Fact Check: బీహార్‌లో బీజేపీ విజయం నిరసనలకు దారితీస్తుందా? లేదు, వీడియో పాతది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత రాష్ట్రంలో నిరసనలు జరిగాయని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By - M Ramesh Naik |
Claim:2025 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచిన తర్వాత బీహార్‌లో ప్రజలు నిరసన తెలుపుతున్నట్లు ఈ వీడియో చూపిస్తుంది.
Fact:ఆ వాదన తప్పు. వీడియో పాతది; గాయకుడు జుబీన్ గార్గ్ కు చివరి నివాళులు అర్పించడానికి చేరుకున్న జనసంద్రాన్ని చూపిస్తుంది.
హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో NDA కూటమి 243 స్థానాల్లో 202 స్థానాలను గెలుచుకుని స్పష్టమైన విజయం సాధించింది. కౌంటింగ్ నవంబర్ 14న జరిగింది. ఈ ఎన్నికల్లో BJP 89 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. జేడీయూ 85 స్థానాలు గెలుచుకుంది.
ఈ నేపథ్యంలో, X లో ఈ వీడియోను “మేము బీజేపీ కి ఓటు వేయనులేదు కానీ బీజేపీ ఎలా అధికారం లో ఎలా వస్తుంది అని. ప్రజలు అంతా రోడ్ల మీదకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇలా మన తెలంగాణ లో కూడా ప్రజలు ఇలా చేస్తే ఈ రోజు మన రాష్టం ఎంత సూకూన్ గా ఉంటుందే కదా దోస్తులారా.” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.(Archive
ఫాక్ట్ చెక్
NewsMeter ఈ క్లెయిమ్‌ను పరిశీలించగా అది తప్పు అని తేలింది. వీడియోకు బీహార్ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది పాత వీడియో. ఇందులో కనిపిస్తున్న గుంపు అస్సాం గాయకుడు జూబీన్ గార్గ్ కు చివరి వీడ్కోలు చెప్పడానికి చేరుకున్న అభిమానులది.
కీవర్డ్ సెర్చ్‌లలో బీహార్ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయని పేర్కొంటూ ఏ విశ్వసనీయమైన వార్తలు, వీడియోలు లేదా రిపోర్టులు కనిపించలేదు.
కాంగ్రెస్ కార్యకర్తలు బీహార్ ఎన్నికలు “దొంగిలించబడింది” అంటూ ఢిల్లీలోని ఆకబర్ రోడ్‌లో నిరసన చేపట్టారు. కానీ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఆ నిరసనతో సంబంధం ఉన్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదు.
వైరల్ వీడియోలోని ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో సెప్టెంబర్ 22న ఇన్‌స్టాగ్రామ్‌లో “RIP #ZubeenGarg” అంటూ ఇప్పటికే షేర్ చేసినట్లు కనిపించింది.
సెప్టెంబర్ 19న గాయకుడు జూబీన్ గార్గ్ సింగపూర్‌లో ఈత ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరణంతో అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. అనంతరం ఆయన అంత్యక్రియలు అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో జరిగాయి.
అప్పటి వీడియోలను నాగాలాండ్ పర్యాటక మరియు ఉన్నత విద్యాశాఖ మంత్రి తెంజెన్ ఇమ్నా ఆలోంగ్ కూడా సెప్టెంబర్ 21న షేర్ చేశారు. ఆయన వీడియోలో 0:25 నుండి 0:30 నిమిషాల మధ్యలో వైరల్ క్లిప్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పోస్ట్‌లో, “జై జుబిన్ దా… ప్రేమతో నిండిన సముద్రం… వేలాది మంది ఆయనకు చివరి వీడ్కోలు చెప్పడానికి చేరుకున్నారు” అని క్యాప్షన్ ఉంది.
ఆ వీడియోలో కూడా జూబీన్ గార్గ్ అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని దృశ్యాలు ఉన్నాయి. ఆయనను తీసుకెళ్లే వాహనం పక్కగా అభిమానులు నిలబడి శ్రద్ధాంజలి అర్పించినట్లు కనిపించింది.
అందువల్ల, వైరల్ వీడియో బీహార్ ఎన్నికల నిరసనలది కాదు. అది అస్సాంలో జూబీన్ గార్గ్‌కు చివరి వీడ్కోలు చెప్పడానికి చేరుకున్న అభిమానులను చూపిస్తుంది.
కాబట్టి, ఈ క్లెయిమ్ పూర్తిగా తప్పు.