Fact Check: బలూచిస్తాన్ స్వాతంత్ర్యం తర్వాత భారత జెండా ఎగురవేసి, జాతియా గీతం పాడారా? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి

పాకిస్తాన్ నుండి విడిపోయి ఆపరేషన్ సిందూర్ తర్వాత బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారిన సందర్భంగా, అక్కడి ప్రజలు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ, జాతీయ గీతాన్ని ఆలపిస్తూన్న దృశ్యాన్ని చూపిస్తుంది అనే క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

By K Sherly Sharon
Published on : 19 May 2025 9:07 PM IST

Fact Check: బలూచిస్తాన్ స్వాతంత్ర్యం తర్వాత భారత జెండా ఎగురవేసి, జాతియా గీతం పాడారా? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి
Claim:ఆపరేషన్ సిందూర్ తర్వాత బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం పొందిన సందర్భంగా భారత జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియో ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన తిరంగ యాత్రను చూపిస్తుంది. ఇది బలూచిస్తాన్‌కు సంబంధించినది కాదు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం పొందిన సందర్భంగా భారత జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు.Hyderabad: బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి విడిపోయి ఆపరేషన్ సిందూర్ తర్వాత స్వతంత్ర దేశంగా మారిన సందర్భంగా, అక్కడి ప్రజలు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ, జాతీయ గీతాన్ని ఆలపిస్తూన్న దృశ్యాన్ని చూపిస్తుంది అనే క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

వీడియోలో ఒక ఊరేగింపులో భారీ జనం పాల్గొన్నట్లు చూడవచ్చు. వారు భారత జాతీయ జెండాను పట్టుకున్నారు, వారితో పాటు ఒక బ్యాండ్ 'సారె జహాన్ సే అచ్చా' అనే పాటను వాయిద్యాలపై వాయిస్తున్నట్లు వినిపిస్తుంది. వీడియోపై 'బెలూచిస్తాన్ స్వతంత్ర దేశం గా మారిన సందర్భంగా, కృతజ్ఞతతో మన దేశ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ, జాతీయ గీతాన్ని ఆలపిస్తూన్న దృశ్యం… బలోచి లిబరేషన్' అని రాసి ఉంది.

వీడియోని త్రేడ్స్ అనే సామాజిక మాధ్యమంలో కూడా షేర్ చేసి, క్యాప్షన్‌లో "ఆపరేషన్ సిందూర్ ఇచ్చిన ధైర్యం తో,పాకిస్తాన్ నుండి విడిపోయి, బెలూచిస్తాన్ స్వతంత్ర దేశం గా మారిన సందర్భంగా,కృతజ్ఞతతో మన దేశ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ, జాతీయ గీతాన్ని ఆలపిస్తూన్న దృశ్యం. " ఇది కదా భారత్ పవర్ అంటే"" అని రాశారు. (ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. గుజరాత్‌లోని సూరత్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన తిరంగా యాత్రను వీడియో చూపిస్తుంది. ఈ వీడియోకి బలూచిస్తాన్‌తో సంబంధం లేదు.

"బలూచ్ రచయిత పాక్ నుండి స్వాతంత్ర్యం పొందారని, గుర్తింపు కోసం ఐక్యరాజ్యసమితిని కోరారు," అనే శీర్షికతో ఇండియా టుడే మే 9న ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్యలో, ప్రసిద్ధ బలూచ్ రచయిత మీర్ యార్ బలూచ్, బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం పొందిందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బలూచ్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడానికి అనుమతించాలని ఆయన భారత ప్రభుత్వాన్ని కోరారు అని రాశారు.

"బలూచ్ ప్రజల తరపున వాదించడంలో పేరుగాంచిన మీర్ యార్ బలూచ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వరుస పోస్ట్‌లలో ఈ ప్రకటన చేశారు. బలూచిస్తాన్‌కు శాంతి పరిరక్షక దళాలను పంపాలని ఆయన ఐక్యరాజ్యసమితిని కోరారు, పాకిస్తాన్ సైన్యం ఈ ప్రాంతం నుండి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు," అని కథనంలో పేర్కొన్నారు.

అయితే ఇటీవల భారత జాతీయ జెండాను పట్టుకొని, 'సారె జహాన్ సే అచ్చా' అని పాడుతూ బలోచ్ ప్రజలు ఊరేగింపులో పాల్గొన్నట్లు చూపిస్తున్న వార్త కథనాలు, సోషల్ మీడియా పోస్టులో దొరకలేదు.

