హైదరాబాద్: 2026 జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను కృత్రిమ మేధ (AI), మౌలిక వసతులు, తయారీ రంగాల్లో గ్లోబల్ పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు.
గత 18 నెలల్లో గూగుల్, ఐబీఎం, విప్రో వంటి ప్రముఖ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా దాదాపు రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, ఇవి ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టికి దోహదపడతాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో NDTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని ఒక చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో చంద్రబాబు నాయుడు పెట్టుబడుల వల్ల “23 లక్షల కోట్ల ఉద్యోగాలు” వస్తాయని చెప్పినట్లుగా చూపించారు.
ఒక ఎక్స్ (X)
యూజర్ ఈ వీడియోను రాష్ట్ర, దేశ, ప్రపంచ జనాభా గణాంకాలతో పోల్చుతూ, “ఆంధ్రప్రదేశ్ జనాభా - 8 కోట్లు. భారతదేశం జనాభా - 150 కోట్లు. మొత్తం ప్రపంచ జనాభా - 800 కోట్లు. కానీ.. తాను మాత్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల కోట్ల ఉద్యోగాలు సృష్టించానని చెప్తున్న సీఎం చంద్రబాబు” అంటూ పోస్టు చేశారు. (
Archive)
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించేదని తేలింది. వైరల్ అవుతున్న క్లిప్ పూర్తి ఇంటర్వ్యూ నుంచి తీసినదీ, అందులో చంద్రబాబు నాయుడు చేసిన సవరణను చూపించకుండా కట్ చేసినదీ అని గుర్తించాం.
NDTV జనవరి 21, 2026న
పూర్తి ఇంటర్వ్యూను అప్‌లోడ్ చేసింది. ఆ వీడియోలో సుమారు 7:50 నిమిషాల సమయంలో చంద్రబాబు నాయుడు తొలుత తప్పుగా “23 లక్షల కోట్ల ఉద్యోగాలు” అని అంటారు. అయితే వెంటనే ఆయన తన మాటను సరిచేసుకుంటూ, పెట్టుబడుల వల్ల “23 లక్షల ఉద్యోగాలు” మాత్రమే వస్తాయని స్పష్టం చేస్తారు.
NDTV ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ కన్వాల్‌తో జరిగిన ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దృష్టికోణం, మౌలిక వసతుల అభివృద్ధి, సంపద సృష్టి, ప్రజల కేంద్రంగా ఉండే వృద్ధి విధానాలపై విస్తృతంగా వివరించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిన్న వీడియోలు మాత్రం ఈ సవరణను తొలగించి, మాట తప్పిదాన్ని క్లెయిమ్‌లా ప్రచారం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ప్రచారం అవుతున్నది నిజం కాదు. NDTV ఇంటర్వ్యూలో జరిగిన మాట తప్పిదాన్ని వెంటనే సరిచేసిన విషయాన్ని దాచిపెట్టి, క్లిప్‌ను తప్పుదారి పట్టించే విధంగా వైరల్ చేస్తున్నారు. కాబట్టి ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించేదే.