సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ ప్రకటనలు - తెలుగు రాష్ట్రాలలో కోట్ల రూపాయల ఖర్చు
ఇటీవలి భారత సార్వత్రిక ఎన్నికలలో, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు డిజిటల్ ప్రకటనలపై ఎక్కువగా దృష్టి సారించాయి, ప్రాక్సీ పేజీలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనలను అమలు చేయడానికి భారీ మొత్తం ఖర్చు చేయబడింది.
By Newsmeter Network Published on 21 Jun 2024 1:22 PM ISTఈ కథనం తెలుగు పోస్ట్ సహకారంతో ప్రచురించబడింది. దీనికి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిస్ట్‌ల [ICFJ] నిరాయుధ తప్పుడు సమాచారం ప్రోగ్రాం మద్దతు ఇచ్చింది.
భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియకు మూలస్తంభమైన లోక్‌సభ ఎన్నికలు, కఠినమైన రాజకీయ ప్రచారానికి, శక్తివంతమైన ఎన్నికల డైనమిక్స్‌కు దృశ్యకావ్యం. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం దేశం సిద్ధమవుతున్న సమయంలో, సాంప్రదాయక ఆన్-ది-గ్రౌండ్ ప్రచారాలు ఇంకా డిజిటల్ వ్యూహాల ప్రభావం కొత్త ఎత్తులకు చేరుకుంది.
పొలిటికల్ అడ్వర్టైజింగ్ అనేది అభ్యర్థులు ప్రజలకు చేరువ అవ్వాలని చేసే ప్రయత్నం. ముఖ్యంగా ఏమి చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అనే విషయాలు ప్రజలకు తెలియజేయడం ఇందులో భాగమే!! ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయడానికి సాధారణంగా ప్రకటనలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా తమకే ఓటు వేయమని ఓటర్లను కోరుతూ ఉంటారు. తమకు అనుకూలమైన అంశాలను మాత్రమే కాకుండా.. ప్రత్యర్థి చేసే పనులపై వ్యతిరేకత తీసుకుని రావడానికి కూడా ప్రయత్నిస్తారు.
గతంలో, రాజకీయ పార్టీ ప్రచార ప్రకటనలు న్యూస్ పేపర్ ప్రకటనలు, బిల్‌బోర్డ్‌లు, బ్రోచర్‌లు, రేడియో, టీవీ ప్రకటనలు, ఈ మెయిల్‌ల రూపంలో ఉండేవి. అయితే ఇటీవలి సంవత్సరాలలో సోషల్ మీడియాను రాజకీయ ప్రచారం కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ప్రచారాలను నిర్వహించేందుకు బలమైన సోషల్ మీడియా బృందాలను తయారు చేసుకున్నాయి.
భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారులలో ఒకటి. మిలియన్ల మంది ఓటర్లతో కనెక్ట్ కావడానికి రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా, ఇంకా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఎక్కువగా ఉపయోగించుకున్నాయి.
ఎన్నికల ప్రచార వ్యూహాలలో, రాజకీయ కథనాలను రూపొందించడంలో, వాటిని వ్యాప్తి చేయడంలో, ఇంకా ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, ఆలోచనల-ఆదర్శాల యుద్ధభూమిగా మారుతోంది. ఈ మా నివేదిక జనవరి నుండి ఏప్రిల్ వరకు మేము జరిపిన పరిశోధన సారాంశం. ఈ నివేదిక ప్రచురించే సమయానికి దేశంలో, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దేశంలో NDA, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో TDP-BJP-JSP అధికారాన్ని స్థాపించాయి. ఈ రిపోర్టులో పేర్కొన్నట్టు, YSRCP ప్రచారానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా, అనుకున్న విజయాన్ని సాధించలేకపోయిందన్న అంశాన్ని మేము పరిగణనలోకి తీసుకున్నాము.
ఇది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను ఏ విధంగా ఉపయోగించుకున్నాయో విశ్లేషించే అధ్యయనం మాత్రమేనని పాఠకులు గుర్తించాలి.
మెథడాలజీ
తెలుగు రాష్ట్రాల్లో BJP, కాంగ్రెస్, YSRCPల ప్రాక్సీ/ఫ్యాన్ పేజీల ద్వారా నడిచే రాజకీయ ప్రకటనలను విశ్లేషించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. దీని కోసం, జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో రాజకీయ ప్రకటనల డేటాను, మెటా యాడ్ లైబ్రరీ నుండి సేకరించాము. మా అధ్యయనం డేటాబేస్ జాబితాలోని మొదటి 10 పేజీలపై దృష్టి సారించి, BJP, కాంగ్రెస్ లేదా YSRCPకు అనుకూలంగా ప్రకటనలను ప్రదర్శించే అనధికారిక పేజీలను ఫిల్టర్ చేసి, ఎంగేజ్‌మెంట్ ఆధారంగా ఈ పేజీల నుండి పోస్ట్‌లను వేరు చేసి, ఒక మిలియన్ కంటే ఎక్కువ ఇంటరాక్షన్‌లు ఉన్నవాటిని శాంపిల్ చేసాము.
మెటా యాడ్ లైబ్రరీ అనేది యాడ్ పారదర్శకత కోసం సమగ్రమైన, శోధించదగిన డేటాబేస్. ఖర్చుపై, రీచ్ పై ఇంకా ఫండింగ్ ఎంటిటీలతో సహా మెటా టెక్నాలజీలలో వారు చూసే ప్రకటనల గురించి వివరణాత్మక సమాచారాన్ని వినియోగదారులకు ఇది అందిస్తుంది. సామాజిక సమస్యలు, ఎన్నికలు లేదా రాజకీయాలకు సంబంధించిన ప్రకటనల అదనపు సమాచారాన్ని కూడా అందిస్తుంది, ఈ ప్రకటనలు యాక్టివ్‌గా ఉన్నా లేదా నిష్క్రియంగా ఉన్నా వాటిని ఏడేళ్ల పాటు యాడ్ లైబ్రరీలో నిల్వ చేస్తుంది.
మెటా ప్రకటనలు ఎలా పని చేస్తాయి
నిర్దిష్ట భౌగోళిక స్థానాల్లో ఓటర్ల అభిప్రయాలను నిర్ణీత వ్యవధిలో ప్రభావితం చేయడమే మెటాలోని రాజకీయ ప్రకటనల లక్ష్యం. ఈ ప్రకటనలు వినియోగదారుల ఫేస్‌బుక్ లేదా ఇంస్టాగ్రామ్ ఫీడ్‌లలో "ప్రాయోజిత" / "చెల్లించబడినవి [ప్రకటనకర్త పేరు]" వంటి ట్యాగ్‌లతో కనిపిస్తాయి. ప్రకటన కోసం ఎవరు డబ్బు చెల్లించారో వీక్షకులు అర్థం చేసుకోవడానికి ప్రకటనదారు గుర్తింపుపై పారదర్శకత చాలా కీలకం. ఉదాహరణకు, ‘వాయిస్ ఆఫ్ ఆంధ్ర’ అనే పేజీ, I-PAC నెట్‌వర్క్‌లో భాగం. ‘వాయిస్ ఆఫ్ ఆంధ్ర’ పేజీ లో YSRCP ప్రకటనలను మనం చూడొచ్చు. I-PAC ద్వారా YSRCP ప్రకటనలు ‘వాయిస్ ఆఫ్ ఆంధ్ర’పేజీలో రన్ అవుతున్నాయని ఒక సాధారణ వినియోగదారుడు గుర్తించడం కష్టం.
