హైదరాబాద్: తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16న తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంక్రాంతి పండుగ తర్వాత కొత్త తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి బీపీఎల్ (బెలో పావర్టీ లైన్) కుటుంబానికి రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, 18 లక్షల దరఖాస్తుల్లో 10 లక్షల మందికి జనవరిలో కార్డులు ఇస్తామని తెలిపారు.
ఈ నేపథ్యంలో, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో ఆయన మాట్లాడుతూ, "గణాంకాల ప్రకారం తలసరి ఆదాయం మూడు.3.7 లక్షలు అని ప్రత్యేక కమీషనర్ అన్నట్టు విన్నాను, అలాంటప్పుడు తెలంగాణలో పేదరికం ఎక్కడుంది? అంత బియ్యం ఎక్కడికి పోతున్నాయి?”
ఒక ఎక్స్ (మునుపటి ట్విట్టర్) యూజర్ వీడియోను షేర్ చేస్తూ ఇలా రాశాడు: " పేదలు లేరు కాబట్టే రేషన్ కార్డుల పంపిణీ చేయట్లేదు"
ఇలాంటి పోస్టులు ఇక్కడ [లింక్ 1], [లింక్ 2] చూడవచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్‌ను తప్పు అని నిర్ధారించింది. వీడియోలో గుత్తా సుఖేందర్ రెడ్డి రేషన్ కార్డుల అసలు లబ్ధిదారులను గుర్తించడంపై తన సిఫారసులను తెలియజేశారు.
కీవర్డ్ సెర్చ్ ద్వారా, ఈటీవీ తెలంగాణ ప్రసారం చేసిన శాసన మండలి సమావేశాల పూర్తి వీడియోను గుర్తించాం.
వీడియోలో ప్రశ్నోత్తర సమయంలో మండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి రేషన్ కార్డుల పంపిణీ గురించి మాట్లాడుతూ.. "ఇప్పటికే 2.81 కోట్ల లబ్ధిదారులు ఉన్నారని మంత్రి చెప్పారు. అదనంగా 40 లక్షల మందిని జోడించబోతున్నారు. అంటే 3.2 కోట్ల మందికి పైగా. తెలంగాణ జనాభాలో 80 శాతం పేదలేనా?" అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ.."కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాల కోసం నేను నా సూచనలను పంపాను. దేశం యొక్క BPL శాతం ఎంత? 27 శాతం అని విన్నాను. గణాంకాల ప్రకారం.. తలసరి ఆదాయం 3.7 లక్షలు. తెలంగాణలో పేదరికం ఎక్కడుంది? బియ్యం అంతా ఎక్కడికి పోతోంది? కాకినాడ పోర్టుకు వెళుతుందా (వ్యంగ్య వ్యాఖ్య)? దేశం, తెలంగాణ కోసం BPL డేటాను సరిపోల్చండి. నిజంగా రేషన్ కార్డులు అవసరమైన వారిని గుర్తించమని నేను మీకు సూచిస్తున్నాను. మార్గదర్శకాలను సిద్ధం చేసేటప్పుడు ఇవన్నీ పరిగణించండి." అని అన్నారు. ఈ వ్యాఖ్యలను 41:30 నుండి 42:30 నిమిషాల వరకు మనం చూడవచ్చు.
వీడియోలో గుత్తా వ్యాఖ్యలు.. రేషన్ కార్డుల అసలు లబ్ధిదారులను గుర్తించేందుకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలన్న సిఫారసుల కోణంలో ఉన్నాయి.
పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నవ్వుతూ.. "మండలి రేషన్ కార్డుల సంఖ్య తగ్గించాలని నిర్ణయిస్తే.. దాన్ని కూడా చేస్తాం" అని వ్యాఖ్యానించారు. దీనికి గుత్తా స్పందిస్తూ: "లేదు, లేదు. నేను రేషన్ కార్డుల సంఖ్య తగ్గించమని చెప్పడం లేదు. సరైన గణాంకాలు ఉండాలి.. ప్రజల పట్ల మేము బాధ్యతగా ఉండాలి," అని స్పష్టం చేశారు.
కాబట్టి, తెలంగాణలో పేదలు లేరని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నట్లు వైరల్ అవుతున్న వాదన అవాస్తవం.