Hyderabad: మాజీ ప్రధాని, భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న రాత్రి ఢిల్లీలో కన్నుమూశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు ప్రధానిగా ఉన్న సింగ్ గురువారం రాత్రి 9.51 గంటలకు వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో, మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో సింగ్ తలపాగా, గడ్డం లేకుండా కనిపించారు. ఈ ఫోటోని “ఆస్పత్రిలో మన్మోహన్ సింగ్.. చివరి ఫొటో” అని క్లెయిమ్ చేస్తూ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. (ఆర్కైవ్)
ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు.(ఆర్కైవ్)
Fact Check
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వైరల్ ఫోటో అన్‌క్రాప్డ్ వెర్షన్‌తో పాటు మరొక చిత్రాన్ని 2021 అక్టోబర్ 14న షేర్ చేసిన నవభారత్ టైమ్స్ పోస్ట్ కనుగొన్నాము. అన్‌క్రాప్డ్ వెర్షన్‌లో అప్పటి ఒక వైద్యుడితో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా చిత్రంలో ఉన్నట్లు కనిపిస్తుంది. రెండో చిత్రంలో మాండవియా, మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ ఉన్నారు. (ఆర్కైవ్)
The Tribune వెరిఫైడ్ యూట్యూబ్ ఛానెల్ 2021లో అక్టోబర్ 14న అప్‌లోడ్ చేసిన ఓ వీడియోను కనుగొన్నాము. ఈ వీడియో డిస్క్రిప్షన్లో "జ్వరంతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం కలుసుకుని ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు." అని రాశారు. (ఇంగ్లీష్ నుండి అనువదించబడింది) అదే రోజు ANI కూడా మాండవ్య మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఎయిమ్స్‌లో కలవడానికి వెళ్లిన ఫోటోలను పోస్ట్ చేసింది.
ఈ చిత్రం 2021 నాటిది కాబట్టి, వైరల్ అవుతున్న క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ కనుగొంది.
ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను మాండవ్య పరామర్శించారని పోస్ట్ క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
అయితే, 2021 అక్టోబర్ 15న Hindustan Times ప్రచురించిన కథనం ప్రకారం, మాండవ్య మన్మోహన్ సింగ్‌ను పరామర్శించేందుకు వెళ్లడం, కుటుంబ సభ్యుల అనుమతి లేకపోయినా ఆసుపత్రి వార్డులో ఫోటో దిగడం విమర్శలకు దారి తీసింది. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ ఖండించింది, బిజెపి "ఫోటో ఆప్" ను ప్రదర్శిస్తోందని ఆరోపించింది.
సింగ్ కుమార్తె దమన్ సింగ్, మాండవ్య కుటుంబ కోరికకు వ్యతిరేకంగా ఫోటోగ్రాఫర్‌ను తీసుకువచ్చారని ఆరోపించడంతో విమర్శలు వచ్చాయి.
అక్టోబర్ 15, 2021లో "'జూలో జంతువులు కాదు': మాండవ్య అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ AIIMSలో ఫోటో షూట్ చేయించుకున్నారని మన్మోహన్ కుమార్తె చెప్పింది" అనే టైటిల్‌తో The Print ప్రచురించిన కథనాన్ని కూడా చూశాము.
మీడియాతో మాట్లాడిన దమన్ సింగ్, మంత్రితో పాటు ఫోటోగ్రాఫర్ గదిలోకి ప్రవేశించడంతో ఆమె తల్లి తీవ్రంగా కలత చెందిందని వెల్లడించారు. ఫోటోగ్రాఫర్ వెళ్లిపోవాలని ఆమె తల్లి పట్టుబట్టినప్పటికీ, ఆమె అభ్యర్థన "పూర్తిగా విస్మరించబడింది."
“ఆమె చాలా కలత చెందింది. నా తల్లిదండ్రులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోనేవిధంగా ప్రయత్నిస్తున్నారు. వారు వృద్ధులు, జూలోని జంతువులు కాదు" అని దామన్‌ను ఉటంకిస్తూ కథనంలో రాశారు.
ఈ సమాచారం ఆధారంగా ఆసుపత్రిలో మంచం మీద ఉన్న డాక్టర్ సింగ్ చిత్రం 2021 నాటిదని తేలింది. వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.