హైదరాబాద్: కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 9, 11 తేదీల్లో రెండు దశల్లో 14 జిల్లాల వ్యాప్తంగా నిర్వహించబడ్డాయి. కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని వార్డు నెం.70 (కరప్పరంబు) నుంచి బీజేపీ నేత, కేరళ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు నవ్య హరిదాస్ విజయం సాధించారు.
ఈ విజయానంతరం, నవ్య హరిదాస్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కుటుంబ సభ్యుడిని ఓడించారంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలైంది. ముఖ్యంగా, సీఎం కుటుంబాన్ని రాజకీయంగా ఓడిస్తానని ఆమె చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారని కూడా ఆ పోస్టుల్లో పేర్కొన్నారు.
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, “శబరిమల కుట్రలు చేస్తున్న కేరళ CM పినరై గాడి కుటుంబాన్ని కుప్ప కూలుస్తా అని సబధం చేసిన నవ్య హరిదాస్ చెప్పినట్టుగా పినరై మేనల్లుడిని చిత్తుగా ఓడించి కాషాయ దెబ్బేంటో చూపించింది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. (ఆర్కైవ్)
వైరల్ వీడియోలో, శబరిమల అంశాన్ని ప్రస్తావించిన నవ్య హరిదాస్, పినరాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమజప యాత్రలో పాల్గొన్న మహిళలపై శాంతియుతంగా ఆందోళన చేసినప్పటికీ కేసులు నమోదు చేశారని చెబుతారు. శబరిమల సంప్రదాయాలను కాపాడేందుకు బీజేపీ మహిళా మోర్చా ముందుండి పోరాటం చేసిందని, ఆ ఉద్యమంలో తమ నేతలు కీలక పాత్ర పోషించారని ఆమె వీడియోలో వ్యాఖ్యానించారు. అలాగే, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆమె విమర్శలు గుప్పించారు.
ఇదే తరహా పోస్టు ఇక్కడ కూడా చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్
ఈ క్లెయిమ్ అసత్యమని న్యూస్‌మీటర్ గుర్తించింది.
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో నవ్య హరిదాస్, పినరాయి విజయన్ అల్లుడిపై లేదా ఆయన కుటుంబానికి చెందిన మరెవరిపైనా పోటీ చేసి గెలిచారా అనే అంశాన్ని నిర్ధారించేందుకు సంబంధిత కీవర్డ్స్‌తో పరిశీలన చేపట్టాం. అయితే, ఈ ఆరోపణకు మద్దతిచ్చే ఎలాంటి విశ్వసనీయ వార్తా కథనాలు, ఎన్నికల రికార్డులు లేదా అధికారిక సమాచారం లభించలేదు.
నవ్య హరిదాస్ కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని వార్డు నెం.70, కరప్పరంబు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కోజికోడ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిక విజేతల జాబితా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
కేరళ స్థానిక ఎన్నికల్లో నవ్య హరిదాస్ ఎవరితో పోటీ పడ్డారు?
అదే వార్డు నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఉన్న అభ్యర్థుల జాబితాను పరిశీలించగా, నవ్య హరిదాస్‌కు కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీజ కనకన్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి చెందిన హషితా టీచర్ ప్రత్యర్థులుగా ఉన్నట్లు తేలింది.
ఈ వార్డు నుంచి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కుటుంబానికి చెందిన అల్లుడు గానీ, మేనల్లుడు గానీ, ఇతర బంధువులు గానీ ఎవరూ పోటీ చేయలేదు.
ఫలితాలు వెలువడిన అనంతరం, నవ్య హరిదాస్ తన ప్రత్యర్థి అభ్యర్థులతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటో క్యాప్షన్‌లో, “రాజకీయ ప్రత్యర్థులు… ఎల్‌డీఎఫ్ అభ్యర్థి హషితా టీచర్, యూడీఎఫ్ అభ్యర్థి శ్రీజ కనకన్‌తో కలిసి… వార్డు అభివృద్ధి కోసం ఇలానే అందరం కలిసి పనిచేయాలి… పోరాటాన్ని కొనసాగించండి” అని ఆమె పేర్కొన్నారు. (మలయాళం నుంచి అనువాదం)
మొత్తానికి, కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేత నవ్య హరిదాస్, సీఎం పినరాయి విజయన్ అల్లుడిని లేదా ఆయన కుటుంబానికి చెందిన ఎవరినైనా ఓడించారన్న ప్రచారం నిజం కాదు. ఆమె కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థులపై పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన ఎవరూ పోటీ చేయలేదు.