Hyderabad: సినీ నటి రష్మిక మందన్న ఆక్సిజన్ ట్యూబ్‌తో, తలపై బ్యాండేజీలతో హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలు రష్మిక మందన్న అనారోగ్యానికి గురైందన్న క్లెయిమ్‌లతో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ చిత్రాలు కూడా ఉన్నాయి.
ఈ ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసి క్యాప్షన్‌లో ఈ విధంగా వ్రాశారు:
"నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఏమైంది? ఇలా చూసి నేను తట్టుకోలేను. తన పరిస్థితికి కారణం ఏమిటి?" (కన్నడ నుండి అనువదించబడింది)
ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
Fact Check:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న క్లెయిమ్‌ని తప్పు అని కనుగొంది. ఈ చిత్రం వేరే వ్యక్తి ఫోటోను రష్మిక మందన్న ఫోటోగా ఎడిట్ చేసి రూపొందించబడింది.
కీవర్డ్ సెర్చ్ ద్వారా రష్మిక మందన్న ఇటీవల కాలు ఫ్రాక్చర్ అయినట్లు BigTV Telugu కథనంలో ప్రచురించారు. "మూడు చోట్ల ఫ్రాక్చర్.. గాయంపై స్పందించిన రష్మిక..!" అనే శీర్షికతో 2025 జనవరి 26న ప్రచురించిన కథనంలో, "అయితే తాజాగా తన కాలికి ఎన్ని చోట్ల ఫ్రాక్చర్ అయింది అనే విషయం సోషల్ మీడియా ద్వారా బయటపెడుతూ అందరికి షాక్ ఇచ్చింది," అని వ్రాశారు.
రష్మిక మందన్న ఇంస్టాగ్రామ్ అకౌంట్లో 2025 జనవరి 11న కాలి పట్టితో ఫోటో అప్లోడ్ చేస్తూ తాను జిమ్‌లో గాయ పడినట్లు చెప్పింది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వైరల్ ఫోటోలోని వివరాలతో కూడిన చిత్రాన్ని కనుగొన్నాము, కానీ అందులో రష్మిక ముఖం కాకుండా వేరే వ్యక్తి ముఖం కనిపించింది. ఈ చిత్రం Yahoo News 12 జనవరి 2025న ప్రచురించిన "బిబిసి ఎస్కేప్ టు ది కంట్రీ స్టార్ నిక్కీ చాప్‌మన్ షాకింగ్ హాస్పిటల్ ఫోటోను షేర్ చేసి 'ఎమోషనల్' అని అన్నారు" కథనంలో ఉపయోగించారు.
“ఎస్కేప్ టు ది కంట్రీ స్టార్ నిక్కీ చాప్‌మన్ శస్త్రచికిత్స చేయించుకున్న ఐదు సంవత్సరాల తర్వాత బ్రెయిన్ ట్యూమర్‌తో తన బాధాకరమైన అనుభవం గురించి మాట్లాడిన తర్వాత తాను 'భావోద్వేగానికి' గురయ్యానని చెప్పారు” అని వ్రాశారు. ఈ కథనంలో నిక్కీ చాప్‌మన్ ఈ చిత్రాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకున్నట్టు పేర్కొన్నారు.
Yahoo News కథనంలో నిక్కీ చాప్‌మన్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు అని పేర్కొన్న ఫోటోలు ఆమె 2025 జనవరి 9న చేసిన పోస్టులో దొరికాయి.
నిక్కీ చాప్‌మన్ పంచుకున్న ఫోటోలనే రష్మిక మందన్నను చూపిస్తున్నట్లుగా ఎడిట్ చేశారని అర్ధం అవుతుంది.
వైరల్ అవుతున్న చిత్రంలో రష్మికతో పాటు, అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ఫోటోలను కూడా చూడవచ్చు. అయితే ఈ ఫోటోలు ప్రముఖ తెలుగు నటుడు-చిత్రనిర్మాత మహేష్ బాబు తండ్రి కృష్ణ అంత్యక్రియల సందర్భంగా తీయబడినవి.
ఈ సమాచారం ప్రకారం రష్మిక మందన్న కాలికి గాయమైంది కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని క్లెయిమ్ చేస్తూ వైరల్ అవుతున్న పోస్ట్ ఎడిట్ చేయబడినది. కాబట్టి న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.