వీడియోలో బ్యాండ్ వాయిద్యాలపై 'సైఫీ స్కౌట్స్స్ సూరత్' అని రాసి ఉండడం చూడవచ్చు. బ్యాండ్ సభ్యులు ఖాకీ ప్యాంటుతో తెల్లటి చొక్కా యూనిఫాం ధరించారు. చొక్కాపై ఆకుపచ్చ చిహ్నం ఉంది.

కీవర్డ్ సెర్చ్ ద్వారా 'సైఫీ స్కౌట్స్ సూరత్' అనే ఇంస్టాగ్రామ్‌ ఖాతాలో అప్లోడ్ చేయబడిన వీడియో దొరికింది. ఈ వీడియోలో కూడా అదే ఆకుపచ్చ చిహ్నం ఉన్న యూనిఫాం ధరించిన బ్యాండ్ సభ్యులు కనిపిస్తున్నారు. ఈ వీడియోని మే 15న అప్లోడ్ చేసి క్యాప్షన్‌లో, "తిరంగ యాత్ర సూరత్ 2025 @saifeescoutsurat ద్వారా బ్యాండ్ ప్రదర్శన" అని రాశారు.

వీడియోలో కూడా పలుచోట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రం ఉన్న బ్యానర్ ఉంది. దానిపై 'ఆపరేషన్ సిందూర్' అని ఆంగ్లంలో, 'తిరంగా యాత్ర' అని గుజరాతీలో రాసి ఉంది.

"తిరంగ యాత్ర: గాంధీనగర్, సూరత్ మరియు రాజ్‌కోట్‌లలో భారీ జనసమూహంతో వైభవంగా తిరంగ యాత్ర జరిగింది" అనే శీర్షికతో గుజరాత్ ఫస్ట్ న్యూస్ మే 14న కథనాన్ని ప్రచురించింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత, బీజేపీ గుజరాత్ సహా దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర నిర్వహించింది అని రాశారు. సూరత్‌లో కూడా తిరంగ యాత్ర మే 14న నిర్వహించారు.

"తిరంగ యాత్రను భాగల్ ప్రాంతం నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ప్రారంభించారు. చౌక్ బజార్ కూడలి వద్ద యాత్ర ముగిసింది," అని పేర్కొన్నారు.

ఇండియన్ ఎక్సప్రెస్ మే 15న ప్రచురించిన కథనం శీర్షిక "తిరంగా యాత్ర జరుగుతున్నప్పుడు సూరత్‌లో ఇండియన్ ఆర్మీని అభినందిస్తూ నినాదాలు చేశారు."

దావూదీ బోహ్రా కమ్యూనిటీకి చెందిన సైఫీ స్కౌట్స్ సూరత్ సంగీత బృందాలు భాగల్ కూడలి నుండి యాత్రకు నాయకత్వం వహించడం ఈ కార్యక్రమంలో ముఖ్యాంశంగా నిలిచింది అని ఈ కథనం పేర్కొంది.

గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించి వైరల్ వీడియో చిత్రీకరించబడిన ప్రదేశాన్ని కనుగొన్నాం. వీడియో సూరత్‌లో చౌక్ బజార్ రోడ్‌లోని మినారా మజీద్ జంక్షన్‌ను చూపుతుంది అని తేలింది.

సైఫీ స్కౌట్స్ సూరత్ సభ్యుడు అలీ అస్గర్ న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, వైరల్ వీడియో ఇటీవల సూరత్‌లో నిర్వహించిన తిరంగ యాత్రలో తీయబడింది అన్నారు. "ఆపరేషన్ సిందూర్‌లో ధైర్యంగా పోరాడిన మన సైనికుల గౌరవార్థం తిరంగ యాత్ర నిర్వహించబడింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కూడా యాత్రకు హాజరయ్యారు" అని ఆయన అన్నారు.

వైరల్ వీడియో ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన తిరంగ యాత్రను చూపిస్తుంది. ఇది బలూచిస్తాన్‌కు సంబంధించినది కాదు.

Claim Review:ఆపరేషన్ సిందూర్ తర్వాత బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యం పొందిన సందర్భంగా భారత జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియో ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన తిరంగ యాత్రను చూపిస్తుంది. ఇది బలూచిస్తాన్‌కు సంబంధించినది కాదు.
Next Story