మెటా యాడ్ లైబ్రరీ ప్రచురించిన సమాచారం ప్రకారం, జనవరి-ఏప్రిల్ మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయ ప్రకటనల కోసం అత్యధికంగా ఖర్చు చేసిన పేజీల నుండి మేము డేటాను ఫిల్టర్ చేసాము. ప్రకటనల ద్వారా నిర్దిష్ట పార్టీకి మద్దతు ఇచ్చే ఇతర పేజీలు ఇవి అయితే పార్టీతో అధికారిక అనుబంధం లేనివిగా పరిగణించబడతాయి. ఈ పేజీలు ప్రాక్సీ పేజీలుగా వర్గీకరించబడ్డాయి.
అయితే, ఈ డేటా విశ్లేషణ నుండి అధికారిక పార్టీ పేజీలు, నాయకులు వ్యక్తిగత పేజీలలో నిర్వహించే ప్రకటనలు మినహాయించబడ్డాయి.
టాప్ 100 పేజీలలో ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలకు సంబంధించిన టాప్ ప్రాక్సీ పేజీల జాబితాను, వారు ఖర్చు చేసిన మొత్తం ఇంకా వాటి ర్యాంకింగ్‌లను చూడండి.
టాప్ ప్రాక్సీ పేజీలలో, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ [YSRCP] ఇంకా భారతీయ జనతా పార్టీ [BJP]కి అనుబంధంగా ఉన్న పేజీలను మేము గమనించాము.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అనుబంధం ఉన్న టాప్ 4 ప్రాక్సీ పేజీలను, అలాగే భారతీయ జనతా పార్టీతో అనుబంధం ఉన్న ఒక ప్రాక్సీ పేజీని, ప్రకటనలు ఫేస్‌బుక్ పేజీలలోని పోస్ట్‌ల ద్వారా షేర్ అయిన కంటెంట్‌ను మేము సమగ్రంగా విశ్లేషించాము.
అదనంగా, మీరు ఈ పేజీల స్పాన్సర్‌లు, పేజీ క్రియేషన్ డేట్స్, పేజీ ఫాలోవర్స్ [జూన్ 9 నాటికి] ఇంకా జనవరి-ఏప్రిల్ నెలలలో ప్రతి పేజీపై ఖర్చు చేసిన మొత్తాన్ని చూడవచ్చు.
అధికారిక YSR కాంగ్రెస్ పార్టీ పేజీ జనవరి-మార్చి నెలలలో ప్రకటనలు విడుదలచేయనప్పటికీ, పార్టీ తరఫున దాదాపు 11 పేజీల నెట్‌వర్క్, సోషల్ మీడియా ప్రకటనలలో అత్యధికంగా ఖర్చు చేసాయి. వీటిలో, జూన్ 2023లో ప్రారంభమైన "జగనన్న సురక్ష", జూలై 2022లో ప్రారంభమైన "జగనే కావాలి" అనే పేజీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు పేజీలకు ఉమ్మడి ప్రకటనదారు "జగనే కావాలి". ఈ పేజీ ఏప్రిల్‌లో YSRCP అధికారిక ఫేస్‌బుక్ పేజీలో కూడా ప్రకటనలను ప్రసారం చేసింది. ఇది ఈ పేజీలకు, పార్టీకి మధ్య సంబంధాన్ని స్పష్టం చేస్తుంది.
నెట్‌వర్క్‌లోని పురాతన పేజీ "జగనన్న కి తోడుగా" 2017లో ప్రారంభించబడి, ప్రకటన ఖర్చులో మూడవ స్థానంలో ఉంది. 2022 వరకు, ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ [I-PAC] ఈ పేజీకి ప్రకటనలు అందించింది. అయితే, 2024 ఎన్నికలకు ముందు, "జగనన్న కి తోడుగా" పేరుతో మాత్రమే ప్రకటనలు వచ్చాయి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, నెట్‌వర్క్‌లోని మిగిలిన పేజీలు ప్రకటనలను ప్రచురిస్తున్నప్పుడు, అవి వేర్వేరు డిస్క్లైమర్స్ క్రింద ఉన్నాయి. అయినప్పటికీ, ఈ పేజీలన్నీ ప్రకటనకర్తల ఫోన్ నంబర్‌లుగా రెండు నంబర్లను మాత్రమే పొందుపరిచాయి. ఈ పేజీలలో ఎక్కువ భాగం విజయవాడలోని “పై ఇంటర్నేషనల్” అనే ఎలక్ట్రానిక్స్ స్టోర్ చిరునామాను నమోదు చేసింది [“పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్”, DNO 40 1 99D NO 40 1 100, రెవెన్యూ వార్డు నెం 11లో బ్లాక్ నెం 6, మున్సిపల్ వార్డు, 8C, MG రోడ్, బెంజ్ సర్కిల్ దగ్గర, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, 520010]. బెంజిసర్కిల్‌లోని I-PAC కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఈ స్టోర్‌లో ఎన్నికల అనంతరం సీఎం జగన్ వార్‌రూమ్ సభ్యులను సందర్శించారు.
11 పేజీల్లో రెండు పేజీలు జగన్ ఫ్యాన్ పేజీలు అంటూ తమ బయోలో స్పష్టంగా పేర్కొన్నాయి. F-JAC అనే పొలిటికల్ కన్సల్టెన్సీని నడుపుతున్న మహమ్మద్ ఇర్ఫాన్ బాషా, పైపైన మనకు కనిపించేవి మంచుకొండ యొక్క కొన మాత్రమేనని, లోతుగా పరిశీలిస్తే ఇంకా చాలా వాటిని గుర్తించవచ్చని సూచిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలోని వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో కలిసి పనిచేసిన ఇర్ఫాన్ ఇలా వివరించారు, “ఒక అభ్యర్థి మమ్మల్ని సంప్రదించినప్పుడు, మేము వివిధ సామాజిక సమూహాలను లక్ష్యంగా చేసుకుని బహుళ పేజీలను సృష్టిస్తాము.
సాధారణంగా, గరిష్టంగా రెండు పేజీలను మాత్రమే నేరుగా పార్టీ నిర్వహిస్తుంది; మిగిలినవి ఎన్నికల సమయంలో కన్సల్టెన్సీల ద్వారా నిర్వహించబడతాయి. ఉదాహరణకు, ఒక BJP అభ్యర్థి మతపరమైన పోస్ట్‌లను ప్రోత్సహించే పేజీని కలిగి ఉండవచ్చు, అయితే అదే అభ్యర్థికి సంబంధించిన మరొక పేజీ, వివిధ ప్రజా సమూహాలను ఆకర్షించడానికి ప్రభుత్వ అభివృద్ధి విధానాలపై మాత్రమే దృష్టి పెడుతుంది."
