Fact Check: రోహింగ్యాలను తరిమికొట్టి సైనికులు సంబరాలు చేసుకున్నారా? లేదు, ఇది హజారీబాగ్ రామనవమి ర్యాలీ
'రోహింగ్యాలను తరిమికొట్టి సైనికులు సంబరాలు జరుపుకుంటున్నారు’ అనే క్లెయిమ్‌తో ఒక భారీ ఊరేగింపుని చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon
Claim:రోహింగ్యాలను తరిమికొట్టి, బెంగాల్ పూర్తిగా హిందువుల చేతుల్లోకి వచ్చిందంటూ సైనికుల సంబరాలు చేసుకుంటున్నారు.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ వీడియో జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో, 2024 లో ఏప్రిల్ 19న జరిగిన రామ నవమి ర్యాలీని చూపిస్తుంది.
Hyderabad: రోహింగ్యాలను తరిమికొట్టిన తర్వాత సైనికులు సంబరాలు జరుపుకుంటున్నారు అనే క్లెయిమ్‌లతో ఒక పెద్ద ఊరేగింపుని చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో చాలా మంది తలకు కాషాయపు బ్యాండ్లు ధరించి, పొడవాటి కర్రలు పట్టుకుని "భారత్ కా బచ్చా బచ్చా, జై శ్రీ రామ్ బోలేగా" అనే పాటకు నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అక్కడ ఉన్న కొంతమంది కామోఫ్లాజ్ యూనిఫామ్ ధరించిన సిబ్బంది కూడా జనసమూహంలో ఉన్న ప్రజలతో కలిసి నృత్యం చేస్తున్నట్లు చూడవచ్చు. ఒక వాహనం, దానిపై మ్యూజిక్, లైటింగ్ పరికరాలు ఉన్నట్లు చూడవచ్చు.
వైరల్ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారు. రోహింగ్యాల గురించి అభ్యంతరకరంగా ప్రస్తావిస్తూ, వీడియోపై, పోస్ట్ క్యాప్షన్‌లో ఇలా రాశారు, "పూర్తిగా హిందువుల చేతుల్లోకి బెంగాల్ రోహింగ్యా … తరిమికొట్టిన తరువాత జవాన్ల సంబరాలు". (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఈ వీడియో జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో, 2024 లో ఏప్రిల్ 19న జరిగిన రామ నవమి ర్యాలీని చూపిస్తుంది.
కీ వర్డ్ సెర్చ్ ద్వారా ఈ వీడియోతో అనుసంధానించబడి, రోహింగ్యాలను తరిమికొట్టిన తర్వాత సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు అని చూపిస్తున్న సోషల్ మీడియా పోస్టులు, వార్త కథనాలు ఏవి మాకు దొరకలేదు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వైరల్ వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్లోడ్ చేయబడినట్లు గుర్తించాం. ఈ వీడియోని ఇంస్టాగ్రామ్లో, ఏప్రిల్ 6న అప్లోడ్ చేసి, "దీనినే ధర్మం పట్ల ప్రేమ అంటారు" అని క్యాప్షన్‌లో రాశారు. (ఆర్కైవ్)
ఇక్కడ వైరల్ వీడియోపై ఉన్న దానికి భిన్నంగా "జై శ్రీ రామ్... ప్రభుత్వం మాది, మేము ప్రభుత్వం వారిమి" అని హిందీలో, "అంతర్జాతీయ రామ నవమి" అని ఇంగ్లీషులో రాశారు.
యూట్యూబ్‌లో వైరల్ వీడియోని ఏప్రిల్ 5న అప్లోడ్ చేసి "జై శ్రీ రామ్" అని రాశారు. యూట్యూబ్ షార్ట్స్‌లో లొకేషన్ "హజారీబాగ్" అని ఉంది.
గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి వైరల్ వీడియో చిత్రీకరించబడిన ప్రదేశాన్ని కనుగొన్నాం. వీడియో హజారీబాగ్ మెయిన్ రోడ్‌లోని "రాధా రాణి" బట్టల దుకాణాన్ని చూపిస్తుంది.
