Fact Check: ఉచితంగా స్ప్లెండర్ బైక్ పథకం ప్రకటించిన ప్రధాని మోడీ? లేదు, వైరల్ వీడియో ఏఐ

ప్రధాని నరేంద్ర మోడీ ఉచితంగా హీరో స్ప్లెండర్ బైక్ ఇచ్చే ప్రభుత్వ పథకం ప్రకటించారని వైరల్ అవుతున్న వీడియో.

By -  K Sherly Sharon
Published on : 3 Nov 2025 10:30 PM IST

Fact Check: ఉచితంగా స్ప్లెండర్ బైక్ పథకం ప్రకటించిన ప్రధాని మోడీ? లేదు, వైరల్ వీడియో ఏఐ
Claim:ఉచితంగా హీరో స్ప్లెండర్ బైక్ పొందడానికి ప్రభుత్వ పథకం ప్రకటించిన ప్రధాని మోడీ.
Fact:ఈ క్లెయిమ్‌లో నిజం లేదు. వైరల్ అవుతున్న ప్రధాని మోడీ వీడియో ఏఐతో చేయబడింది. ఉచితంగా హీరో స్ప్లెండర్ బైక్ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఏవి లేవు.

Hyderabad: ఆధార్ కార్డు ఉంటే పూర్తిగా ఉచితంగా స్ప్లెండర్ బైక్ పొందవచ్చని క్లెయిమ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఒక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఉచితంగా బైక్ పొందవచ్చని పేర్కొన్నారు. ఈ వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడుతూ "మీ సైకిల్ సొంతం చేసుకోవాలనే కల ఉచితంగా నెరవేరబోతోంది. కానీ గుర్తుంచుకోండి, ప్రతి ఆధార్ కారుతో ఒక స్ప్లెండర్ బైక్ మాత్రమే ఉచితంగా లభిస్తుంది," అన్నట్లు చూడవచ్చు.

ప్రధాని మోడీ మాట్లాడుతున్న వీడియో క్లిప్ షేర్ చేస్తూ ఈ వీడియోలో ఇలా అన్నారు, "మీ దెగ్గర ఆధార్ కార్డు ఉంటే ఫ్రీగా స్ప్లెండర్ బైక్ వస్తుంది, మోడీ చెప్పేది వినండి ... ఫ్రీగా మీకు కూడా ఈ బైక్ కావలి అంటే 'బైక్' అని కామెంట్ చేసి, ఇప్పుడే ఫాలో చేసి, బయోలో ఉన్న ఈ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బాక్సులో 'LIC' అని సెర్చ్ చేసి, ఈ పోస్టు ఓపెన్ చేసి కొద్దిగా స్క్రోల్ చేసి, ఈ లింక్ ఓపెన్ చేసి అప్లై చేయండి".

వీడియోని 'love_hacking99' అనే యూసర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. (ఆర్కైవ్) ఈ పోస్టుపై 41 వేలకు పైగా లైకులు ఉన్నాయి, ఇది 27 వేలకు పైగా షేర్ చేయబడింది.

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఫ్రీ స్ప్లెండర్ బైక్ ఇచ్చే ఎటువంటి ప్రభుత్వ పథకం లేదు, ప్రధాని మోడీ కనిపిస్తున్న వీడియో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ - ఏఐ) ద్వారా చేయబడింది.

వైరల్ వీడియోలో ఉన్నట్లు ఫ్రీ స్ప్లెండర్ బైక్ ఇవ్వడానికి ప్రభుత్వ పథకం ఏదైనా ఉందా అని కీ వర్డ్ సెర్చ్ చేసాము. అసలు అటువంటి పథకం ఉందని చూపించే వార్త నివేదికలు, సోషల్ మీడియా పోస్టులు ఏవి దొరకలేదు.

ప్రజా సంక్షేమ పథకాలపై కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ను పరిశీలించగా, ఉచిత స్ప్లెండర్ బైక్ ఇస్తున్న పథకం ఏది లేనట్లు గుర్తించాం.

వైరల్ వీడియోలో ఉన్న వెబ్‌సైటు

వైరల్ అవుతున్న వీడియోలో చూపించినట్లు 'love_hacking99' ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బయోలో ఉన్న లింక్ మీద క్లిక్ చేసాము. 'hanumanchalisatelugu' అనే డొమైన్ ఉన్న వెబ్సైటు తెరుచుకుంది. 'LIC' అనే లింక్‌ తెరిచి, స్క్రోల్ చేసాము. "హీరో స్ప్లెండర్ బైక్ ఆఫర్ | హీరో స్ప్లెండర్ బైక్ – మైలేజ్, ఫీచర్లు, ధర, వేరియంట్లు & పూర్తి వివరాలు" అనే లింక్‌పై క్లిక్ చేసాము

'హీరో స్ప్లెండర్ బైక్ – మైలేజ్, ఫీచర్లు, ధర, వేరియంట్లు & పూర్తి వివరాలు, ఎందుకు స్ప్లెండర్ బైక్ కొనాలి, హీరో స్ప్లెండర్ బైక్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)' వంటి వివరాలు ఇక్కడ పేర్కొన్నారు. అయితే ఉచితంగా హీరో స్ప్లెండర్ బైక్ పొందడం గురించి ఎటువంటి సమాచారం ఇక్కడ లేదు.

