్‌లో మహంకాళి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారు అనే క్లెయిమ్‌తో వీడియో వైరల్ అవుతుంది.
By K Sherly Sharon Published on 3 Dec 2024 1:33 PM GMTClaim: బంగ్లాదేశ్‌లో మహంకాళి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నారని వీడియో చూపిస్తుంది.
Fact: వైరల్ క్లెయిమ్ తప్పు. వీడియోలో కనిపిస్తున్నది పశ్చిమ బెంగాల్ సుల్తాన్‌పూర్‌లో కాళీ ఆలయంలో నిమజ్జనం కోసం కాళీ మాత విగ్రహాన్ని విడదీస్తున్నప్పటి సంఘటన.
Hyderabad: కొందరు వ్యక్తులు కాళీ మాత విగ్రహాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో బంగ్లాదేశ్‌లోని కాళీ మాత ప్రతిమను ధ్వంసం చేస్తున్నారనే వాదనతో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ వీడియోను షేర్ చేసిన వ్యక్తి ఈ విధంగా వ్రాసారు “బంగ్లాదేశ్‌లో మహంకాళి ప్రతిమ.” (ఆర్కైవ్)
ఇదే వీడియోను షేర్ చేస్తూ మరో సోషల్ మీడియా యూజర్ ఇలా వ్రాసారు “నిన్న బంగ్లాదేశ్‌లో, ముస్లింలు కళీబాఢి అనగా కాళీ దేవాలయంపై దాడి చేసి, కాళీమాత విగ్రహాన్ని, హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశారు. ఆలయంలో ఉన్న హిందూ భక్తులను చంపారు. 20 మందికి పైగా హిందూ భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కానీ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న ఊచకోతపై ప్రపంచం మొత్తం మౌనంగా ఉంది.” (హిందీ నుండి అనువదించబడింది)(ఆర్కైవ్)
అవే క్లెయిమ్‌లు చేస్తున్న పోస్టలను మీరు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
Fact Check
వీడియోను పశ్చిమ బెంగాల్ సుల్తాన్‌పూర్‌లోని ఒక ఆలయంలో కాళీ దేవి విగ్రహ నిమజ్జనం సందర్భంగా చిత్రీకరించినందున వైరల్ అవుతున్న క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ కనుగొంది.
వీడియో కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి నవంబర్ 30న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడిన వీడియోను కనుగొన్నాము. ఈ వీడియోలో 0:27 సెకన్ల వద్ద, వైరల్ అవుతున్న వీడియో క్లిప్ కనిపిస్తుంది.
ఇదే యూట్యూబ్ ఛానెల్‌లో ‘మా సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మా అమ్మ కాళీ కోసం ప్రార్థించే సమయం వచ్చింది’ అనే బంగ్లా శీర్షికతో నవంబర్ 30న అప్‌లోడ్ చేయబడిన వీడియో కూడా ఉంది.
ఈ లీడ్‌ని అనుసరించి కీవర్డ్ సర్చ్ ద్వారా నవంబర్ 30న యూట్యూబ్‌లో ‘సుల్తాన్‌పూర్ సంప్రదాయానికి చెందిన కాళీమాత నిరంజన్ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది’ అనే బంగ్లా శీర్షికతో అప్‌లోడ్ చేయబడిన వీడియోని కనుగొన్నాము. ఈ యూట్యూబ్ వీడియోలో కాళీ దేవి విగ్రహాన్ని విడదీస్తున్న సంఘట వివిధ కోణాల్లో కనిపిస్తుంది.
వైరల్ వీడియో, యూట్యూబ్ వీడియోల మధ్య పోలికను క్రింద ఉన్న చిత్రంలో చూడవచ్చు.
యూట్యూబ్ వీడియోలో జనం కాళీ మాత విగ్రహాన్ని ముక్కలుగా చేసి వాటిని తీసుకువెళుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోలో గులాబీ రంగులో ఉన్న లోపలి గోడలను, ఆర్చ్‌లను, బంగారు-పసుపు రంగులో ఉన్న స్తంభాలను కూడా. ఈ సమాచారాన్ని ఉపయోగించి, వైరల్ వీడియో చిత్రీకరించబడిన సుల్తాన్‌పూర్‌లోని కాళీ ఆలయాన్ని కనుగొన్నాము.
గూగుల్ మ్యాప్స్‌లో అప్‌లోడ్ చేయబడిన ఆలయ ఫోటోలు, యూట్యూబ్ వీడియోలో కనిపిస్తున్న ఆర్చ్‌లు స్తంభాల మధ్య పోలికలను క్రింది చిత్రంలో చూడవచ్చు.
నవంబర్ 30న అప్‌లోడ్ చేయబడిన మరో యూట్యూబ్ వీడియోలో కాళీ నిమజ్జనం జరుగుతున్న సన్నివేశం కనిపిస్తుంది. ఆలయానికి సమీపంగా ఉన్న చెరువులో చిన్న చిన్న ముక్కలుగా కాళీ మాత ప్రతిమను జనం నిమజ్జనం చేస్తున్నట్లు చూడగలం. యూట్యూబ్ వీడియోలో, గూగుల్ మ్యాప్స్‌లో అప్‌లోడ్ చేయబడిన ఆలయ ఫోటోల పోలికను క్రింద చిత్రంలో చూడవచ్చు.
దైనిక్ స్టేట్స్‌మన్ న్యూస్ కథనం ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో ఉన్న సుల్తాన్‌పూర్ గ్రామంలో, కాళీ దేవిని ప్రత్యేకమైన సంప్రదాయాన్ని అనుసరించి పూజిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారు. పన్నెండేళ్లు ముగిశాక, విగ్రహాన్ని కూల్చివేసి ఆలయం పక్కనే ఉన్న కాళీమాత చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ ఆచారం 600 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వంలో ఒక భాగమని ఈ కథనం తెెలుపుతుంది. (ఆర్కైవ్)
పశ్చిమ బెంగాల్‌లోని సుల్తాన్‌పూర్‌లోని ఒక ఆలయంలో నిమజ్జనం కోసం కాళీ దేవి విగ్రహాన్ని కూల్చివేయడం వైరల్ వీడియో చూపిస్తుంది. అందువల్ల, వైరల్ క్లెయిమ్ తప్పు అని న్యూస్ మీటర్ నిర్ధారించింది.