ప్రధాని మోదీ విభజన రాజకీయాలు చేస్తున్నార‌ని బాబూలాల్ మరాండీ విమర్శించారా?

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబూలాల్ మరాండీ ప్రధాని మోదీని విమర్శించారని ఆరోపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

By K Sherly Sharon  Published on  18 Nov 2024 3:16 PM GMT
ప్రధాని మోదీ విభజన రాజకీయాలు చేస్తున్నార‌ని బాబూలాల్ మరాండీ విమర్శించారా?
Claim: బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబూలాల్ మరాండీ ప్రధాని మోదీ హామీలను అమలు చేయకపోవడాన్ని, విభజన రాజకీయాలను విమర్శించారు.
Fact: వీడియోలోని దావా తప్పుదారి పట్టించేది. బాబులాల్ మరాండీ 2018లో బీజేపీ సభ్యుడిగా చేరక ముందు, జార్ఖండ్ వికార్ మోర్చాకు నాయకత్వం వహిస్తున్నప్పుడు ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Hyderabad: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో 64.86% ఓటింగ్ నమోదైంది. నవంబర్ 20న రాష్ట్రం రెండో, చివరి దశకు సిద్ధమవుతున్న తరుణంలో అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పోటీ తీవ్రమైంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రెండు పార్టీలు ఉపాధి, వనరుల నిర్వహణ, ప్రాంతీయ గుర్తింపు వంటి కీలక అంశాలపై దృష్టి సారిస్తూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబులాల్ మరాండీ ప్రధాని నరేంద్ర మోదీ విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో మరాండీ ఈ విధంగా వ్యాఖ్యానించారు…"2014లో మోదీ చేసిన వాగ్దానాలు చాలా వరకు నెరవేరలేదు. విభజన రాజకీయాలు ప్రధాన వేదికగా మారి, సమాజాన్ని చీలుస్తున్నాయి. హిందు ముస్లింల మధ్య అనవసరమైన ఉద్రిక్తతలను సృష్టించడానికి గోవులు, గుడి - మసీదుల చర్చలు, మత మార్పిడులు లవ్ జిహాద్‌ వంటి అంశాలను ఉపయోగిస్తున్నారు. క్రూరమైన విభజనలను ప్రోత్సహించడానికి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోలేదు. పేద వారిపై ఇలాంటి క్రూరమైన జోకులు వేయడం విచారకరం. ఇలాంటి ప్రభుత్వానికి ఎవరు మద్దతు ఇస్తారు? మోదీ ప్రధానమంత్రిగా కొనసాగితే, ఇంకో ఐదు సంవత్సరాల్లో భారతదేశంలో పరిస్థితి మరింత దిగజారుతుంది, అల్లర్లు పెరిగి దేశ పురోగతి నిలిచిపోవడానికి దారి తీస్తుంది. భారతదేశాన్నిపాకిస్తాన్‌ చేయాలి అనుకుంటున్నారా?”

Xలో వీడియోను షేర్ చేసిన వ్యక్తి ఈ విధంగా వ్రాసారు "...బీజేపీ జార్ఖండ్ అధ్యక్షుడు నిజం మాట్లాడుతున్నారు. మోదీ మరో ఐదేళ్లపాటు ప్రధానిగా ఉంటే,భారతదేశం పాకిస్తాన్‌గా మారుతుందని అన్నారు. ప్రతిరోజు అల్లర్లు గందరగోళం జరుగుతాయి. మోదీ ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఆయన కూడా ఖలిస్తాన్ సంభందేనా, మీరు అతన్ని పాకిస్తాన్ వెళ్ళమంటారా? ఆయన ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను, గత పదకొండు సంవత్సరాలలో మోదీ గురించి ఈ నిజం కెమెరా ముందు దేశానికి చూపించే సాహసం ఏ బీజేపీ నాయకుడూ చేయలేదు. కానీ ఆయన చెప్పింది నిజం, మోదీ ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించారు.” (ఆర్కైవ్)

ఈ వీడియో 2018 నాటిది, అప్పుడు మరాండి బీజేపీలో లేరు కాబట్టి ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించేలా ఉందని న్యూస్‌మీటర్ గుర్తించింది.

