Fact Check: మహా కుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం, కూలిన వంతెన? అసలు నిజం ఇక్కడ తెలుసుకోండి...
మహా కుంభమేళాలో వంతెనపై జరిగిన భారీ అగ్ని ప్రమాదం, వంతెన కూలిపోయి మునిగి పోయిన వాహనాలు అనే క్లెయిమ్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
By K Sherly Sharon Published on 13 Feb 2025 6:27 PM IST![Fact Check: మహా కుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం, కూలిన వంతెన? అసలు నిజం ఇక్కడ తెలుసుకోండి... Fact Check: మహా కుంభ మేళాలో భారీ అగ్ని ప్రమాదం, కూలిన వంతెన? అసలు నిజం ఇక్కడ తెలుసుకోండి...](https://newsmeter.in/h-upload/2025/02/13/394728-copy-of-copy-of-webcover-factcheck-1.webp)
Claim: జనవరి 31, 2025న మహా కుంభమేళాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదాన్ని చూపిస్తున్న వీడియో.
Fact: వైరల్ క్లెయిమ్ తప్పు. ఈ వీడియో ఏఐ ద్వారా రూపొందించబడింది.
Hyderabad: మహా కుంభ మేళాలో 2025 జనవరి 31న కేబుల్ బ్రిడ్జిపై భారీ అగ్ని ప్రమాదం జరిగిందంటు క్లెయిమ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కేబుల్ బ్రిడ్జిపై అర్ధాంతరంగా భారీ పేలుడు జరిగి మంటలు అంటుకున్నట్లు కనిపిస్తుంది. బ్రిడ్జిపై ఉన్న వాహనాలు ఎగిరి కింద నీళ్లలో పడినట్లు, తర్వాత బ్రిడ్జి కూడా కూలిపోయినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో మీద "మహా కుంభ 2025 31/01/2025" అని రాశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఒక కోటి అరవై లక్షల మంది నెటిజన్లు ఈ వీడియోని చూసారు, ఇప్పటికే ఈ వీడియోపై ఒక లక్ష యాభైవేల లైకులు ఉన్నాయి.
ఈ వీడియోని 2025 జనవరి 31న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అసలు వీడియోకి సంబంధం లేని, అసంబద్ధమైన క్యాప్షన్‌ను రాశారు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి రూపొందించబడింది.
కీ వర్డ్ సెర్చ్ ద్వారా మహా కుంభ మేళాలో జనవరి 31న కేబుల్ వంతెన మీద అగ్ని ప్రమాదం జరిగినట్లు పేర్కొన్న ఎలాంటి కథనాలు, విశ్వసనీయ సమాచారం దొరకలేదు. అసలు జనవరి 31న కుంభ మేళాలో అగ్ని ప్రమాదం జరిగిందని కూడా ఏ కథనాలు ప్రచురించ లేదు.
వైరల్ వీడియో కీ ఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా 2025 జనవరి 29న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడిన రెండు వీడియోలను కనుగొన్నాం.
వాటిని మీరు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)
ఈ వీడియోల శీర్షికలలో ఈ అగ్ని ప్రమాదం అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 2025 జనవరి 27న జరిగినట్లు పేర్కొన్నారు.
అయితే వీడియోను నిశితంగా పరిశీలించినప్పుడు, కార్లు, పొగకు సంబంధించిన ఇతర వివరాలు అసాధారణంగా, అనుమానాస్పదంగా కనిపించాయి. వంతెన కింద నీటిలో పడిపోయిన వాహనాల అసహజ కదలికలను వీడియో చూపిస్తుంది. ఇవి ఏఐ ఉత్పత్తి చేసే వీడియోలకు సాధారణ సంకేతం.
ఈ వీడియోలో Hive Moderation 74.9 శాతం Al-జనరేటెడ్ లేదా డీప్ ఫేక్ కంటెంట్ ఉండే అవకాశం ఉంది అని గుర్తించింది.
వైరల్ వీడియోలోని కేబుల్ వంతెన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని న్యూ యమునా వంతెనను పోలి ఉందని కనుగొన్నాం. న్యూ యమునా వంతెన మీద ఎటువంటి అగ్ని ప్రమాదం గురించిన వార్త కథనాలు లేవు.
వైరల్ వీడియోలో ఉన్న ఆడియో?
కీ వర్డ్ సెర్చ్ ఉపయోగించి వైరల్ వీడియోలో ఉపయోగించిన ఆడియోకి సంబంధించిన అసలు వీడియో కనుగొన్నాం.
ఈ వీడియోను voice_of_rajasthann అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్లో మొదటిసారిగా, జనవరి 19న షేర్ చేసారని తెలుస్తోంది. వీడియోలో మంటలు చెలరేగి పొగ పైకి లేస్తున్నట్లు చూడగలం. అక్కడే అగ్నిమాపక యంత్రాలు మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించడం చూడగలం.
ఇది జనవరి 19న మహా కుంభ మేళా సెక్టర్ 19లో గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదానికి చెందిన వీడియో.
మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదాలు:
జనవరి 19న సెక్టార్ 19 ప్రాంతంలో సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది, దీనిలో ఒకరు గాయపడ్డారు.
జనవరి 25న, సెక్టార్ 2లో షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి.
ఫిబ్రవరి 7న, కుంభమేళాలో రెండు ప్రదేశాల్లో, సెక్టార్ 18, సెక్టార్ 5లలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది.
ఫిబ్రవరి 9న, సెక్టార్ 19లోని 'కల్పవాసి' టెంట్‌లో మరో గ్యాస్ సిలిండర్ లీక్ కారణంగా మంటలు చెలరేగాయి.
వైరల్ క్లెయిమ్‌ను పోలిన, మహా కుంభమేళాలో ఒక ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి గతంలో ఇతర క్లెయిమ్‌లు వచ్చాయి, కానీ ఇది ఒక మాక్ డ్రిల్ అని తేలింది.
ఫాక్ట్ చెక్ తీర్పు
ఇది వరకే జరిగిన అగ్ని ప్రమాదానికి చెందిన వీడియోలోని ఆడియోని ఏఐతో రూపొందించిన వీడియోతో కలిపి వైరల్ వీడియోను తయారు చేశారు అని తేలింది.
కాబట్టి, న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్‌లు అవాస్తవమని నిర్ధారించింది.