Fact Check: రేపిస్టులకు సీపీఐ(ఎం) అండగా నిలుస్తోందని బృందా కారత్ అన్నారా? లేదు, నిజం తెలుసుకోండి…

రేపిస్టులకు మరణశిక్ష విధించడాన్ని CPI(M) వ్యతిరేకిస్తోందన్న క్లెయిమ్‌లతో “రేపిస్టులకు అండగా ఉంటాము” అంటూ బృందా కారత్ చిత్రంతో కూడిన పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

By K Sherly Sharon  Published on  17 Dec 2024 6:00 PM IST
Fact Check: రేపిస్టులకు సీపీఐ(ఎం) అండగా నిలుస్తోందని బృందా కారత్ అన్నారా? లేదు, నిజం తెలుసుకోండి…
Claim: రేపిస్టులకు సీపీఐ(ఎం) అండగా నిలుస్తుందని బృందా కారత్ అన్నారు.
Fact: క్లెయిమ్ తప్పు. రేపిస్టులకు మద్దతుగా సీపీఐ(ఎం) నిలుస్తుందని బృందా కారత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

Hyderabad: 'రేపిస్టులకు అండగా ఉంటాం', 'రేపిస్టులకు మరణశిక్ష విధించేందుకు సీపీఎం వ్యతిరేకం' అంటూ మాజీ పార్లమెంటు సభ్యురాలు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) నేత బృందా కారత్‌ ఫొటోతో ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఫేస్‌బుక్‌లో బృందా కారత్ చిత్రంతో పాటు “రేపిస్టులకు అండగా ఉంటాము” అని పోస్ట్ చేసారు. “రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం మా పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకం. ఆడపిల్లలను రేపులు చేసేవారికి ఉరిశిక్ష విధించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, రేపిస్టులు కూడా మనుషులే,వారికి కూడా జీవించే హక్కు - ఉన్నది. మోడీ ప్రభుత్వం తెచ్చిన "డెత్ ఫర్ రేపిస్ట్స్ చట్టం" రేపిస్టులు జీవించే హక్కును కాలరాయడానికే..!" అని బృందా కారత్ అన్నారు అని పోస్ట్ చూపిస్తోంది. (ఆర్కైవ్)


ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.(ఆర్కైవ్ 1)(ఆర్కైవ్ 2)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ అవాస్తవమని కనుగొంది. రేపిస్టులకు ఉరిశిక్ష విధించడం మా పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకమని బృందా కారత్ అనలేదు.

కీవర్డ్ సెర్చ్‌లను ఉపయోగించి, ఏప్రిల్ 22, 2018న First Post ప్రచురించిన "సీపీఎం సూత్రప్రాయంగా మరణశిక్షకు వ్యతిరేకం, అసలు సమస్య బీజేపీ 'రేపిస్టులను రక్షించడం' అని బృందా కారత్ పేర్కొన్నారు" అనే కథనాన్ని కనుగొన్నాం.

First Post ఇలా పేర్కొంది, “సీపీఎం నేత బృందా కారత్ శనివారం మాట్లాడుతూ తమ పార్టీ మరణశిక్షకు వ్యతిరేకమని, అసలు విషయం ఏమిటంటే ప్రభుత్వంలో ఉన్నవారు “రేపిస్టులను సమర్థిస్తున్నారని” అన్నారు."

సూరత్, కథువాలో మైనర్లపై లైంగిక వేధింపులు, హత్య, ఉన్నావ్‌లో బాలికపై అత్యాచారంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్షతో సహా కఠిన శిక్షలు విధించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన రోజున ఆమె ఈ వ్యాఖ్య చేశారు అని First Post కథనంలో వ్రాసారు.

కీవర్డ్ సెర్చ్ ద్వారా ఏప్రిల్ 21, 2018న అప్‌లోడ్ చేసిన ANI పోస్ట్‌ను కనుగొన్నాము. సవరణ ఆర్డినెన్స్‌పై బృందా కారత్ వ్యాఖ్యలను ఈ పోస్ట్ చూపిస్తుంది. పోస్ట్‌లో... “సూత్రప్రాయంగా, సీపీఎం మరణశిక్షకు వ్యతిరేకం. అరుదైన కేసుల్లో ఇప్పటికే మరణశిక్ష అమలులో ఉంది. అసలు విషయం ఏమిటంటే.. రేపిస్టులకు కొందరు ప్రభుత్వ సభ్యులు మద్దతు ఇస్తున్నారు. 'రేపిస్ట్ రక్షకులపై' పెనాల్టీ ఉండాలి." అని బృందా అన్నట్లు పేర్కొన్నారు. (ఆర్కైవ్ 1)(ఆర్కైవ్ 2)

“సమస్యను దారి మళ్లించడానికి ప్రభుత్వం దీన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనికి చాలా తక్కువ విశ్వసనీయత ఉన్నందున నేను భయపడుతున్నాను. మేము ఖచ్చితంగా శిక్షను కోరుకుంటున్నాము. ఈ సమస్య భారతీయుల మనస్సులను కదిలించే సమస్యను పరిష్కరించడం లేదు: బృందా కారత్, పోక్సో చట్టాన్ని సవరించే ఆర్డినెన్స్‌పై సీపీఎం" అని ANI పోస్ట్ చూపిస్తుంది.

ఏప్రిల్ 22, 2018న అప్‌లోడ్ చేయబడిన Business Standard రిపోర్ట్‌లో కారత్ ఇలా అన్నారు, "అసలు సమస్య పిల్లలపై అత్యాచారానికి మరణశిక్ష విధించడం కాదు. ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే రేపిస్టులను సమర్థిస్తున్న ప్రభుత్వం."

బృందా కారత్ POCSO చట్టం సవరణ ఆర్డినెన్స్, “డెత్ ఫర్ రేప్” గురించి మీడియాతో మాట్లాడిన ప్రెస్ మీట్ వీడియో కనుగొన్నాం. ఏప్రిల్ 21, 2018న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అప్‌లోడ్ చేసిన ఫేస్‌బుక్ వీడియోలో బృందా కారత్ మీడియాను ఉద్దేశించి మాట్లాడడం చూడవచ్చు. ఈ వీడియోలో 17:47 నిమిషం మార్కు వద్ద బృందా “డెత్ ఫర్ రేప్” గురించి మీడియా సభ్యుడు అడిగిన ప్రశ్నకు ప్రతిస్పందించారు.

వీడియోలో, బృందా మరణశిక్షపై సీపీఐ(ఎం) వైఖరిని సూత్రప్రాయంగా ప్రస్తావిస్తున్నట్లు మనం చూడవచ్చు, అయితే రేపిస్టులకు మరణశిక్ష విధించడానికి సీపీఐ(ఎం) వ్యతిరేకం అని బృందా కారత్ అనలేదు. అలాగే రేపిస్టులకు పార్టీ మద్దతు ఇస్తుందని పేర్కొంటూ ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, బృందా కారత్ వైరల్ పోస్ట్‌లను కొట్టిపారేశాడు.

కాబట్టి, బృందా కారత్ రేపిస్టులకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారన్న క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claim Review:రేపిస్టులకు సీపీఐ(ఎం) అండగా నిలుస్తుందని బృందా కారత్ అన్నారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:క్లెయిమ్ తప్పు. రేపిస్టులకు మద్దతుగా సీపీఐ(ఎం) నిలుస్తుందని బృందా కారత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
Next Story