Fact Check : మతం మారనందుకు బంగ్లాదేశ్‌లో హిందూ టీచర్ మేడలో చెప్పుల దండ వేశారా? నిజం ఇక్కడ తెలుసుకోండి
ఒక వ్యక్తి మెడలో చెప్పుల దండతో కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon
Claim:బంగ్లాదేశ్ హిందూ టీచర్ మతం మారనందుకు మెడలో చెప్పుల దండ వేశారు.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. వీడియోలో ఉన్నది దైవదూషణ చేశారని ఆరోపిస్తూ బంగ్లాదేశీ ముస్లిం వైద్యుడిపై జరిగిన దాడి.
Hyderabad: బంగ్లాదేశ్ కు చెందిన ఒక హిందువు ఇస్లాం మతంలోకి మారనందుకు మెడలో చెప్పుల దండ వేశారు అనే క్లెయిమ్‌లతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి చెప్పుల దండను మెడలో వేసుకున్నట్లు చూడవచ్చు, ఆయన చుట్టూ టోపీలు ధరించిన మనుషులు కనిపిస్తున్నారు.
ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ క్యాప్షన్‌లో ఇలా రాశారు, "బాంగ్లాదేశ్ లో ఈయన ఒక స్కూల్ టీచర్, ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా హిందువు నుంచి ముస్లిం కన్వెర్ట్ అవుతలేడు. అందుకే madarsa లో సదువుకునే సైంటిస్టులు ఈ శిక్ష విధించారు..." (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టులను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2, ఆర్కైవ్ 3)
ఇదే వైరల్ వీడియోని Xలో షేర్ చేస్తూ ఇలా రాశారు, "చాలా బాధాకరం... బంగ్లాదేశ్‌లో 40 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత, పదవీ విరమణ చేసిన రోజున జిహాదీలు ఒక హిందూ ఉపాధ్యాయుడికి అలాంటి వీడ్కోలు ఇచ్చారు." (హిందీ నుండి అనువదించబడింది)(ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. దైవదూషణ చేశారు అనే ఆరోపణల మూలంగా జూన్ 15న బంగ్లాదేశీ ముస్లిం డాక్టర్ అహ్మద్ అలీపై దాడి చేసి చెప్పుల దండ వేయడం వైరల్ వీడియోలో కనిపిస్తుంది.
వీడియో కీ ఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వైరల్ వీడియోని చూపిస్తున్న X పోస్ట్ దొరికింది. ఈ వీడియోని జూన్ 25న పోస్ట్ చేశారు. (ఆర్కైవ్)
Dr. Ahmad Ali was humiliated by radicals in Bangladesh because he's an atheist and was against child marriage. He quoted some verses from Quran and they considered it blasphemy. pic.twitter.com/1siyKhGPxE
— Matakti aankhein (@prettymoon_23) June 25, 2025
పోస్టు క్యాప్షన్‌లో ఇలా రాశారు, "బంగ్లాదేశ్‌లో డాక్టర్ అహ్మద్ అలీ నాస్తికుడు, బాల్య వివాహాలకు వ్యతిరేకం కాబట్టి ఆయనను రాడికల్స్ అవమానించారు. ఆయన ఖురాన్ నుండి కొన్ని వచనాలను చెప్పారు, దానిని వారు దైవదూషణగా భావించారు."
ఈ లీడ్ అనుసరించి కీ వర్డ్ సెర్చ్ చేయగా, వీడియో స్క్రీంషాట్ ఉపయోగించి బంగ్లాదేశ్ వార్తాపత్రిక కలెర్‌కాంతో జూన్ 15న ప్రచురించిన వార్తా నివేదిక దొరికింది. 'రాజ్‌బరిలో వైద్యునిపై స్థానికులు దాడి, చెప్పుల దండ వేశారు' అనే టైటిల్‌తో ఈ నివేదికను ప్రచురించారు. (ఆర్కైవ్)
ఈ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్‌లోని రాజ్‌బరి జిల్లాలోని బాలకండి పట్టణంలో, స్థానికులు ముహమ్మద్ ప్రవక్తను అవమానించినందుకు అహ్మద్ అలీ అనే వైద్యుడిపై దాడి చేసి, తరువాత చెప్పుల దండ వేశారు.
ఈ ఘటన జూన్ 15న జరిగింది. అహ్మద్ అలీ నవాబీపూర్ యూనియన్ హెల్త్ కాంప్లెక్స్‌లో పనిచేస్తుండేవారు.
ఇదే ఘటనపై ఢాకా టైమ్స్ అదే రోజున ప్రచురించిన వార్త నివేదిక ప్రకారం, ఈ ఘటన మధ్యాహ్నం సమయంలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, అహ్మద్ అలీని రక్షించారు. (ఆర్కైవ్)
బాలియాకండి పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్-చార్జ్ జమాల్ ఉద్దీన్ ని ఊటంకిస్తూ ఇలా రాసారు, "ఉదయం బెరులి బజార్‌లోని ఒక టీ దుకాణంలో అహ్మద్ అలీ ప్రవక్త ముహమ్మద్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడని స్థానికులు ఆరోపించారు. ఈ సమాచారం వ్యాపించడంతో ఒక గుంపు మధ్యాహ్నం అతన్ని అదుపులోకి తీసుకుని దాడికి పాల్పడ్డారు."
వైరల్ వీడియోలో కనిపిస్తున్నది దైవదూషణ చేశారని ఆరోపిస్తూ బంగ్లాదేశీ ముస్లిం వైద్యుడిపై జరిగిన దాడి. కాబట్టి వైరల్ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.