Fact Check: 'లవ్ జిహాద్' ఘటనలో హింసించబడ్డ మహిళల చిత్రాలా? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి

లవ్ జిహాది బారిన పడి హింసించబడ్డ మహిళల చిత్రాలను చూపిస్తున్నాయి అనే క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు ఫోటో. కానీ, అసలు నిజం ఇదే...

By -  K Sherly Sharon
Published on : 2 Nov 2025 9:57 PM IST

Fact Check: లవ్ జిహాద్ ఘటనలో హింసించబడ్డ మహిళల చిత్రాలా? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి
Claim:వైరల్ ఫోటోలు లవ్ జిహాది బారిన పడి హింసించబడ్డ మహిళ చిత్రాలను చూపిస్తుంది.
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. ఇవి బంగ్లాదేశ్ సినిమా పోస్టర్లకు సంబంధించిన చిత్రాలు.

Hyderabad: లవ్ జిహాద్ ఘటనను చూపిస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మొదటి చిత్రంలో ఒక వ్యక్తి, మహిళ కనిపిస్తున్నారు. వ్యక్తి ఫోటోపై ముస్లిం అని రాసి ఉంది, మహిళ ఫోటోపై హిందూ అని రాసినట్లు చూడవచ్చు. రెండవ చిత్రంలో మహిళ ముఖంపై కాలిన గాయం ఉన్నట్లు కనిపిస్తుంది.

ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసి క్యాప్షన్‌లో ఫోటోలో ఉన్న మహిళ పేరు నందిని మండల్ అని, 2023లో తను అబ్దుల్ ఆదిల్ ఖాన్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని, ఇస్లాం మతంలోకి మారి జరా ఇస్లాంగా పేరు కూడా మార్చున్నారని రాశారు. మొదటి ఫోటో 2023కి సంబంధించినది అని, రెండవది 2025లో ఆ మహిళ స్థితిని చూపిస్తుంది అని క్లెయిమ్ చేశారు.

"... 2023 నుండి 2025 వరకు, అబ్దుల్ రెండేళ్లుగా తన శారీరక కోరికలను తీర్చుకున్నాడు, ఆ అమ్మాయి సంపాదన, ఆస్థి దోచుకొని ఆమెను కొట్టి ఇంటి నుండి వెళ్ళగొట్టాడు....లవ్ జిహాద్ అంటే ఇదే...2023 ఫోటో, 2025 ఫోటో," అని పేర్కొన్నారు. (ఆర్కైవ్)

ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టులు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2, ఆర్కైవ్ 3)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. మొదటి చిత్రం సినిమా పోస్టర్‌ను చూపిస్తుంది, రెండవది షూటింగ్ కోసం చేసిన మేకప్ చూపిస్తుంది.

మొదటి ఫోటో

వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా జౌటీ ఇస్లాం అనే ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ డిసెంబర్ 28, 2024న షేర్ చేసిన ఫోటో దొరికింది. ఈ ఫోటోపై 'రెండు రోజుల్లో 2 మిలియన్లు', 'విధవ భార్య' అని రాసి ఉంది. వైరల్ ఫోటో, ఇన్‌స్టాగ్రామ్ ఫోటో రెండు ఒకటే అని తెలుస్తోంది.

కీవర్డ్ సెర్చ్ ద్వారా, 'విధవ భార్య' ఒక బంగ్లాదేశీ సినిమా అని తెలుస్తోంది. ఛాయస్ వ్యూ మీడియా అనే యూట్యూబ్‌ ఛానల్ లో వైరల్ ఫోటోనే ఈ సినిమా థంబ్‌నెయిల్ గా ఉపయోగించి షేర్ చేశారు. "విధవ భార్య | బిధోబా బౌ | తుహిన్ చౌదరి | జౌటీ ఇస్లాం | మోహిన్ ఖాన్ | బంగ్లా న్యూ నాటిక 2024" అనే శీర్షికతో అప్లోడ్ చేయబడింది.

మొదటి వైరల్ ఫోటో చూపిస్తున్నది ఒక బంగ్లాదేశీ సినిమా, 'విధవ భార్య' పోస్టర్ అని తేలింది. జౌటీ ఇస్లాం ఈ సినిమాలో నటించారు.

రెండవ ఫోటో

జౌటీ ఇస్లాం అక్టోబర్ 21న ఫేస్‌బుక్‌లో అప్లోడ్ చేసిన ఒక వీడియో దొరికింది. ఈ వీడియోలో కూడా వైరల్ ఫోటోలో ఉన్నట్లే ముఖంపై కాలిన గాయాలు ఉన్నట్లు చూడగలం. ఈ వీడియో క్యాప్షన్‌లో "జీవితంలో ప్రతిదాని వెనుక తెలియని కథ ఉంటుంది, ఆ కథను ఎవరూ తెలుసుకోవాలని లేదా అర్థం చేసుకోవాలని అనుకోర" అని రాశారు. "#foryoupagereels #joutyislam #BTS #BanglaNatok #shooting" వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించారు. 'BTS' అంటే 'Behind The Scenes', తెర వెనుక అని అర్ధం వస్తుంది.

ఇది షూటింగ్‌లో ఒక భాగం అని జౌటీ ఇస్లాం వీడియో కింద కామెంట్స్‌లో రాశారు.

వీడియో షేర్ చేసిన కొన్ని రోజుల తర్వాత, అక్టోబర్ 30న ముఖంపై కాలిపోయిన గాయాలు ఉన్నట్లు చూపిస్తున్న ఒక ఫోటోని షేర్ చేసారు. ఈ చిత్రం కూడా సినిమా పోస్టర్ లాగా రూపొందించబడింది. దీనిపై 'నేను నుస్రత్ మాట్లాడుతున్నాను', 'ఫుల్ డ్రామా' అని రాసి ఉంది.

రెండో వైరల్ ఫోటోలో కనిపిస్తున్నది కూడా మేకప్ అని తేలింది.

వైరల్ అవుతున్న రెండు ఫోటోలు బంగ్లాదేశీ సినిమా పోస్టర్ కు సంబంధించినవి, ఇది లవ్ జిహాద్ ఘటనను చూపించడం లేదు. కాబట్టి ఈ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. ఇవి బంగ్లాదేశ్ సినిమా పోస్టర్లకు సంబంధించిన చిత్రాలు.
Next Story