ఆంధ్రప్రదేశ్‌లో, రాజకీయ పార్టీలు తరచూ ఒక్కో నియోజకవర్గానికి వేర్వేరుగా కన్సల్టెంట్లను నియమించుకుంటాయి. ముఖ్యమంత్రిని నేరుగా సంప్రదించగల సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ తమ ఎన్నికల ప్రచారం కోసం నిర్దిష్ట కన్సల్టెన్సీని నియమిస్తారు. దీంతో ఏ నియోజకవర్గం మెరుగ్గా ఉంటుందని స్థానిక నేతల మధ్య పోటీ నెలకొంటుంది.
YSRCP ఎన్నికలకు కనీసం ఏడెనిమిది నెలల ముందు వారి ఆన్‌లైన్ ప్రచారాలను ప్రారంభించిందని, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో TDP కంటే చాలా ముందుందని ఇర్ఫాన్ గుర్తించారు. “ఎన్నికల ముందు, YSRCP ప్రచార పోస్ట్‌లను పోస్ట్ చేయడానికి స్టైఫండ్‌లను అందజేసే ప్రకటనలను ప్రసారం చేసింది. యువకులకు 30 రోజులపాటు ఒక్కో పోస్టుకు రూ.1000 చెల్లించారు. వారు చేయాల్సిందల్లా వాట్సాప్ గ్రూప్ నుండి కంటెంట్‌ని కాపీ చేసి, వారి వ్యక్తిగత ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లలో అతికించడమే."
సోషల్ మీడియాలో ఇటువంటి టార్గెట్టెడ్ ప్రచారాలు ప్రజాభిప్రాయాలను ప్రభావితం చేయడంలో భాగమని ప్రజలు గుర్తించడం అరుదు. ఎవరైనా పోస్ట్‌ను షేర్ చేసినప్పుడు, అది వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరి, ఆ సందేశం మరింత వ్యాప్తి చెందుతుంది.
యాడ్ లైబ్రరీ ఇంకా ఫేస్‌బుక్ పేజీల కంటెంట్ విశ్లేషణ
ఎన్నికలకు ముందు వచ్చిన ప్రకటనలు, ఆర్థిక వ్యవస్థ, సంక్షేమ పథకాలు, కుల సమస్యలతో సహా వివిధ రంగాలలో ప్రతిపక్షాలపై దాడి చేయడంపై దృష్టి సారించాయి. విపక్షాల ట్రాక్ రికార్డ్ ను వారి ప్రతిపాదనలను విమర్శిస్తూనే, సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వ విధానాలను హైలైట్ చేస్తుండేవి. ప్రకటనలోని కంటెంట్ విపక్షాలకు వ్యతిరేకంగా, జగన్‌కు అనుకూలంగా ఉండడం మేము గమనించాం. అధికార, ప్రతిపక్షాల మధ్య వైరుధ్యాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రతిపక్షాల విశ్వసనీయతను దెబ్బతీసి, జగన్‌కు మద్దతు కూడగట్టడంమే ఈ వ్యూహ లక్ష్యం.
ఎన్నికలు ప్రకటించిన తర్వాత, ప్రకటనల కంటెంట్ ఒక్కసారిగా మారిపోయింది. YSRCP నిర్వహించిన సమావేశాలలో, ముఖ్యంగా “సిద్దం సభ”లో సీఎం జగన్ చేసిన ప్రసంగాలపై కి దృష్టి మరల్చింది. ర్యాంప్ వాక్, ప్రజా సమస్యలపై ఆయన హృదయపూర్వక స్పందనలు, వృద్ధులు, చిన్నారుల నుదిటిపై ముద్దులు పెట్టడం వంటి ప్రచార హావభావాలతో సహా సమావేశాల్లో జగన్ డైనమిక్ ఉనికిని ఈ ప్రకటనలు ప్రదర్శించాయి. చాలా యాడ్స్‌లో ముఖ్యమంత్రి జగన్‌ను హీరోగా, ఆంధ్రప్రదేశ్‌లోని పేదలకు రక్షకుడిగా చిత్రీకరిస్తూ బహిరంగ సభలకు పెద్ద ఎత్తున హాజరవుతున్న జనసమూహాన్ని చూపిస్తూ, తద్వారా వారి మద్దతును జగన్ కి తెలుపుతున్నట్టు కంటెంట్ ను ప్రమోట్ చేసారు . జనాదరణ పొందిన నేపథ్య సంగీతం, సీఎం జగన్ గురించి పాటలు, ముఖ్యంగా విస్తృతంగా ప్రజాదరణ పొందిన "జగన్ అజెండా సాంగ్" ఈ విజువల్స్‌తో పాటు ఉన్నాయి. ప్రతి యాడ్ సాధారణంగా డ్రోన్ షాట్‌లతో కూడిన భారీ జనాలను బంధించడం, సీఎం జగన్ "రెండు చేతులు జోడించి నమస్కారం" ప్రదర్శించడం వంటివి ఉంటాయి ఇక్కడ . ఈ ప్రకటనల్లో వివిధ సంక్షేమ పథకాలను హైలైట్ చేస్తూ, లబ్ధిదారులు సీఎం జగన్ను, YSRCPని ప్రశంసిస్తున్న ప్రశంసాపత్రాలు ఉన్నాయి.
ఇక ఫేస్‌బుక్ పేజీ కంటెంట్ ఎక్కువగా ప్రతిపక్ష పార్టీలను విమర్శించే మీమ్స్, యానిమేషన్స్ ఇక్కడ పై దృష్టి పెట్టింది ఇక్కడ ఇక్కడ. ఈ కంటెంట్‌లో తరచుగా ప్రతిపక్ష నాయకులపై బూటకపు ప్రచారం ఉంటుంది ఇక్కడ. ఇది జగన్ నాయకత్వం ఇంకా ప్రతిపక్షాల మధ్య విభేదాలను నొక్కి చెబుతుంది.
చాలా సందర్భాలలో, ఒకే యాడ్ అన్ని YSRCP పేజీలలో ప్రచారమవుతుంది [ ఈ యాడ్ , ఈ యాడ్ ఇలా కొన్ని యాడ్లను, అన్ని పేజీలలో చూడొచ్చు] YSRCP ఫేస్‌బుక్ పేజీ కంటెంట్ కూడా అన్నిఫేస్‌బుక్ పేజీలలో ఒకే విధంగా ఉంటుంది. అన్ని అగ్ర YSRCP పేజీలలో అవే ప్రకటనలు నడుస్తున్నట్లు మేము గమనించాము. స్పాన్సర్ పేర్లు, అన్ని పేజీలలో ఒకేలాంటి కంటెంట్, పేజీ బయోలో ఒకే చిరునామా వంటి వివరాలు అన్నీ పేజీల మధ్య ఉన్న పరస్పర సంబంధాలను(నెట్వర్క్), ఇవి ఒకే బృందంచే నిర్వహించబడుతున్నాయని సూచిస్తున్నాయి.
