Fact Check: ఏపీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఒకే వ్యక్తి అనేక ఓట్లు వేశారా? లేదు, ఇది పాత వీడియో
ఒక వ్యక్తి పోలింగ్ బూత్ వద్ద చాల ఓట్లు ఒకేసారి వేయడం చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon
Claim:ఏపీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఒకే వ్యక్తి చాల ఓట్లు వేయడం చూపిస్తున్న వీడియో.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ వీడియో ఇంటర్నెట్లో కనీసం జులై 2023 నుండి చక్కర్లు కొడుతోంది.
Hyderabad: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు, ఫలితాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒకేసారి చాల ఓట్లు వేస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియోను Xలో షేర్ చేస్తూ, మాజీ మంత్రి "ఈ ZPTC ఎన్నికల ఫలితాలు కోయ ప్రవీణ్ IPS కి అంకింతం !" అని రాశారు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. వైరల్ అవుతున్న వీడియో కనీసం జూలై 2023 నుండి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
ఆగస్టు 12న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని, కేంద్ర భద్రతా సంస్థల రక్షణలో తిరిగి నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలు అప్రజాస్వామికంగా, నిరంకుశంగా జరిగాయని ఆయన ఆరోపించారు.
కొన్ని చోట్ల, పోలింగ్ సమయంలో టిడిపి, వైయస్ఆర్సిపి కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా చెలరేగాయి.
అయితే, వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నట్లు ఒకే వ్యక్తి పలు ఓట్లు వేశారనే వార్త ఎక్కడా కనిపించలేదు.
వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో జులై 9, 2023 లో Xలో పోస్ట్ చేయబడినట్లు కనుగొన్నాం. ఈ వీడియోలో కనిపించని ఒక మహిళా బెంగాలీ భాషలో మాట్లాడుతున్నట్లు వినిపిస్తుంది. పోస్టు క్యాప్షన్‌లో "#పశ్చిమబెంగాల్ పంచాయతీ పోల్ జరిగిన విధానం", అని రాసుకొచ్చారు.
The way #WestBengalPanchayatPoll happened. pic.twitter.com/KCEqcb36W9
— Aparna (@chhuti_is) July 9, 2023
ఇదే పోస్టుని షేర్ చేసి "పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే ఒక వ్యక్తి ఒకేసారి 20 ఓట్లు వేయగలడు", అని రాశారు.
2023లో పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బూత్ క్యాప్చరింగ్, బ్యాలెట్ స్టఫ్పింగ్, ట్యాంపరింగ్ జరిగాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అనేక ప్రాంతాలలో తిరిగి పోలింగ్ కూడా జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వాస్తవ పరిశీలనా విభాగం ఈ వీడియోని షేర్ చేసి, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. "... నిజానికి అది 2023 జులైలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తాలూకు వీడియో. దీన్ని అప్పట్లోనే సుధాంశు వేది అనే వ్యక్తి పోస్ట్ చేసారు. అంటే అది ఇక్కడి వీడియో కాదు. నాటి వీడియోని ఉపయోగిస్తూ... ఒక డీఐజీ స్థాయి అధికారి మీద అంబటి రాంబాబు గారు ఈ విధంగా పోస్ట్ చేయడం... ప్రభుత్వ యంత్రాంగం మీద కుట్రపూరిత ఆరోపణ చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కిందికి వస్తుంది..." అని రాశారు.
ఈ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయ ప్రవీణ్ ఐపీఎస్ కు అంకితం అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక వీడియోను పోస్ట్ చేసారు. అందులో ఒకే వ్యక్తి అనేక ఓట్లను వేస్తున్నాడు. అంటే నిన్నటి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులు దగ్గరుండి దొంగ ఓట్లు వేయించారు అన్న అర్థం వచ్చేలా ఆయన… pic.twitter.com/E8Upl0ZuP0
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) August 14, 2025
అయితే, వైరల్ వీడియోలో కపిస్తున్న ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాము.
వైరల్ వీడియో ఇంటర్నెట్లో కనీసం జులై 2023 నుండి చక్కర్లు కొడుతోంది. ఆంధ్ర ప్రదేశ్ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు, ఆగష్టు 12, 2025 న జరిగాయి.
కాబట్టి వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.