Hyderabad: ఫార్ములా-ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కే టీ రామ రావు జనవరి 17న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తిహార్ జైలుకు వస్తున్న కేటీఆర్ అన్నకు స్వాగతం అంటూ సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారని పేర్కొంటున్న న్యూస్ కార్డు ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
ఈ న్యూస్ కార్డులో, "200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జైలు అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మళ్లీ సంచలన లేఖ విడుదల చేశారు. లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు హైదరాబాద్ నుండి ఢిల్లీకి వందల కోట్ల తరలించానని లేఖలు విడుదల చేసి సంచలనంగా మారిన సుఖేష్ ఇప్పుడు తిహార్ జైలుకు వస్తున్న కేటీఆర్ అన్నకు స్వాగతం అంటూ మరో లేఖను విడుదల చేశారు," అని ఆరోపించారు.
జైలుకు వచ్చాక ఇద్దరం కలిసి పార్టీ చేసుకుందామని సుఖేష్ రాసిన లేఖను తన న్యాయవాది మీడియాకు విడుదల చేశారని పేర్కొన్నారు.
Way2News ప్రచురించినట్లు కనిపిస్తున్న ఈ న్యూస్ కార్డును 2025 జనవరి 16న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.(ఆర్కైవ్)
ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు.(ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది. వైరల్ అవుతున్న కథనం అసలు మనుగడలో లేదని కనుగొన్నాం.
కేటీఆర్ అన్న వెల్కమ్ టు తీహార్ అంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖ వ్రాశారా అని వెతికాము. ఈ సమాచారాన్ని చూపించే కథనాలు దొరకలేదు.
ఈ క్లెయిమ్స్ చేస్తున్న ఫోటో మీద Way2News లోగో, లింక్ ఉన్నాయి. ఈ లింక్‌తో అనుబంధించబడిన కథనం ఏదీ లేదని కనుగొన్నాం. Way2News Fact Check వెబ్ సైట్లో కూడా ఈ కథనం లేదని తెలుస్తోంది. (ఆర్కైవ్)
గతంలో సుఖేష్ చంద్రశేఖర్, లిక్కర్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కవితకు లేఖ వ్రాశారు. 2024 మార్చ్ 19న ABP Desham ప్రచురించిన కథనం ప్రకారం, "తాను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 అంశాలు పొందుపరిచాననని.. అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని.. రెండోది తిహార్ క్లబ్‌లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైందని అని గుర్తు చేశారు."
ఇదే విషయాన్ని Siasat, NTV Telugu ప్రచురించిన కథనాలలో చూడవచ్చు.
ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న సమయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన న్యూస్ కార్డు అని అర్థం అవుతోంది.
కాబట్టి న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.