YSRCPని రెండవ సారి అధికారంలోకి తీసుకురావడానికి I-PAC సీఎం జగన్‌తో చాలా సన్నిహితంగా పనిచేసింది. ఈ సమన్వయం అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ప్రణాళికాబద్ధమైన కంటెంట్ ప్రకటన, పంపిణీపై నియంత్రణ, ఒకే రకమైన కంటెంట్ ను ప్రమోట్ చేస్తున్న తెలివైన ప్రచార వ్యూహాన్ని స్పష్టం చేస్తుంది. I-PAC ప్రధాన కార్యాలయంలో "ఆపరేషన్స్ హబ్"కు ఉన్న వ్యూహాత్మక స్థానం, ప్రచార కంటెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో, వ్యాప్తి చేయడంలో I-PAC - YSRCPల మధ్య సమీకృత ప్రయత్నాలను స్పష్టం చేస్తుంది.
BJPకి అనుబంధంగా ఉన్న 'మన మోదీ' పేజీలోని ప్రకటనలు మోదీ రోడ్‌షోలను ప్రముఖ సినిమాల నేపథ్య సంగీతం తో జోడించి, ఆయనను గొప్ప వ్యక్తిగా చిత్రీకరిస్తున్నాయి ఇక్కడ.
ప్రకటన కంటెంట్ ప్రతిపక్ష వ్యతిరేకతను, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలను చెబుతున్నాయి. మోదీ ఇమేజ్‌ను పెంచేందుకు, ఆయన నాయకత్వాన్ని ప్రదర్శించేందుకు 'మన మోదీ సంతకం' , 'సమర్ధుడి సంకల్పం' వంటి వివిధ ప్రచారాలను పేజీ నిర్వహిస్తుంది. మరో ముఖ్యమైన ప్రచారం, 'మన మోదీ ABCD అభివృద్ధి' ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన పనులు, నిధులపై ప్రత్యేక దృష్టి సారించి, కేంద్రంలోని NDA ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను హైలైట్ చేస్తుంది ఇక్కడ. మరియు రిజిస్టర్ చేసుకోవడానికి, మోదీకి మద్దతును తెలియజేయడానికి వినియోగదారుని వెబ్‌సైట్‌కి మళ్లించే ప్రకటనలు.
ఈ ప్రచారాలు మోదీ సాధించిన విజయాలను, దేశాభివృద్ధికి NDA నిబద్ధతను ప్రచారంచేస్తూ, BJP రాజకీయ సందేశాన్ని, ప్రజల్లో మద్దతును బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
రాజకీయ పార్టీలు వెబ్‌సైట్ల ద్వారా డేటాను సేకరించడం గురించి ఇర్ఫాన్ మాట్లాడుతూ, “ఈ కాలంలో, ఒక నియోజకవర్గంలోని ఓటర్ల ఫోన్ నంబర్‌లను పొందడం పెద్ద కష్టం కాదు. మీరు ఒక నియోజకవర్గంలోని మొత్తం 20 లక్షల మందికి ప్రచార సందేశాలు లేదా కాల్స్ చేయచ్చు. అయితే, వారందరికీ మీ పార్టీ లేదా సిద్ధాంతంపై ఆసక్తి ఉండదు. మరోవైపు, మోదీకి మద్దతునిచ్చే సర్టిఫికేట్‌ను పొందేందుకు తమ నంబర్‌ను పంచుకునే వారు, బిజెపికి అంకితమైన మద్దతుదారులు. ఇటువంటి ఆన్‌లైన్ ప్రచార సాధనాల ద్వారా, పార్టీలు తమ నిజమైన మద్దతుదారులను గుర్తించి, వారికి టార్గెట్టెడ్ కంటెంట్‌ను పంపగలరు."
దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు మరియు అభ్యర్థులు ఇదే విధమైన వ్యూహాలను అనుసరిస్తున్నారు.
మాజీ కేంద్ర మంత్రి, BJP తిరువనంతపురం లోక్‌సభ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ కోసం ఆన్‌లైన్ ప్రచారాలను నిర్వహించే “కాన్సెప్ట్ కమ్యూనికేషన్”లోని డిజిటల్ అనలిస్ట్ కిరణ్ నాథ్, చంద్రశేఖర్ కోసం ఎన్నికల ప్రకటనలను అమలు చేయడానికి పనిచేసిన బృందం అనేక కొత్త ఫేస్‌బుక్ పేజీలను కొనుగోలు చేసిందని మాకు చెప్పారు. ఈ ప్రకటనలు BJP లేదా చంద్రశేఖర్‌తో పేజీకు ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని బహిర్గతం చేయకుండా ప్రదర్శించబడ్డాయి.
కిరణ్ బృందం, అధికారిక ఖాతాల ద్వారా స్వీయ ప్రమోషన్ కంటే, థర్డ్-పార్టీ ఎండార్స్‌మెంట్స్ లేదా సర్రోగేట్ యాడ్‌ల ద్వారా ప్రమోట్ చేసుకోవడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని నమ్మింది. ఏప్రిల్ నెలలో కేరళ నుండి వచ్చిన మెటా యాడ్ లైబ్రరీ రిపోర్ట్‌లోని టాప్ టెన్ పొలిటికల్ అడ్వర్టైజర్‌లలో, టీమ్ రెండు పేజీలు-Change4TVM , TVM Talks, యాడ్‌లను రన్ చేయడానికి ఉపయోగించబడ్డాయని తెలిసింది. తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ చేతిలో దాదాపు 15,000 ఓట్ల తేడాతో చంద్రశేఖర్ ఓడిపోయారు.
ఖర్చు చేసిన మొత్తం ఆధారంగా టాప్ యాడ్‌లను, వాటి కంటెంట్‌ను విశ్లేషిద్దాం.
'జగనన్న సురక్ష' పేజీ అగ్ర ప్రకటనలు విభిన్న కంటెంట్, ఇంకా ఖర్చుల లెక్కలను అందించాయి. ఖర్చు చేసిన మొత్తం పరంగా టాప్ యాడ్, TDP నాయకుడు నారా లోకేష్, JSP అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ కేంద్రీకృతమై హాస్యభరితమైన యానిమేటెడ్ వీడియోను కలిగి ఉన్నాయి. ఇది రెండు పార్టీల మధ్య అధికార భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తుంది. దీని ఖర్చు రూ. 3.5 నుండి 4 లక్షలు.
దీనికి విరుద్ధంగా, రెండవ ప్రకటన, YSRCP ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ధిదారులను ప్రదర్శించడంపై దృష్టి పెట్టింది. సీఎం జగన్‌ను స్తుతిస్తూ ఒక ప్రముఖ పాటతో పాటు, 'మా నమ్మకం నువ్వే జగన్' నినాదాన్ని నొక్కిచెప్పిన ఈ ప్రకటన, జగన్ నాయకత్వం, ప్రజా సంక్షేమం పట్ల ఆయన ఆయనకు నిబద్ధత ఉందన్న కథనాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. దీని మొత్తం ఖర్చు రూ. 2.5 నుంచి 3 లక్షలు.
