హైదరాబాద్: హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) అనే శ్వాసకోశ వ్యాధి, కోవిడ్-19 లాంటి లక్షణాలతో కనిపిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఇండియా సహా పలు దేశాలు ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. HMPV సంబంధిత శ్వాసకోశ వ్యాధులు చైనాలో ఎప్పుడూ మారే కాలానుగుణ వైరస్‌ల వంటి ఇన్ఫ్లుయెంజా, RSV, HMPV రావడం సర్వసాధారణం.
ఇండియాలో ఇటీవల బెంగళూరులో HMPV బారిన పడిన రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి 3 నెలల పసిపాప (ఇప్పటికే డిశ్చార్జ్ అయింది), మరొకటి 8 నెలల పాప (ప్రస్తుతం కోలుకుంటోంది). వీరికి అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేదు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలో, కొందరు నెటిజన్లు హాజ్మట్ సూట్స్‌లో ఉన్న వ్యక్తులు ప్రజలను బలవంతంగా లాక్కెళ్తున్న వీడియోను షేర్ చేస్తున్నారు.
ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను “చైనాలో మరో మిస్టరీ వైరస్ కలకలం..!” అని క్యాప్షన్‌తో షేర్ చేశాడు. వీడియో క్లిప్‌పై ఉన్న టెక్ట్స్ ప్రకారం, ‘చైనాలో పిట్టల్లా రాలిపోతున్నారు జనం’, దీని కారణం ప్రస్తుతం జరుగుతున్న HMPV కేసులు అని ప్రచారం చేస్తున్నారు.
మరో పోస్ట్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ ఈ దావా తప్పు అని నిర్ధారించింది. ఈ వీడియో పాతది.
వీడియో కీఫ్రేమ్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, యాహూ న్యూస్‌లో ‘చైనాలో క్వారంటైన్ శిబిరానికి మహిళను లాకెళ్తున్న దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి.’ (ఆంగ్లం నుండి తెలుగు అనువాదం) అనే శీర్షికతో 2022 నవంబర్ 4న ప్రచురించిన కథనం కనిపించింది.
ఈ కథనంలో వీడియో కు సంబంధించిన దృశ్యాలను X (మునుపటి ట్విట్టర్)లో 2022 అక్టోబర్ 22న షేర్ చేసిన పోస్టు లింక్‌తో సహా పేర్కొన్నారు. ఆ పోస్ట్‌లో, “జిన్‌పింగ్ పరిపాలనలో ప్రతి రాత్రి వేలాదిమందిని కోవిడ్ క్వారంటైన్ శిబిరాలకు బలవంతంగా లాక్కెళ్తున్నారు” అని రాసి ఉంది.
ఇంకా కీవర్డ్ సెర్చ్ ద్వారా, ఈ వీడియో గురించి 2022 నవంబర్ 2న మిర్రర్, నవంబర్ 3న నెక్స్ట్ షార్క్, నవంబర్ 2న డైలీ స్టార్ ప్రచురించిన కథనాలు లభించాయి. ఈ కథనాల్లో వీడియో స్క్రీన్‌గ్రాబ్స్ వైరల్ క్లిప్‌తో సరిపోతున్నాయి.
కోవిడ్-19 వ్యాప్తిని చైనా ఎలా నిర్వహించింది BBC, అల్ అరేబియా ఇంగ్లీష్ నివేదికల ప్రకారం, చైనా 2022 డిసెంబర్ వరకు ‘జీరో-కోవిడ్ పాలసీ’ కఠినంగా అమలు చేసింది. దీని పరిధిలో విస్తృత పరీక్షలు, లాక్‌డౌన్‌లు, పెద్ద ఐసోలేషన్ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలలో కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు లేదా పాజిటివ్ కేసుల కాంటాక్ట్‌లను ఉంచేవారు.
2022 అక్టోబర్, నవంబర్ నెలల్లో చైనాలో కోవిడ్ కేసులు పెరగడంతో, ఈ శిబిరాల పై ఆధారపడటం మరింత పెరిగింది. ప్రజలను బలవంతంగా శిబిరాలకు తరలిస్తున్న వీడియోలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి.
2022 నవంబర్‌లో ప్రజా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దీనితో, డిసెంబర్ 2022లో చైనా తన కఠిన పాలసీలను సడలించింది.
న్యూస్‌మీటర్ ఈ వీడియో యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినప్పటికీ, చైనా జీరో-కోవిడ్ పాలసీ సమయంలో ఇలాంటివి పలు ప్రాంతాల్లో జరిగినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది ప్రస్తుతం జరుగుతున్న 2025 HMPV కేసులకు సంబంధం లేదు.
కాబట్టి, ఈ దావా తప్పు.