Hyderabad: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచే అంశంపై మంత్రుల బృందం సిఫార్సులు ఇవ్వాలని జారీ చేసిన జీవోను చూపిస్తున్న ఒక డాక్యుమెంట్ వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతోంది.
ఆగస్టు 29 నాటి డాక్యుమెంట్లలో, "AP విభజన చట్టం 2014, ఇతర ప్రభుత్వ సంస్థలలోని IX, XV షెడ్యూల్‌లలో చేర్చబడిన ప్రభుత్వ సంస్థలు/సంఘాలు/కార్పొరేషన్లలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది" అని పేర్కొన్నారు.
రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి, సిఫార్సులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తోందని కూడా ఈ డాక్యుమెంట్‌లో ఉంది. మంత్రులు పొంగూరు నారాయణ, నారా లోకేష్, పయ్యావుల కేశవ్ వంటి వారిని సభ్యులుగా పేర్కొంది.
వాట్సాప్‌లో చంచలనం సృష్టిస్తున్న జీవో స్క్రీన్‌షాట్ క్రింద చూడవచ్చు. వైరల్ డాక్యుమెంట్ లోని జీవో సంఖ్య 'RT 1575' అని ఉంది.
Fact Check
న్యూస్‌మీటర్ ఈ వాదన తప్పు అని కనుగొంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయలేదు.
కీవర్డ్ శోధనలను ఉపయోగించి, 62 నుండి 65 సంవత్సరాలకు సూపర్‌యాన్యుయేషన్ వయస్సును పెంచడం గురించి AP ప్రభుత్వం చేసిన ప్రకటనలు ఏవీ మాకు కనిపించలేదు.
వైరల్ డాక్యుమెంట్‌లో చేస్తున్న క్లెయిమ్‌లకు ఆధారాలను కనుగొనడానికి ప్రభుత్వ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో వెతికాము. అయితే, ఆగస్టు 29న RT 1575 జీవో నంబర్‌తో జారీ చేయబడిన జీవోలు ఏవి కనిపించలేదు.
ఆగస్టు 29న జారీ చేయబడిన ఏవైనా సూపర్‌యాన్యుయేషన్ జీవోల కోసం కూడా వెతికాము. ఆ రోజు 'సూపర్‌యాన్యుయేషన్' అనే కీవర్డ్‌తో దాఖలు చేయబడిన 4 జీవోలను రిజిస్టర్ చూపించింది. అయితే, వైరల్ డాక్యుమెంట్ వీటిలో లేదు.
వైరల్ డాక్యుమెంట్ నుండి వివిధ కీలకపదాలను ఉపయోగించి, ఆగస్టు 22న డెక్కన్ క్రానికల్ ప్రచురించిన నివేదికను కనుగొన్నాం. 'AP పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచడంపై GoMను ఏర్పరుస్తుంది' అనే శీర్షికతో ఈ నివేదికను ప్రచురించారు.
"ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, 2014లోని IX, X షెడ్యూల్‌లలో చేర్చబడిన ప్రభుత్వ సంస్థలు/సంఘాలు/కార్పొరేషన్లలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచడాన్ని పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది" అని నివేదిక పేర్కొంది.
ఈ జీవో ఆగస్టు 22న జారీ చేయబడింది. ప్రభుత్వ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ జీవోని కనుగొన్నాం. పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలనే అంశంపై జారీ అయినా జీవో, వైరల్ డాక్యుమెంట్ మధ్య చాలా పోలికలు కనిపించాయి.
వైరల్ డాక్యుమెంట్, ఆగస్టు 22న జారీ చేసిన జీవో పోలికను క్రింద చూడవచ్చు. అసలు ఆగస్ట్ 22 జీవోను ఎడిట్ చేయడం ద్వారా వైరల్ డాక్యుమెంట్ రూపొందించినట్లు స్పష్టమైంది.
ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్‌మెంట్ కూడా ఎక్స్‌లో వైరల్ డాక్యుమెంట్ గురించి పోస్టు చేసి, "... నకిలీ జీవో ను సృష్టించిన కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు" అని రాశారు.
కాబట్టి, వైరల్ డాక్యుమెంట్ నకిలీది అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.