'జగనే కావాలి' పేజీలో అత్యధిక వ్యయంతో తొలి యాడ్ కొరకు చేసిన ఖర్చు రూ. 2 నుండి 2.5 లక్షలు, “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర నుండి విజువల్స్, సీఎం జగన్‌కు అంకితం చేసిన ప్రముఖ పాటతో పాటుగా ప్రదర్శించబడుతుంది. ఈ ప్రకటన యాత్ర సారాంశాన్ని, భారీ సంఖ్యలో హాజరైన ప్రేక్షకులను చిత్రీకరిస్తూ జగన్ ప్రచారంలో ఉన్న ఉత్సాహాన్ని హైలైట్ చేస్తుంది.
రెండో యాడ్ కొరకు చేసిన ఖర్చు రూ. 2 నుండి 2.5 లక్షలు, YSRCP - 'YSR చేయూత' పథకంపై దృష్టి పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమం, ఆర్థికంగా వెనుకబడిన, 45-60 సంవత్సరాల వయస్సు గల మహిళలకు, ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రకటనల ద్వారా, 'జగనే కావాలి' పేజీ, YSRCP రాజకీయ ప్రయత్నాలు, దాని సంక్షేమ కార్యక్రమాలు రెండింటినీ సమర్థవంతంగా ప్రచారం చేస్తుంది.
'జగనన్న కి తోడుగా' పేజీలో మొదటి యాడ్ కొరకు చేసిన ఖర్చు, రూ. 2.5 నుండి 3 లక్షలు, 'జావో బాబు' పేరుతో ఒక నిమిషం నిడివి గల యానిమేషన్ పాటను ఉంది. ఈ పాట ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన దాడి. రాజకీయ సందేశాన్ని తెలియజేయడానికి డబ్బింగ్ సాహిత్యంతో ఒక ప్రసిద్ధ చలనచిత్ర పాటను తెలివిగా పునర్నిర్మించారు. నాయుడుని విమర్శించడానికి, జగన్ ఎజెండాను ప్రచారం చేయడానికి ఈ ప్రకటన సృజనాత్మక అంశాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది.
రెండవ యాడ్, కూడా రూ. 2.5 నుండి 3 లక్షలు ఖర్చుతో, 'జగన్ కా హుకుం' అనే టైటిల్ పెట్టి నేరుగా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసింది. అన్యాయాలు, రాజకీయ ఘర్షణలకు ప్రతిస్పందనగా సిఎం జగన్, నాయుడుపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్టున్న దృశ్యాలను ప్రదర్శిస్తుంది. ఈ ప్రకటనల ద్వారా, 'జగనన్న కి తోడుగా' పేజీ తన ప్రేక్షకులను ఆకర్షించడానికి, జగన్ నాయకత్వానికి మద్దతును పెంచడానికి సృజనాత్మక రీతిలో ఘర్షణ వ్యూహాలను ఉపయోగిస్తుంది, అదే సమయంలో అతని రాజకీయ ప్రత్యర్థులను అప్రతిష్టపాలు చేస్తుంది.
'మేము సిద్దం మా బూత్ సిద్ధం' పేజీలో, గణనీయంగా రూ. 9 నుండి 10 లక్షల ఖర్చుతో రూపొందించిన మొదటి ప్రకటన, ప్రతిపక్ష పార్టీల చిహ్నాలను అవహేళన చేస్తూ, తన పార్టీ గుర్తు అయిన 'ఫ్యాన్'కు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తూ సిఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ప్రముఖంగా ఉంది. ఈ యాడ్ జగన్ చరిష్మా మరియు వాక్చాతుర్యాన్ని ఉపయోగించి YSRCPకి మద్దతును కూడగట్టడానికి, ప్రతిపక్షాన్ని దెబ్బతీసే విధంగా చిత్రీకరించబడింది.
ఇందులో కూడా, రెండవ యాడ్, రూ. 2 నుండి 3.5 లక్షల ఖర్చుతో, 'జగన్ కా హుకుం' అనే టైటిల్ పెట్టి నేరుగా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసింది. ఈ ప్రకటనల ద్వారా, 'మేము సిద్దం మా బూత్ సిద్దం' పేజీ జగన్ విజ్ఞప్తిని, YSRCP పార్టీ రాజకీయ సందేశాలను స్పష్టం చేస్తూ, సమర్ధవంతంగా మద్దతుదారులను సమీకరించడానికి, ఎన్నికలకు ముందు వారి ప్రచార వ్యూహాన్ని మరింత పటిష్టం చేయడంలో భాగం.
ఇక బీజేపీ అనుబంధ పేజీ 'మన మోడీ'లో టాప్ యాడ్ కొరకు చేసిన ఖర్చు రూ. 4.5 నుండి 5 లక్షలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లను విజయవంతంగా పూర్తి చేసి, కేటాయించామని, ప్రజల కలలను నెరవేర్చారని చెప్పుకుంటున్నది.
రెండవ టాప్ యాడ్, రూ. 2.5 నుండి 3 లక్షల ఖర్చుతో, BJPతో అనుబంధించబడిన వెబ్‌సైట్‌కి వినియోగదారులను నిర్దేశిస్తుంది. ఇక్కడ, సందర్శకులు నమోదు చేసుకోవడానికి, ప్రధాని నరేంద్ర మోడీకి, BJPకి తమ మద్దతును తెలియజేయమనే ప్రాంప్ట్ వస్తుంది. ఈ వ్యూహాత్మక చర్య మద్దతుదారులను సమీకరించడం, పార్టీ పునాదిని బలోపేతం చేయడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం, పార్టీ అనుచరుల మధ్య ఐక్యత విధేయతలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రకటనలపై పార్టీల అధికారిక పేజీలు ఖర్చు చేసిన మొత్తం
భారతీయ జనతా పార్టీ-ఆంధ్రప్రదేశ్ [BJP] రూ. 6226177. తెలుగుదేశం పార్టీ [TDP] రాజకీయ ప్రకటనలపై రూ. 2076680. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ [YSRCP] ఆగస్ట్ 2023లో దాని చివరి ప్రకటన తర్వాత ఏప్రిల్ 2024లో యాడ్స్ ప్రసారం చేసింది, మొత్తం రూ. 762605. అదేవిధంగా, జనసేన పార్టీ కూడా ఏప్రిల్ 2019లో దాని చివరి ప్రకటన తర్వాత ఏప్రిల్ 2024లో ప్రకటనలను ప్రసారం చేసింది, దీని ఖర్చు రూ. 245772. అయితే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ [INC] ఫిబ్రవరి 2021 తర్వాత ఎలాంటి ప్రకటనలను ప్రదర్శించలేదు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రకటనల విశ్లేషణ
ఇక తెలంగాణపై దృష్టి సారించినట్టయితే, మా పరిశోధనలో, జనవరి - మార్చి 2024 కాలానికి, BJP, YSRCPలకు సంబంధించిన అధికారిక పేజీలు కాకుండా, ‘మన మోడీ’, ప్రశ్నిస్తున్న తెలంగాణ, తెలంగాణా సెంట్రల్, MemeXpress అనే పేజీలు పొలిటికల్ ప్రకటనల్లో భాగమయ్యాయి. ఈ పేజీల్లో చాలా వరకు అవి ఏ పార్టీకి లింక్ ఉన్నట్లు కనిపించవు. మరీ ముఖ్యంగా ఏ పార్టీ లోగోలను కూడా ప్రదర్శించవు. కానీ ఆయా పార్టీలకు అనుకూలంగా, ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా పోస్టులు మాత్రం పెడుతూ ఉంటాయి. ఇది కూడా ఎన్నికల వ్యూహంలో భాగమే.
తెలంగాణ టాప్ 10 ప్రకటనదారులు
‘మన మోడీ’[Mana Modi] అనే పేజీని తెలంగాణలో కూడా అమలు చేశారు, భారతదేశంలో మరోసారి మోదీ ప్రధానమంత్రిగా అవ్వాలని పేజీ ప్రయత్నిస్తోందని స్పష్టంగా కనపడుతుంది. ఈ పేజీని జూలై 2023లో ప్రారంభించారు. నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పేజీని ఫాలో అవ్వాలని పేజీలో స్పష్టంగా పేర్కొంది. ఈ పేజీ నుండి manamodi.com వెబ్‌సైట్‌కి కూడా లింక్ అవుతుంది.
ఈ పేజీలో బీజేపీ ప్రభుత్వం చేసిన పనులకు సంబంధించిన ప్రకటనలను చూపుతూ ఆ పోస్ట్‌లతో మోదీకి మద్దతు కూడగట్టే ప్రచారం మనం చూడొచ్చు. మోదీ ద్వారా ABCD డెవలప్‌మెంట్ సాగుతోందనే శీర్షికతో a నుండి z వరకు వర్ణమాలలను ఉపయోగించి ప్రకటనలను అభివృద్ధి చేశారు. ఉదాహరణకు A అనే అక్షరం గురించి తీసుకుంటే A for - అత్యాధునిక AIIMS అసుపత్రిని ఏపీ ప్రజలకు అందించిన మన మోదీ అంటూ వచ్చిన ప్రకటనను మనం చూడొచ్చు.
'మన మోదీ క్రికెట్ లీగ్‌లో- అయోధ్య మైదానంతో విపక్షాలపై విరుచుకుపడి అఖండ విజయాన్ని సాధించారు' అనే క్యాప్షన్‌లతో కూడిన ప్రకటనలను కూడా అందులో చూడొచ్చు.
ఆసక్తికరంగా, MemeXpress పేజీ ఏప్రిల్ 4 తర్వాత ఎలాంటి పోస్ట్‌లను పంచుకోవడం లేదు. అయితే ఏప్రిల్ 5న, అదే పేరుతో మరో పేజీని సృష్టించారు. తరువాత, పేజీ పేరును MemeXpress నుండి Meme hubగా మారిపోయింది. ఇటువంటి ప్రకటనలనే ప్రచారం చేయడం ప్రారంభించింది. ఈ ప్రకటనల డిస్క్లైమర్ MemeXpress పేరుతో ఉంది.
Meme Hub, Meme Express నిర్వహించే ఫేస్బుక్ పేజీ విభిన్నమైన విధానాన్ని కలిగి ఉంది. ఈ పేజీ ద్వారా వెలువడే ప్రకటనలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని మేము గుర్తించాం. ఈ పేజీ ద్వారా ఎక్కువగా ప్రచారం చేసిన ప్రకటనలు INDIA కూటమిలోని పార్టీ నాయకులకు సంబంధించినవే.. ఆయా పార్టీ నాయకులను ఇందులోని పోస్టుల ద్వారా అపహాస్యం చేస్తూ కనబడతాయి. మేము ఇందులో BRS వ్యతిరేక ప్రకటనలు ఏవీ కనుగొనలేకపోయాం. ప్రకటనలు ఎక్కువగా ఇంగ్లీష్, హిందీ భాషలలో ఉన్నాయి.
ఈ పేజీకి సంబంధించిన ప్రకటనలలో కొన్ని:
కాంగ్రెస్ ఒక ప్రో పాకిస్తానీ పార్టీ అంటూ వాదిస్తున్న ప్రకటన. హిట్లర్ ఇతర దేశాలపై దాడి చేసాడు, కానీ దీదీ స్వంత దేశం లోనే విద్వంసం సృష్టిస్తోంది. కాంగ్రెస్ మానిఫెస్టోని చూసి నవ్వుతున్న టామ్ క్యాట్ వీడియోను కాంగ్రెస్ మానిఫెస్టో ఒక జోక్ అంటూ ఈ పేజిలో ప్రకటన చూడొచ్చు.
ఈ పేజీలో కాంగ్రెస్, BRS వ్యతిరేక మీమ్స్ వంటి ప్రతిపక్ష పార్టీలను కించపరిచే రాజకీయ మీమ్‌లను షేర్ చేశారు.
తెలంగాణా సెంట్రల్, ఫిబ్రవరి 9, 2024న క్రియేట్ చేసిన పేజీ. ఈ పేజీలో మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రకటనలను ఎక్కువగా వెలువడ్డాయి. మార్చి నెలలో ఎక్కువ ప్రకటనలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నాయి, ఇక ఏప్రిల్‌లో నరేంద్ర మోదీకి మద్దతుగా ప్రకటనలు ఎక్కువగా ఉన్నాయి. BRS వ్యతిరేక ప్రకటనలు కూడా ఈ పేజీ ద్వారా ప్రచారం చేశారు.
MemeXpress, తెలంగాణ సెంట్రల్ ప్రత్యేకమైన స్వతంత్ర పేజీలు కావు. అవి నవంబర్ 2023- మే 2024 మధ్య సృష్టించిన, కనీసం 14 పేజీల నెట్‌వర్క్ లలో భాగం. హిందీలో బీజేపీ అనుకూల కంటెంట్‌ను పోస్ట్ చేసే ఫేస్బుక్ పేజీ నెట్‌వర్క్‌లో సృష్టించబడిన మొదటి పేజీ ఉల్టా చష్మా. నవంబర్ 6, 2023న సృష్టించిన ఈ పేజీ.. నెట్‌వర్క్‌లోని మొత్తం 12 పేజీలలో ₹94,600,000 కంటే ఎక్కువ విలువైన రాజకీయ ప్రకటనలను ప్రదర్శించింది. ఈ ప్రకటనలు నవంబర్ 2023 నుండి జూన్ 1 వరకు వచ్చాయి. దేశంలో ఎన్నికల ఫేస్ చివరి దశ వరకూ పెయిడ్ ప్రకటనలు సాగాయి. Tamilakam, Kannada Sangamam, Telangana Central, and Malabar Central అనే పేజీలు ఐదు దక్షిణ భారత రాష్ట్రాల ప్రాంతీయ భాషలలో ప్రకటనలను అందించాయి. ఈ పేజీలన్నీ ఆయా రాష్ట్రాల్లో ప్రచారం కోసం అత్యధికంగా ఖర్చు చేశాయి.
నెట్‌వర్క్‌లోని MemesXpress, పొలిటికల్ ఎక్స్-రేలు దక్షిణాదిలోని టాప్ పెయిడ్ పేజీల్లో ఒకటిగా నిలిచాయి. ఈ పేజీలు ఉల్టా చష్మా పేరుతో కాకుండా.. వారి స్వంత పేరుతో కూడా ప్రకటనలను ప్రసారం చేశాయి. నెట్‌వర్క్‌లోని అన్ని పేజీలు గుర్తించలేని మొబైల్ నంబర్‌లు, చిరునామాలను కలిగి ఉన్నాయి. వారి గుర్తింపు లేదా నిధుల మూలం ప్రజలకు తెలియకుండా డబ్బులను పంచుతూ ఉన్నారు.
