మంచు మనోజ్ తెలుగు చిత్రసీమలో ప్రధానమైన నటుడు మరియు నిర్మాత మోహన్ బాబు కుమారుడు. మోహన్ బాబు ప్రముఖ విద్యావేత్త, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు మరియు శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు.
మోహన్ బాబు యూనివర్సిటీ 32 వ వార్షికోత్సవ వేడుకలు మరియు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు మార్చి 19న ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగాయి. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ ప్రసంగించారు.
ఆయన ప్రసంగానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ
పోస్ట్ వైరల్ అవుతోంది.
"సొంత చెల్లి, తల్లిని రోడ్డు మీద వదిలేసినోడు మీకు ఏమి సహాయం చేస్తాడు -- జగన్ గురించి మంచు మనోజ్.....జగన్ అక్రమ సంపాదన పంచిపెడితే ఆ డబ్బు తీసుకొండి కాని ఓటు మాత్రం వెయ్యొద్దు అని" పిలుపునిచ్చారని పేర్కొంటూ ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో లో కొంత భాగాన్ని షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
సీఎం జగన్‌ను ఉద్దేశించి మంచు మనోజ్ మాట్లాడారనే వార్త అవాస్తవమని న్యూస్‌మీటర్ తేల్చింది.
మోహన్ బాబు యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో మంచు మనోజ్ చేసిన ప్రసంగం మొత్తం విని విశ్లేషించాము. కానీ ఆయన సీఎం జగన్ గురించి గానీ నేరుగా జగన్‌ను ఉద్దేశించి గానీ మాట్లాడినట్లు మాకు కనిపించలేదు.
మంచు మనోజ్, తన 9 నిమిషాల 40 సెకన్ల ప్రసంగంలో, 8 నిమిషాల పాటు తన తండ్రి మరియు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
టైమ్‌స్టాంప్ 8:10 సెకన్లు నుండి, మనోజ్ ఎన్నికల గురించి మాట్లాడుతూ "ఎన్నికలు వస్తున్నాయి, సరైన నాయకుడిని ఎంచుకోండి , మీ ప్రాంతంలో ఎవరు మంచివారో మీకే తెలుస్తుంది, మీ ప్రాంతంలో ప్రజలను నడిపించే వారిని ఎన్నుకోండి. వారి సొంత కుటుంబానికి లేదా చుట్టుపక్కల వ్యక్తులకు సహాయం చేయని వారు, మీకు ఎలా సహాయం చేయగలరు.
దీన్ని గుర్తుంచుకోండి, మీకు మరియు మీ ప్రాంతంలో పేద ప్రజలకు సహాయం చేయగలరని మీరు భావించే నాయకుడికి ఓటు వేయండి. ఎవరైనా మీకు డబ్బు ఇస్తే తీసుకోండి, కానీ వారు మీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి వారికి ఓటు వేయకండి. మీరు కోరుకున్న వారికి ఓటు వేయండి" అని ఆయన ముగించారు.
ఇది ఎన్నికల గురించి ఆయన చేసిన సాధారణ ప్రసంగం, ఎక్కడా సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రస్తావించలేదు, జగన్ గురించి మాట్లాడలేదు.
టైమ్‌స్టాంప్ 8:40 సెకన్ల నుండి వీడియోలో కొంత భాగాన్ని
పోస్ట్ చేస్తూ, కొంతమంది, మంచు మనోజ్ సీఎం జగన్ గురించి మరియు అతని అక్రమ సంపాదన గురించి మాట్లాడారని పేర్కొన్నారు. మనోజ్ తన ప్రసంగంలో జనసేన పార్టీకి ఓటు వేయాలని కోరినట్లు కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు పేర్కొన్నాయి మరియు "జై జనసేన" నినాదంతో మనోజ్ తన ప్రసంగాన్ని ముగించినట్లు పేర్కొన్నాయి.
కానీ ఈ వాదన కూడా తప్పు, వాస్తవానికి మనోజ్ తన ప్రసంగాన్ని "వందేమాతరం" నినాదంతో ముగించాడు. మోహన్ బాబు యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగం గురించి సోషల్ మీడియాలో చాలా మంది వివిధ వాదనలు చేశారు.
కానీ వాస్తవానికి,ఆయన ఎన్నికల గురించి సాధారణ ప్రసంగం చేశారు, ఎవరిని ఉద్దేశించలేదు.
అందుకే, మంచు మనోజ్ , మోహన్ బాబు యూనివర్శిటీలో, చేసిన ప్రసంగంలో సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడారనే వాదన అవాస్తవమని మేము నిర్ధారించాము.