Fact Check : కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 'ఆరు గ్యారెంటీలు బోగస్' అని కడియం శ్రీహ‌రి అన్నారా? నిజం ఇక్కడ తెలుసుకొండి

తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చే బడ్జెట్ లేదని విమర్శిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చెక్కర్లుకొడుతోంది

By K Sherly Sharon  Published on  28 Dec 2024 8:06 PM IST
Fact Check : కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆరు గ్యారెంటీలు బోగస్ అని కడియం శ్రీహ‌రి అన్నారా? నిజం ఇక్కడ తెలుసుకొండి
Claim: కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆరు గ్యారంటీలని బోగస్ అన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Fact: వైరల్ క్లెయిమ్స్ తప్పు. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యే కడియం 2024 ఫిబ్రవరిలో చేశారు. అప్పటికింకా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. బీఆర్ఎస్‌లో ఉన్నారు.

Hyderabad: తెలంగాణ అసెంబ్లీ సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడతూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చే బడ్జెట్ లేదని విమర్శిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చెక్కర్లుకొడుతోంది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఎమ్మెల్యే బోగస్ అంటున్నారు అన్న క్లెయిమ్ కూడా ఈ వీడియోతో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు ఏడాదికి రూ.1.36 లక్షల కోట్లు అవసరమని… నియోజకవర్గంలో 3500 ఇండ్లు ఇవ్వడానికి, మహాలక్ష్మి పథకం కింద‌ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి, ఆసరా పెన్షన్లను పెంచడానికి బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిపోవు అని అన్నారు.

"ఆరు గ్యారెంటీలను చాలా ఆర్భాటంగా, చాలా అద్భుతంగా ప్రజల్లోకి మీరు తీసుకెళ్లారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఆరు గ్యారంటీలే మిమ్మల్ని గెలిపించాయి. ప్రజలు నమ్మి మీకు ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ... ప్రజలకు మొండి చేయి చూపించే ప్రయత్నం చేస్తున్నారు," అని వీడియోలో ఎమ్మెల్యే అన్నారు.

ఈ వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్‌లో ఈ విధంగా వ్రాసారు, "కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆరు గ్యారెంటీలనే బోగస్ అంటున్న కడియం." (ఆర్కైవ్)

ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది. ఈ వీడియోలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖలు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీలో ఉన్నప్పుడు చేసిన‌వి.

కీ వర్డ్ సెర్చ్ ఉపయోగించి Times of India 2024 ఫిబ్రవరి 15న ప్రచురించిన “6 గ్యారెంటీల‌కు కేటాయించిన నిధులు సరిపోవు: శ్రీహరి" కథనం కనుగొన్నాం.

ఈ కథనంలో "అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 1.36 లక్షల కోట్లు అవసరమవుతుందని, అయితే బడ్జెట్‌లో ప్రభుత్వం కేవలం 53 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు" అని వ్రాసారు.

ఈనాడు 2024 ఫిబ్రవరి 14న ప్రచురించిన "టీఎస్ అసెంబ్లీ : రైతు రుణమాఫీ ఎప్పటిలోపు పూర్తి చేస్తారు?: కడియం శ్రీహరి" అనే కథనంలో ఎమ్మెల్యే శ్రీహరి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌పై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు అని రాసారు. వైరల్ అవుతున్న వ్యాఖ్యలు ఎమ్మెల్యే ఈ సమావేశంలోనే చేసారని స్పష్టం అవుతుంది

కీ వర్డ్ సెర్చ్ ద్వారా 2024 ఫిబ్రవరి 14న జరిగిన తెలంగాణ అసీంబ్లీ బడ్జెట్ సమావేశం వీడియో T News Telugu వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్లో దొరికింది. ఈ సమావేశంలో దాదాపు గంటసేపు ఎమ్మెల్యే ప్రసంగం చేసినట్లు కనిపిస్తుంది. ఇదే వీడియోలో సరిగ్గా 37:23 నిమిషల దగ్గర వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల క్లిప్ చూడవచ్చు.

వైరల్ వీడియోలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేస్తున్న వ్యాఖ్యలు 2024 ఫిబ్రవరిలో తెలంగాణ అసెంబ్లీ సభ బడ్జెట్ సమావేశంలో చేసినట్టు తేలింది. అయితే, ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు. 2024 మార్చిలో లోక్ సభ ఎన్నికలకు ముందు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కడియం శ్రీహరి రాజకీయ ప్రయాణం

1987 ఫిబ్రవరిలో కడియం తెలుగుదేశం పార్టీలో చేరి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవికి పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. కడియం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వివిధ శాఖలను నిర్వహించారు.

కడియం 2013 మేలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో, అతను కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాడు.

ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఎఐసిసి ఇన్‌ఛార్జ్ దీపా దాస్మున్షి సమక్షంలో 2024 మార్చి 31న కడియం తన కుమార్తె కావ్యతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి మారారు. ప్రస్తుతం కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు.

కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యుడిగా ఉన్నప్పుడు చేసినవి. అప్పటికింకా ఎమ్మెల్యే శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కాబట్టి వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claim Review:కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆరు గ్యారంటీలని బోగస్ అన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ క్లెయిమ్స్ తప్పు. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యే కడియం 2024 ఫిబ్రవరిలో చేశారు. అప్పటికింకా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. బీఆర్ఎస్‌లో ఉన్నారు.
Next Story