ఇక్కడ ఉదాహరణలు ఉన్నాయి:
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల రిజర్వేషన్ స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం అభ్యర్థులకు ఇస్తోందని పేర్కొంటూ ఈ పేజీలో అనేక పోస్ట్‌లు ఉన్నాయి.
ఒక మిలియన్ కంటే ఎక్కువ ఇంప్రెషన్‌లతో ఎక్కువ ఖర్చు చేసిన కొన్ని ప్రకటనల్లో రాహుల్ గాంధీని కించపరుస్తూ ఉన్న పోస్టులే ఉన్నాయి. ఈ పనికిమాలిన వ్యక్తి పడవ మొత్తం ముంచేస్తాడు అంటూ షేర్ అయిన యాడ్ పది లక్షల మందికి పైగా చూసారు. ఈ యాడ్ ను తెలంగాణ సెంట్రల్ పేజి లో ఉల్టా చష్మా స్పాన్సర్ చేసింది.
ఒక మిలియన్ కంటే ఎక్కువ ఇంప్రెషన్‌లతో కూడిన మరో ప్రకటనను కూడా మేము కనుగొన్నాం. “BRS కాంగ్రెస్ వంటి పార్టీలను బుజ్జగించే ఆటలో చిక్కుకోకండి. బీజేపీకి ఓటు వేయండి." అంటూ కూడా పెట్టిన పోస్టులను మేము గుర్తించాం. కాంగ్రెస్, BRS రెండూ ముస్లింలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని, అందుకే వారు ఆ వర్గానికి 4% రిజర్వేషన్లు ఇచ్చారని వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలని ఎన్నుకోవడం ద్వారా దీనిని అడ్డుకోవచ్చు. ఈ ప్రకటన మార్చి 2024లో బాగా పుష్ చేశారు. ఈ యాడ్‌ని ఉల్టా చష్మా సమర్పించింది. ఇది దేశం మొత్తం మీద వైరల్ అవుతుంది. తెలంగాణ యూజర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రకటనను ప్రచారంలోకి తేవడానికి ఖర్చు చేశారు. ఇందుకోసం 1,25,000 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేశారు.
BRS కాంగ్రెస్ లను బుజ్జగించే ఆటలో చిక్కుకోకండి, ఈసారి మీ అమూల్యమైన ఓటును బీజేపీకే వేయండి అంటూ ఇంకో ప్రకటన కోసం ఎంతో ఖర్చు చేసారు.
మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్ల కేటాయింపు చట్టవిరుద్ధమని ఆ యాడ్ లో ఓ వీడియో ఉంది. "రిజర్వేషన్లు కల్పించి ముస్లిం వర్గాలను మభ్యపెట్టేందుకు BRS, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని. బీజేపీ ఎంపీని ఎన్నుకోవడం ద్వారా మనం దీనిని ఆపగలం” అని అందులో ఉంది. ఏప్రిల్ 2024లో రెండు సార్లు ఇదే ప్రకటనను నడుపుతూ విడతకు 40 - 45 వేల రూపాయలు ఖర్చు చేశారు.
'ప్రశ్నిస్తున్న తెలంగాణ' అనేది ఫిబ్రవరి 12, 2024న క్రియేట్ చేసిన మరో పేజీ. ఈ పేజీలో అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రకటనలే ఉన్నాయి. నరేంద్ర మోదీ, బీజేపీ పార్టీలకు మద్దతు ఇస్తూ ప్రచారం చేసే ప్రకటనల కంటే ఎక్కువ. BRS పార్టీకి వ్యతిరేకమైన కంటెంట్‌తో కొన్ని ప్రకటనలు కూడా ఉన్నాయి. ఈ పేజీ వెబ్‌సైట్‌కి లింక్ చేశారు. ఈ వెబ్‌సైట్ ఏకైక లక్ష్యం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉండడమే!! అలాగే సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటారు. ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడగడం చూడొచ్చు.
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వీడియోలు, చిత్రాలను చూపించే ప్రకటనలకు చాలా డబ్బు ఖర్చు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు పార్టీ ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయడంలో విఫలమైందనే ప్రకటనకు చాలా ఖర్చు చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి హామీలు ఇచ్చినా సరైన సౌకర్యాలు లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారంటూ అందులో ప్రచారం చేశారు.
విద్యార్థినులకు ఉచితంగా బైక్‌లు ఇస్తామంటూ ఎన్నో శపధాలు చేసి ఇప్పుడు తప్పుకుంటున్న ప్రభుత్వం అంటూ వెలువడిన ప్రకటన.
రాహుల్ గాంధీని ఎగతాళి చేస్తూ - "ఈ ప్రతిభతో, అతను ప్రధాని అవుతాడు, అనిపిస్తుంది" అంటూ వెలువడిన ప్రకటన.
'BRS, కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలుస్తూ ఓ వీడియో'. ఈ ప్రకటనను 8 సార్లు పుష్ చేశారు. ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయడానికి ఇలా చేశారు. దొందూ దొందే- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాచరిక పాలనకు బ్రాండ్ అంబాసిడర్లు అంటూ వెలువడిన ప్రకటన ఇది.
ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి:
కాంగ్రెస్ కు వోట్ వేస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని గొప్పగా చెప్పి, ఎన్నెన్నో వాగ్దానాలు చేసి , మూడు నెలల పాలనకే మూడు చెరువుల నీరు తాగిస్తున్నారు. టికెట్ పైసలు ఎక్కువైనా బస్సు లో వెళ్లేవాళ్లం, కానీ ఇప్పుడు ఫ్రీ బస్సు పేరుతో పెడుతున్న తంటాలవల్ల బస్సు ఎక్కాలంటేనే గుబులు వేస్తుంది. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని, ఇప్పుడు నీళ్లు నములుతున్నారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటర్లు ఇస్తామని, అది కూడా తప్పించుకున్నారు ఇక్కడ.
ప్రశ్నిస్తున్న తెలంగాణలో ఎన్నో యాడ్లు రాహుల్ గాంధీని ఎద్దేవా చేస్తూ ఎండడం మనం చూడొచ్చు. ఈ వీడియోలో రాహుల్ గాంధీ 50 మరియూ 15 కలిపితే ఎంత అవుతుంది? 73 అనడం మనం వినవచ్చు. వీడు ప్రధాని అవుతాడంట అంటూ ఈ యాడ్ ముగుస్తుంది.
భాగ్యనగరం అంటే హైదరాబాద్ నగరంలో మత్తు పదార్ధాలు హల్చల్ చేస్తున్నాయి అంటూ ఈ యాడ్ ని రిలీస్ చేసారు. చాక్లేట్ల రూపంలో మత్తు పద్దర్ధాలు నగరంలో యువత ను చిత్తు చేస్తోంది. మత్తు పదార్ధాలపై రోజుకో ఉదంతం బయటికి వస్తున్నా కూడా కాంగ్రెస్ నాయకులు పట్టుంచుకోవడం లేదు అని ఈ యాడ్ సారాంశం.