Fact Check:

వీడియోలో కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే అశోక్ గోప్ ఆనే ఫేస్‌బుక్ వినియోగదారుడు 2018లో డిసెంబర్ 14న అప్‌లోడ్ చేసిన పూర్తి వీడియో దొరికింది. ఈ వీడియోతో పాటు, క్యాప్షన్లో "బీజేపీకి ఓటు వేసే వారు సమాజంలో అత్యంత నీచమైన వ్యక్తులు," అని బాబులాల్ మరాండీ చేసిన వ్యాఖ్య ఉంది.

జార్ఖండ్ స్థానిక మీడియా సంస్థ Taaza TV అదే తేదీన పోస్ట్ చేసిన మరొక ఫేస్‌బుక్ పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము. ఆ పోస్ట్ క్యాప్షన్లో ఈ విధంగా వ్రాసారు “రాఫెల్‌ ఒప్పందంపై జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ మరాండీ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని అన్నారు. అదే సమయంలో, ఈ విషయంపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంన్ని విమర్శించడానికి ఆయన వెనుకాడలేదు. రాఫెల్ యుద్ధవిమానం ధర ఎంత అనేది చెప్పాలని మాత్రమే ప్రభుత్వాన్ని అడిగామని, అందులో భద్రతకు సంభంధించి ఏం రహస్యాలు ఉంటాయన్నారు.”

Taaza TV అధిపతి కమలేష్ మిశ్రా వైరల్ వీడియో డిసెంబర్ 2018 నాటిదేనని న్యూస్‌మీటర్ కి స్పష్టం చేసి ఇలా అన్నారు, "బాబులాల్ మరాండీ ఆ సమయంలో జార్ఖండ్ వికాస్ మోర్చాకు నాయకత్వం వహించారు, తరచుగా ప్రధాని మోదీనీ, ఆయన విధానాలను విమర్శించేవారు. మరాండీ చేసిన ఈ వ్యాఖ్యలుకూడా ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వంపై చేసిన విమర్శల్లో భాగమే."

గతంలో మరాండీ బిజేపిపై చేసిన విమర్శలను హైలైట్ చేస్తు ది న్యూస్ ఖజానా 2023 సెప్టెంబరు 2న ప్రచురించిన కథనం న్యూస్‌మీటర్ కనుగొంది. “ఒకప్పుడు మరాండీ ఇలా అన్నారు - బీజేపీకి ఓటేసే వాళ్ళకన్నా పనికిరాని వాళ్ళు ఎవరూ లేరు, మోదీ ప్రభుత్వం భారత్‌ను పాకిస్థాన్‌లా తయారు చేయాలి అనుకుంటుంది” అని వ్రాసారు. ఈ కథనం ప్రకారం బీజేపీలో చేరిన తర్వాత మరాండి తన దృష్టిని మరల్చి ముఖ్యమంత్రి హేమన్ సోరెన్, ఆయన ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.

ఇండియా టుడే కథనం ప్రకారం, బాబూలాల్ మరాండీ బిజేపీని విడిచిపెట్టిన 14 సంవత్సరాల తర్వాత తిరిగి పార్టీలో చేరారు. మరాండి 2020 ఫిబ్రవరి 17న, రాంచీలో జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా, బిజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో తన జార్ఖండ్ వికాస్ మోర్చా (జెవిఎం)ని బిజెపిలో విలీనం చేశారు. కాబట్టి, మరాండీ వ్యాఖ్యలు చేసిన వైరల్ వీడియో 2018 నాటిదని, ప్రధాని మోదీపై ఇటీవల చేసిన విమర్శ కాదని మేము నిర్ధారించాము. వైరల్ వీడియోలోని దావా తప్పుదారి పట్టించేది.

Claim Review:బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబూలాల్ మరాండీ ప్రధాని మోదీ హామీలను అమలు చేయకపోవడాన్ని, విభజన రాజకీయాలను విమర్శించారు.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X users
Claim Fact Check:False
Fact:వీడియోలోని దావా తప్పుదారి పట్టించేది. బాబులాల్ మరాండీ 2018లో బీజేపీ సభ్యుడిగా చేరక ముందు, జార్ఖండ్ వికార్ మోర్చాకు నాయకత్వం వహిస్తున్నప్పుడు ఈ వ్యాఖ్య‌లు చేశారు.
Next Story