ఈ సమాచారం ఆధారంగా "అంతర్జాతీయ రామ్ నవమి హజారీబాగ్" అనే కీ వర్డ్ సెర్చ్ చేయగా, హజారీబాగ్ రామనవమి అనే పేరుతో ‘international_ramnavmi_hzb’ ఇంస్టాగ్రామ్ అకౌంట్ దొరికింది. ఈ అకౌంట్లో పలు సంవత్సరాలుగా హజారీబాగ్‌లో జరుగుతున్న రామ నవమి సంబరాల వీడియోలు ఉన్నాయి. "అంతర్జాతీయ హజారీబాగ్ రామనవమి 2025" అనే క్యాప్షన్‌తో ఏప్రిల్ 10న ఒక వీడియో అప్లోడ్ చేయబడింది.
అయితే ఈ అకౌంట్లో అప్లోడ్ చేయబడిన వీడియోల్లో వైరల్ వీడియో లేదు. ఈ అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ, రామ నవమి వేడుకలను చూపిస్తున్న అనేక వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయబడ్డాయి. ఇక్కడ మాకు వైరల్ వీడియో కనిపించింది.
దీపక్ భాస్కర్ అనే వ్యక్తి ఈ అకౌంటుని టాగ్ చేస్తూ, ఏప్రిల్ 1న వైరల్ వీడియోని అప్లోడ్ చేశారు. ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ క్యాప్షన్‌లో "#jaisriram #internationalramnavmi #hazaribagramnavmi #breakingnews" అని రాశారు. దీపక్ భాస్కర్ చేసిన పోస్టుకి 38 లక్షల వ్యూస్, 5 లక్షల లైక్స్ వచ్చాయి. (ఆర్కైవ్)
దీపక్ భాస్కర్ ప్రాతః ఆవాజ్ అనే వార్త సంస్థలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, తానే ఈ వీడియోని ఏప్రిల్ 19, 2024న జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో చిత్రీకరించానని అన్నారు.
హజారీబాగ్ రామ నవమి ఊరేగింపులకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. "శ్రీ రామ నవమి వేడుకలు, ఊరేగింపు దశమి రోజున రాత్రి ప్రారంభమై ఏకదై రోజు మొత్తం కొనసాగుతాయి. అన్ని ప్రాంతాల నుండి వేర్వేరు ర్యాలీలు వస్తాయి. దండా చౌక్ ఈ రెల్లీలాన్ని కలిసి ఊరేగింపుగా కలిసి వస్తాయి, జామా మసీదు దాటే వరకు కలిసి కొనసాగుతాయి. మొత్తం ఊరేగింపు ప్రారంభం నుండి చివరి వరకు దాదాపు 48 గంటలు పడుతుంది," అని అన్నారు.
"జనసమూహాన్ని వేగవంతం చేయడానికి, ఉత్సాహాన్ని రేకెత్తిచడానికి, కొన్నిసార్లు జిల్లా పరిపాలన సిబ్బంది, పోలీసులు జనంతో కలిసి నృత్యం చేస్తారు. వీడియో కూడా దాన్నే చూపిస్తోంది. ఒకవేళ అల్లర్లు జరిగితే ఆర్మీ కూడా వస్తుంది. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్నది జిల్లా పరిపాలన సిబ్బంది" అని దీపక్ చెప్పారు.
ఏప్రిల్ 19, 2024న జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో జరిగిన రామనవమి ఊరేగింపు సందర్భంగా జిల్లా అడ్మిస్ట్రేషన్ సిబ్బంది జనాన్ని వేగవంతం చేయడానికి వారితో కలిసి నాట్యం చేయడం వైరల్ వీడియో చూపిస్తోంది.
బెంగాల్ పూర్తిగా హిందువుల చేతుల్లోకి వచ్చిందని, రోహింగ్యాలను తరిమికొట్టిన తర్వాత సైనికులు సంబరాలు చేసుకున్నట్లు ఈ వీడియో చూపించడం లేదు.
కాబట్టి, వైరల్ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది