Disclaimer: ఈ ఫాక్ట్ చెక్ మానసిక ఆరోగ్య సంస్థలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని సూచిస్తుంది. మానసిక ఆరోగ్యం అనేది ఒక సున్నితమైన విషయం అని గుర్తిస్తున్నాం. సాంప్రదాయ దృక్పథాలను ప్రోత్సహించకుండా లేదా మానసిక ఆరోగ్య పరిస్థితులను కళంకం కలిగించకుండా స్పష్టతను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. మీకు లేదా మీకు తెలిసిన వారికి మద్దతు అవసరమైతే, దయచేసి మానసిక ఆరోగ్య నిపుణుల నుండి సహాయం తీసుకోండి.
Hyderabad: ఆసుపత్రి వార్డులో కటకటాల వెనుక చిరిగిన బట్టలు, విగ్గులతో మానసిక రోగులలా కనిపిస్తున్న వారిని చూపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లోని దృశ్యాలు అన్న క్లెయిమ్స్ తో షేర్ చేయబడుతోంది.
ఈ వీడియోలో, హాస్పిటల్ వార్డ్ చుట్టూ కంచె వేసినట్లు కనిపిస్తుంది. ఆ వార్డులో హాస్పిటల్ గౌన్లు ధరించిన వ్యక్తులు బెడ్‌లపై కనిపిస్తున్నారు. మరోవైపు, చిరిగిన బట్టలు, విగ్గులు వేసుకున్న వ్యక్తులు కటకటాల వెనుక బంధించబడినట్లు చూడగలం. ఈ రెండు స్థలాల మధ్య దారిలో ప్రేక్షకులు నడుస్తూ, ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారు.
ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో “ఇట్స్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్…” (ఆర్కైవ్) అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
Fact Check
న్యూస్‌మీటర్ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. వీడియోలోని మొత్తం సెటప్ పశ్చిమ బెంగాల్‌లోని దుర్గా పూజ పండల్‌లో భాగం.
వీడియో కీఫ్రేమ్‌ల రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా యూట్యూబ్‌లో అప్లోడ్ చేయబడిన ఓ వీడియో కనుగొన్నాం. వీడియో 2024 అక్టోబర్ 12న, ‘మానసిక ఆశ్రయం థీమ్ ఆధారిత పూజా పండల్ || సంతన్ సంఘ || కూచ్‌బెహర్' టైటిల్‌తో అప్‌లోడ్ చేయబడింది.
యూట్యూబ్ వీడియో కూడా వైరల్ వీడియోలో కనిపించే దృశ్యాలను చూపిస్తుంది. వీడియోల మధ్య పోలికలు క్రింద ఉన్న చిత్రంలో చూడగలం, దీని ద్వారా రెండు వీడియోలు ఒకే ఘటనకు సంబందించినవి అని అర్థం అవుతుంది.
యూట్యూబ్ వీడియో టైటిల్‌లొని లీడ్ అనుసరించి, టెలిగ్రాఫ్ ఇండియా అక్టోబర్ 14న ప్రచురించిన కథనాన్ని కనుగొన్నాము. “‘బెహలా ఫైట్ క్లబ్’ టు క్యూరియస్ మంకీ టు ‘మానసిక ఆసుపత్రి’ థీమ్, దుర్గాపూజ 2024 యొక్క ఫన్నీ, విచిత్రమైన క్షణాలు,” అనే శీర్షికతో కథనం ప్రచురించబడింది.
కథనంలో, "ది 'పాగ్లా గారోడ్' థీమ్" అని లేబుల్ చేయబడిన వైరల్ వీడియో స్క్రీన్‌షాట్‌లను చూడగలం. “పగ్లగరోడ్ (బెంగాలీ యాసలో మానసిక ఆసుపత్రి అని అర్థం) థీమ్‌తో కూచ్‌బెహార్‌లోని ఒక పండల్ మానసిక అనారోగ్యాన్ని మొరటుగా చిత్రీకరించినందుకు సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ పండల్‌లో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల దుస్తులు ధరించారు.”
వైరల్ వీడియో పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లోని దుర్గా పూజ ‘మానసిక ఆసుపత్రి’ థీమ్ పండల్ సెటప్ నుండి వచ్చినదని టెలిగ్రాఫ్ నివేదిక ధృవీకరించింది. అందువల్ల హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లో రోగుల స్థితిగతులను వీడియోలో చూపించడం లేదని న్యూస్‌మీటర్ తేల్చింది. క్లెయిమ్ తప్పు.