Hyderabad: ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణ దాస్‌ను దేశద్రోహం కేసులో నవంబర్ 25న బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన ర్యాలీలో దేశ జాతీయ జెండాను అవమానించినందుకు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.
ఈ నేపథ్యంలో కొంతమంది యువకులు ఆవులను కర్రలతో అతి కిరాతకంగా కొడుతున్నవీడియో వైరల్ అవుతోంది. వీడియో బంగ్లాదేశ్ ఇస్కాన్ గోశాలలో ఉన్న జంతువుల మీద జిహాదీలు దాడిచేశారు అనే క్లెయిమ్‌లతో షేర్ చేస్తున్నారు.
వీక్షకులకు విచక్షణ అవసరం: కింది వీడియోలో జంతు హింసకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి, ఇవి కొంతమంది వీక్షకులను కలవరపెట్టొచ్చు. దయచేసి జాగ్రత్త పాటించండి.
ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా వ్రాశారు, "ఈ వీడియో ప్రస్తుతం బంగ్లాదేశ్ లోని జిహదీ మూకలది. ఇస్కాన్ గోశాలలో ప్రవేశించి గోవులపై జిహదీ మూక దాడి చేసిన వీడియో ఇది. హిందువులు పూజించే జీవులు, విగ్రహాలపై ఇంత కసి ఉంటే, ఇక హిందువులు మీద ఎంత కసి ఉంటుందో ఉహించుకోండి.” (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ తనిఖీలో ఈ క్లెయిమ్‌లు అవాస్తవమని, పంజాబ్‌లోని జలంధర్‌లో ఈ ఘటన జరిగిందని తేలింది.
వీడియో కీ ఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా Xలో Journalist Faisal అనే యూజర్ నవంబర్ 19న వైరల్ వీడియో షేర్ చేసిన పోస్ట్ దొరికింది. ఈ పోస్ట్ క్యాప్షన్ ఇలా వ్రాశారు, “ గొంతులేని వాటిని నిర్దాక్షిణ్యంగా కొట్టారు... క్రూరమైన ముఖాలను గుర్తించి శిక్షించండి…” (ఆర్కైవ్)
ఈ పోస్ట్‌పై Peta India స్పందిస్తూ... "భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)లోని సెక్షన్ 325, జంతు క్రూరత్వ నిరోధక చట్టం (పిసిఎ) సెక్షన్ 11 కింద సదర్ పోలీసు స్టేషన్‌లో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఎఫ్‌ఐఆర్‌లో గోహత్య నిరోధక చట్టం (1955) నిబంధనలను చేర్చేందుకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)తో మాట్లాడుతున్నాం.” (ఆర్కైవ్)
Peta India స్పందన ఆధారంగా ఈ సంఘటన భారతదేశంలోనే జరిగిందని అర్థమవుతోంది.
కీవర్డ్ సెర్చ్ ద్వారా, ఈ సంఘటన గురించి Khabristan Punjabi వ్రాసిన ఒక కథనం కనుగొన్నాం. ఈ కథనం ప్రకారం వైరల్ వీడియోలో కనిపిస్తున్న సంఘటన పంజాబ్ జలంధర్‌లోని మిల్క్ కాంప్లెక్స్‌లో జరిగింది. ఈ కథనంలో వైరల్ వీడియో నుండి తీసిన స్క్రీన్ షాట్ ఉపయోగించారు. (ఆర్కైవ్)
ఈ ఘటన గురించి నవంబర్ 20న The Tribune వ్రాసిన ఓ కథనం ప్రకారం, "సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను చూసిన నగరవాసులు, యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్‌కు చెందిన శ్రీస్ట్ బక్షి నేతృత్వంలో, అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు". (ఆర్కైవ్)
వారు పిపిఆర్ మాల్ బయట నిరసన చేసి జంషార్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లినట్లు The Tribune వ్రాసింది. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులపై, డెయిరీ ఫామ్ యజమానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారని తెలుస్తుంద.
యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసిన ఎఫ్‌ఐఆర్ ఫోటోలు కూడా చూడవచ్చు. (ఆర్కైవ్)
జలంధర్‌లోని యానిమల్ ప్రొటెక్షన్ ఫౌండేషన్‌కు చెందిన యువీ సింగ్ న్యూస్‌మీటర్‌తో మాట్లాడారు. "పంజాబ్ జలంధర్‌లోని జంషెర్ డెయిరీ కాంప్లెక్స్‌లో ఈ సంఘటన జరిగింది. ఎద్దులను కొట్టిన వారు ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చినవారు కావచ్చు. ఇందులో మతపరమైన కోణం లేదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేసాము. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ తర్వాతే నిందితులను గుర్తించడం సాధ్యమవుతుంది ," అన్నారు.
వైరల్ వీడియోలో కనిపిస్తుంది పంజాబ్ జలంధర్‌లో జరిగిన సంఘటన. ఈ సంఘటనలో మతపరమైన కోణం లేదని, ఇది బంగ్లాదేశ్‌లో జరిగిందనే వాదన తప్పు అని న్యూస్‌మీటర్ ధృవీకరించింది.