Fact Check: ప్రధాని మోదీని విస్మరించిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌? నిజం ఇక్కడ తెలుసుకోండి...

పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ విస్మరించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.

By K Sherly Sharon  Published on  15 Feb 2025 10:58 PM IST
Fact Check: ప్రధాని మోదీని విస్మరించిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌? నిజం ఇక్కడ తెలుసుకోండి...
Claim: పారిస్ ఏఐ సమావేశంలో అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీని విస్మరించారు, భారత దేశాన్ని అవమానపరిచారు.
Fact: ఈ వైరల్ క్లెయిమ్ తప్పు. పారిస్ ఏఐ శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీని విస్మరించలేదు.

Hyderabad: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం 2025 ఫిబ్రవరి 10న పారిస్‌లో మొదలైన ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. అక్కడ ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి చర్చలు జరిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైతిక, సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించిన ఈ సమావేశంలో, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి కీలక రంగాలను మార్చడానికి ఏఐ సామర్థ్యంపై ప్రపంచ నాయకులు చర్చించారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కరచాలనం కోసం చేయి చాపినప్పుడు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ పట్టించుకోలేదనే క్లెయిమ్‌తో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌ వివిధ దేశాల నేతలను కలిసి కరచాలనం చేయడం చూడగలం. ప్రధాని మోదీ కూడా ఈ వీడియో నేపథ్యంలో కనిపిస్తారు.

"ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కరచాలనం చేయడానికి ప్రధాని మోదీ అనేకసార్లు ప్రయత్నించారు, కానీ ఆయనను పదే పదే విస్మరించారు. ప్రపంచం భారతదేశాన్ని, దాని ప్రజలను గౌరవిస్తుంది, కానీ ఆయన ప్రచార విన్యాసాలు, అసమర్థత కారణంగా, మోదీ ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని కోల్పోతున్నారు," అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని ఇంస్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. పారిస్ ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాన మంత్రి మోదీని విస్మరించలేదు.

కీ వర్డ్ సెర్చ్ ద్వారా Associated Press 2025 ఫిబ్రవరి 11న ఏఐ యాక్షన్ సమ్మిట్‌ ప్రత్యక్ష ప్రసారం దొరికింది. ఈ వీడియో 9:56 నిమిషాల మార్క్ వద్ద వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలు కనిపిస్తాయి.


ఇది జరగడానికి ముందే, ప్రత్యక్ష ప్రసారంలో 8:39 నిమిషం మార్క్ వద్ద ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ మరి కొందరితో కలిసి ప్రపంచ నాయకులు కూర్చున్న వేదిక వద్దకు నడుస్తున్నట్లు చూడవచ్చు.

ఈ ప్రత్యక్ష ప్రసారంలో 9:48 నిమిషాల మార్క్ వద్ద, మాక్రాన్ US ఉపాధ్యక్షుడు JD వాన్స్‌తో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది, ప్రధాన మంత్రి మోడీ సమీపంలోనే కూర్చొని ఉన్నారు.

ఆ క్లిప్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ వెనుక వరుసలో కూర్చున్న వ్యక్తిని పలకరించడానికి వస్తున్నప్పుడు ప్రధాని మోదీ మాక్రాన్ వైపు చేయి చాపారా లేదా పక్కకు తప్పుకోవాలా వద్దా అని సంజ్ఞ చేశారా అనేది స్పష్టంగా తెలియలేదు.

అయితే అధ్యక్షుడు మాక్రాన్ ఈ సమావేశంలో ప్రధాని మోదీని విస్మరించారు అనే క్లెయిమ్‌లో నిజం లేదని తెలుస్తుంది. ఇద్దరు నాయకులు ఇప్పటికే ఒకరినొకరు పలకరించి, కలిసి వేదికలోకి ప్రవేశించే ముందు ఫోటోలు తీసుకున్నారు. ఫిబ్రవరి 11న ప్రధాని మోదీ Xలో అధ్యక్షుడు మాక్రాన్ తో కరచాలనం చేస్తున్న చిత్రాలను షేర్ చేశారు.

అధ్యక్షుడు మాక్రాన్ కూడా Xలో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ఫిబ్రవరి 11న వీడియోను పోస్ట్ చేశారు.

11:39 నిమిషం మార్క్ వద్ద, ఇతర నాయకులను పలకరించిన తర్వాత, మాక్రాన్ మోదీ వద్దకు నడిచి వెళ్లి ఆయన పక్కన కూర్చున్నారు.

ఫ్రెంచ్ అధ్యక్షుడు భారత ప్రధానిని విస్మరించారని లేదా అగౌరవపరిచారని చేసిన క్లెయిమ్ నిరాధారమైనది.

కాబట్టి వైరల్ వాదన తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claim Review:పారిస్ ఏఐ సమావేశంలో అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీని విస్మరించారు, భారత దేశాన్ని అవమానపరిచారు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ వైరల్ క్లెయిమ్ తప్పు. పారిస్ ఏఐ శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీని విస్మరించలేదు.
Next Story