వైరల్ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సదుపాయంలేదు.

ఈ వెబ్సైట్ 'About Us' విభాగంలో కార్తిక్ అనే తెలుగు బ్లాగర్ దీన్ని నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వెబ్‌సైట్‌లో హనుమాన్ చాలీసా, మంత్రాలు, ఆర్తీలు, భజనల వంటి విలువైన PDF ఫైళ్లు తెలుగులో అందుబాటులో ఉంచారని, ఈ సైట్ లక్ష్యం భక్తి సాహిత్యాన్ని చదవాలనుకునే వారిని ఒక వేదికపైకి తీసుకురావడం అని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ పథకాల గురించి ఎలాంటి ప్రస్తావన ఇక్కడ లేదు.

సెమ్రష్ ట్రాఫిక్-విశ్లేషణ డేటా ప్రకారం, భారతదేశంలో నెలకు వేల సంఖ్యలో ఈ వెబ్సైటును నెటిజన్లు సందర్శిస్తున్నారు.

ప్రధాని మోడీ ప్రకటన చేస్తున్న వీడియో

వైరల్ వీడియోలో ప్రధాని మోడీ కనిపిస్తున్న వీడియో క్లిప్ కీ ఫ్రేమ్ సెర్చ్ ద్వారా నరేంద్ర మోడీ అధికారిక ఛానల్ ద్వారా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడిన వీడియో మాకు దొరికింది. "ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో పిఎం-కిసాన్ పథకం, ఇతర కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగం" శీర్షికతో ఫిబ్రవరి 24, 2019లో ఈ వీడియో అప్లోడ్ చేయబడింది.

వైరల్ వీడియోలో ప్రధాన మంత్రి మోదీ యూట్యూబ్ వీడియోలో ఉన్నట్టే అదే రంగు దుస్తులు ధరించి ఉన్నారని, నేపథ్యంలోని అలంకరణ కూడా పూర్తిగా అదే విధంగా ఉందని గుర్తించాం.

అయితే ఉచితంగా స్ప్లెండర్ బైక్ దొరికే ప్రభుత్వ పథకం గురించి ప్రధాని ఈ యూట్యూబ్‌ వీడియోలో ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. వీడియోను మరింతగా విశ్లేషించగా, ముఖ కదలికల్లో కొన్ని అసమానతలు, ఆడియోలో అసహజ మాటల ధోరణి ఉన్నట్లు గమనించాం. ఇవి వీడియో కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా చేయబడింది అనడానికి సర్వ సాధారణ సంకేతం.

హియా ఆడియో ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించగా, ఆ ఆడియో కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందించబడినది లేదా మార్చబడినదై ఉండే అవకాశం ఉందని, ప్రత్యక్ష మానవ ధ్వని లక్షణాలతో కేవలం ఒక శాతం మాత్రమే సరిపోలిందని గుర్తించాం. హియా డీప్‌ఫేక్ డిటెక్టర్ ఆడియో డీప్‌ఫేక్ సాయంతో రూపొందించబడిందని నిర్ధారించింది.

డీప్‌ఫేక్ వీడియో డిటెక్టర్ అయిన డీప్‌వేర్ ఈ వీడియో అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది. మరో ఏఐ వీడియో డిటెక్టర్ హైవ్ మోడరేషన్ దీనికి 62.1 శాతం స్కోర్ ఇచ్చింది, అంటే ఈ వీడియో కృత్రిమ మేధ సాయంతో రూపొందించబడినది లేదా డీప్‌ఫేక్ కంటెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం.

ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఈ వైరల్ క్లెయిమ్ గురించి పోస్ట్ చేసి ఉచిత స్ప్లెండర్ బైకుల కోసం ప్రభుత్వ పథకం చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయలేదని పేర్కొంది.

ఉచితంగా హీరో స్ప్లెండర్ బైకులు పంచే పథకాలు ఏవి కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదని తేలింది. వైరల్ వీడియోలో చూపిస్తున్న వెబ్సైటు సురక్షితమైనది కాదు, దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి సదుపాయం లేదు. ప్రధాని మోడీ కనిపిస్తున్న వీడియో క్లిప్, ప్రకటన చేస్తున్నట్లు ఉన్న ఆడియో కూడా ఏఐ అని తెలుస్తోంది. కాబట్టి వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్‌లో నిజం లేదు. వైరల్ అవుతున్న ప్రధాని మోడీ వీడియో ఏఐతో చేయబడింది. ఉచితంగా హీరో స్ప్లెండర్ బైక్ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఏవి లేవు.
Next Story