ఈ నాలుగు పేజీలూ ప్రచురించిన ప్రకటనలను పోలుస్తూ తయారు చేసిన పై చార్టులను ఇక్కడ చూడొచ్చు.
వీటిలో మన మోడీ [Mana Modi] పేజీ లో 100% మోడీ అనుకూల ప్రకటనలే ఉండడం గమనించవచ్చు. అయితే, Meme Xpress లో దీనికి పూర్తి విరుద్దంగా కాంగ్రెస్ వ్యతిరేక ప్రకటనలు చూడొచ్చు.
ప్రశ్నిస్తున్న తెలంగాణ పేజీ లో అధిక శాతం కానంగ్రెస్ వ్యతిరేక ప్రకటనలు ఉండగా, బీఆరెస్ పార్టీకు వ్యతిరేకంగా, మోది అనుకూలంగా ఉన్న ప్రకటనలు కొన్ని మాత్రమే ప్రచురించారు. తెలంగాణ సెంట్రల్ పేజీలో మాత్రం మోడీ అనుకూల ప్రకటనలూ, కాంగ్రెస్ వ్యతిరేక ప్రకటనలూ ఎక్కువగానే ప్రచురించారు.
ఈ పేజీలు జనవరి 2024 నుంచీ ఏప్రిల్ 2024 వరకూ ప్రచురించిన ప్రకటనలను పోలుస్తూ తయారు చేసిన పై చార్టులు ఇక్కడ చూడొచ్చు.
మన మోడీ పేజీలో అధిక భాగం ప్రకటనలు మార్చ్ ఏప్రిల్ నెలలలో ప్రచురించారు. మార్చ్ లో 21%, ఏప్రిల్ లో 62% ప్రకటనలు వెలువడ్డాయి.
మేం ఎక్స్ప్రెస్ పేజీలో ప్రకటనలు జనవరి లో 24%, మార్చ్ లో 37%, ఏప్రిల్ లో 39% ప్రకటనలు వెలువడ్డాయి.
తెలంగాణ సెంట్రల్ లో సుమారు 46% ప్రకటనలు మార్చ్ లో వెలువడగా, 43% ప్రకటనలు ఏప్రిల్ లో వెలువడ్డాయి.
ప్రశ్నిస్తున్న తెలంగాణలో మాత్రం అధిక శాతం అంటే 68% ప్రకటనలు ఏప్రిల్ లో నే వెలువడ్డాయి.
ఆందోళనలో పౌర సమాజం
భారతదేశంలో మొదటి దశ ఎన్నికలకు ముందు, అనేక పౌర సమాజ సమూహాలు సరోగేట్ ప్రకటనల గురించి భారత ఎన్నికల కమిషన్ [ECI]కి లేఖలు రాశాయి, అధికారిక, అనధికారిక మార్గాల ద్వారా రాజకీయ పార్టీల ఖర్చులను ట్రాక్ చేయడంలో ఉన్న ఇబ్బందులను చూపాయి. ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వినియోగాన్ని నిర్ధారించే లక్ష్యంతో మార్చి 2019 నుండి “స్వచ్ఛంద నీతి నియమావళి” ని ఈ లేఖలు విమర్శించాయి. కోడ్‌లో పారదర్శకత లేకపోవడం, బైండింగ్ లేని స్వభావం, నైతిక ఉల్లంఘనలను నివేదించడానికి పౌరులకు అవకాశం లేకపోవడమనే అంశాలను లేఖ ఎత్తి చూపింది.
స్పష్టమైన మార్గదర్శకాలు, ఫిర్యాదు రిపోర్టింగ్ మెకానిజమ్‌లతో కూడిన బైండింగ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ [MCC] కోసం సమూహాలు పిలుపునిచ్చాయి. స్వతంత్ర సంస్థల నేతృత్వంలో, ఒక పారదర్శక భాగస్వామ్య ప్రక్రియ ద్వారా, ఆన్లైన్ ప్రకటనలకై నిర్దిష్ట నియామావళిని రూపొందించాలని పౌర సంఘాలు డిమాండ్ చేశాయి.
మెటా ప్రతిస్పందన
రాజకీయ పార్టీలు, వాటి ప్రాక్సీ పేజీలు మెటా యాడ్ సిస్టమ్‌ను ఎలా ఉపయోగించుకుంటాయో హైలైట్ చేస్తూ మేము మెటాని సంప్రదించాము, అలాగే ఈ సమస్యపై వారి స్పందనను కోరాము. మెటా ప్రతినిధి ఇమెయిల్ ద్వారా ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారు, "మేము ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించబడిన ప్రకటనలపై చర్యలు తీసుకుంటాము. మా ప్రమాణాలను పాటించడంలో పదేపదే విఫలమైతే ప్రకటనదారుపై జరిమానాలు విధించే అధికారం కూడా మాకు ఉంది. ఎన్నికలు లేదా రాజకీయాల గురించి ప్రకటనలను ప్రదర్శించాలనుకునే వ్యక్తులు తప్పనిసరిగా అధికార ప్రక్రియ ద్వారా వెళ్లాలి. మా ప్లాట్‌ఫారమ్‌కు వర్తించే అన్ని చట్టాలకు ప్రకటనదారు లోబడి ఉండి, వాటిని ఉల్లఘిస్తే ప్రకటనదారే బాధ్యత వహించాలి."
ఇటీవలి భారత సార్వత్రిక ఎన్నికలలో, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు డిజిటల్ ప్రకటనలపై ఎక్కువగా దృష్టి సారించాయి, ప్రాక్సీ పేజీలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. మెటా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రకటనలను అమలు చేయడానికి భారీ మొత్తం ఖర్చు చేయబడింది, ఇది డిజిటల్ ప్రచారానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అయితే, రాజకీయ ప్రకటనల ఖర్చు, కంటెంట్‌కు సంబంధించి పారదర్శకత ఇంకా జవాబుదారీతనం లేకపోవడం ఆందోళనలను రేకెత్తించింది. తరచుగా, సోషల్ మీడియాలో తప్పుడు సమాచార ప్రచారం ప్రబలంగా నడుస్తుంది, ఇది ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం.
పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించడం, రాజకీయ ప్రచారంలో నైతికతను, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం, భారత ఎన్నికల కమిషన్ [ECI] ఎదుర్కుంటున్న అతి పెద్ద సవాళ్లు. డిజిటల్ ప్రభావం పెరిగేకొద్దీ, ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడుకోవడంలో, రాజకీయ ప్రయోజనాల కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల దుర్వినియోగాన్ని అరికట్టడంలో ఎన్నికల సంఘం పాత్ర కీలకం. ప్రకటనల ఖర్చును పర్యవేక్షించడం, కంటెంట్‌ను ధృవీకరించడం, న్యాయమైన పారదర్శక ఎన్నికల వాతావరణాన్ని పెంపొందించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండేలా చూసుకోవడం కూడా ఇందులో భాగమే.