ఆంధ్రప్రదేశ్‌లో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి,వివిధ పార్టీలు తమకే ఓటు వేయాలని ప్రజలను మభ్యపెట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో,‘జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఉండవు’ అని 'నష్టపోయేది అమాయకపు పేద ప్రజలే' అని లోక్‌సత్తా పార్టీ అధినేత డా. జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించినట్టు చెప్తున్న ఓ వార్తా కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఒకవేళ వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోతే తర్వాత వచ్చే ప్రభుత్వం పథకాలు అనేవి ఇవ్వదని ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడు సీఎం అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆచరించిన పథకాలు ఏవి ఉండవని ఇప్పుడు కొనసాగుతున్న పథకాలు చంద్రబాబు అయితే అసలు ఇవ్వడని" ఆ వార్తా కథనంలో పేర్కొంది.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
నిజ నిర్ధారణ:
జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఉండవు’ అని లోక్‌సత్తా పార్టీ అధినేత డా. జయప్రకాశ్ నారాయణ అన్నట్లు వచ్చిన కథనం అవాస్తవమని న్యూస్‌మీటర్ కనుగొంది.‘దాదాపుగా 2 లక్షల కోట్లు (Direct Benefit Transfer) రూపంలో పేదలకు ఇచ్చాం అంటున్న జగన్ ఓడిపోతే మళ్ళీ అవే పథకాలు కొనసాగించేంత పిచ్చివారు కాదు చంద్రబాబు‘ అని చెప్పే క్రమంలో జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఉండవు అని జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించినట్టు ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్త కథనం పేర్కొంది. నిజానికి జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేయలేదు.
మేము దీనికి సంబంధించి వార్తా నివేదికలు మరియు యూట్యూబ్‌లో అతని ఇంటర్వ్యూల కోసం వెతికాము, కాని మాకు ఏమీ దొరకలేదు.
జయ ప్రకాష్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేయడం గురించి ధృవీకరణ పొందడానికి, మేము అతను జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫ్రమ్స్ ను సంప్రదించగా ఈ వ్యాఖ్యలు జయప్రకాశ్ నారాయణ చేయలేదని. ఈ వ్యాఖ్యలు తాను చేసినట్లు వస్తున్న వార్తలను జయప్రకాశ్ నారాయణ ఖండించినట్టు స్పష్టం చేసారు.
దీంతో, వైరల్ వార్తా కథనంలో పేర్కొన్న విధంగా జయప్రకాశ్ నారాయణ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని అని స్పష్టమవుతుంది.
జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాఖ్యలు చేసినట్టు Way2News రిపోర్ట్ చేసినట్టు వారి న్యూస్ టెంప్లేట్‌లో ఒక క్లిప్‌ను కూడా షేర్ చేస్తున్నారు. నిజానికి Way2News సంస్థ ఈ వార్తను ప్రచురించలేదు. సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న క్లిప్ కూడా ఫేక్.
నిజంగా జయ ప్రకాష్ నారాయణ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే తప్పకుండా దాని పై వార్తాకథనాలు వచ్చేవి.
అందుకే ‘జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఉండవు’ అని 'నష్టపోయేది అమాయకపు పేద ప్రజలే' అని లోక్‌సత్తా పార్టీ అధినేత డా. జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యనిచలేదని మేము నిర్ధారించాము.