Fact Check: దుకాణాలు, హోటళ్లలో ఇండియన్ ఆర్మీ ‘సేన జల్’ తాగునీరు? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి
దుకాణాలు, హోటళ్లలో ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA) ప్రవేశపెట్టిన ‘సేన జల్’ తాగునీరు మార్కెట్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయని వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్టులు.
By - K Sherly Sharon |
Claim:దుకాణాలు, హోటళ్లలో ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA) ప్రవేశపెట్టిన ‘సేన జల్’ తాగునీరు మార్కెట్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.
Fact:ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తుంది. 'సేన జల్' తాగునీరు బాటిల్స్ సాధారణ ప్రజలు మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో లేవు.
Hyderabad: ఇండియన్ ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రవేశపెట్టిన 'సేన జల్' అనే తాగునీటిని కొనుగోలు చేసి, విదేశీ కంపెనీల ద్వారా భారతదేశం నుండి డబ్బు బయటికి వెళ్లకుండా అడ్డుకోవాలని పేర్కొంటున్న సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది.
ఈ పోస్టులో 'సేన జల్' బాటిల్స్ ఫోటోని షేర్ చేశారు. ఈ 'సేన జల్' తాగునీటి బాటిల్స్ దాదాపు ప్రతిచోటా అందుబాటులో ఉన్నాయని, వాటి అమ్మకం ద్వారా వచ్చే లాభం ఆర్మీ వెల్ఫేర్ కమిటీకి వెళుతుంది క్లెయిమ్ చేస్తున్నారు.
భారత సైనిక సిబ్బంది నుండి ఒక చిన్న అభ్యర్థనగా పేర్కొంటూ, ఈ విషయాన్ని విస్తృతంగా వాట్సాప్ గ్రూప్‌లో పంచుకోవాలని పేర్కొన్నారు.
ఈ ఫేస్‌బుక్ పోస్టు క్యాప్షన్‌లో ఇలా రాశారు:
చిన్న అభ్యర్థన: దయచేసి ఈ సందేశాన్ని మీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయండి.., ఎందుకంటే ఇది మన సైన్యానికి సహాయం చేయడానికి చేసిన చిన్న ప్రయత్నం..బిస్లరీ మరియు అక్వాఫినా వంటి తాగునీటి కంపెనీలు విదేశీ కంపెనీల యాజమాన్యంలో ఉన్నాయి. మనం డబ్బు చెల్లించి ఈ తాగునీటిని కొనుగోలు చేస్తే... ఆ డబ్బు భారతదేశం నుండి విదేశాలకు వెళుతుంది. భారత సైనిక సిబ్బంది నుండి ఒక చిన్న అభ్యర్థన:... ప్రయాణిస్తున్నప్పుడు లేదా దుకాణాలకు లేదా హోటళ్లకు వెళ్ళేటప్పుడు, " సేన జల్ (ఆర్మీ డ్రింకింగ్ వాటర్)" కోసం అడగండి... ఈ సేన జల్ (ఆర్మీ వాటర్) దాదాపు ప్రతిచోటా (బల్క్‌లో కూడా) అందుబాటులో ఉంది. భారత సైన్యం యొక్క ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేన జల్*ను ప్రవేశపెట్టింది. దీనిని దివంగత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ భార్య మధులికా రావత్ ప్రారంభించారు... సగం లీటరు మరియు ఒక లీటరు బాటిళ్లలో లభిస్తుంది. అర లీటరు ధర రూ.6/- ఒక లీటరు రూ.10/- మాత్రమే. ఇతర కంపెనీలు లీటరుకు ₹.20/-కి తాగునీటిని విక్రయిస్తాయి! *సేన జల్ అమ్మకం ద్వారా వచ్చే లాభం ఆర్మీ వెల్ఫేర్ కమిటీకి వెళుతుంది. ఈ డబ్బును అమరవీరుల కుటుంబాలు మరియు వారి పిల్లల విద్య కోసం ఉపయోగిస్తారు!
ఈ పోస్టు ఆర్కైవ్ ఇక్కడ చూడవచ్చు.
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించేలా ఉందని గుర్తించింది. ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2017 అక్టోబర్‌లో ఢిల్లీలోని కాంట్‌లో ‘సేనా జల్ ప్రాజెక్ట్’ను ప్రారంభించినా, సాధారణ ప్రజలు మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో లేవు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, వైరల్ పోస్టులో ఉన్న ఫోటోని షేర్ చేసిన ANI X పోస్ట్ దొరికింది. ఈ పోస్ట్ జనవరి 20, 2018లో షేర్ చేయబడింది. క్యాప్షన్‌లో, "సేనా జల్ అనేది ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA) కార్యక్రమం. ఈ సీసాలు ఒక్కొక్కటి ₹6కు అమ్ముతున్నారు; సేకరించిన డబ్బు సైనికులు, యుద్ధంలో మృతులైన సైనికుల భార్యల సంక్షేమానికి ఉపయోగించబడుతుంది" అని రాశారు.
Sena Jal, an initiative of the Army Wives Welfare Association (AWWA), bottles being sold at Rs 6 each; the money collected will be used in the welfare of soldiers & war widows pic.twitter.com/8YmbHYk1xO
— ANI (@ANI) January 20, 2018
వైరల్ పోస్టులో ఉన్న ఫోటోని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ అదే రోజున ప్రచురించిన ఒక కథనంలో కనుగొన్నాం. ఈ కథనం ప్రకారం ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA) చేపట్టిన సేనా జల్ కార్యక్రమంలో నీటి సీసాలు కేవలం ₹6కే విక్రయిస్తున్నారు. ఈ సేనా జల్ నీటి సీసాలను AWWA స్వయంగా తయారు చేస్తోంది. ఇది 2017 అక్టోబర్ 11న ప్రారంభమైంది.
ఈ ప్రాజెక్ట్ గురించి AWWA వెబ్సైటులో కూడా ప్రస్తావిస్తూ ఇలా రాశారు "సేనా జల్ ప్రాజెక్ట్‌ను AWWA అధ్యక్షురాలు 2017 అక్టోబర్ 11న ఢిల్లీ కాంట్‌లో ప్రారంభించారు. సేనా జల్ డిమాండ్‌ను తీర్చేందుకు ప్లాంట్‌ను అప్‌గ్రేడ్ చేశారు, 20 లీటర్ల జార్‌ను కూడా ప్రవేశపెట్టారు. 2018 అక్టోబర్‌లో పెట్ బ్లోయింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేసి, సేనా జల్ బాటిళ్లను ఇన్‌హౌస్‌లోనే తయారు చేయడం ప్రారంభించారు. దీంతో నీటి సీసాల ధరలు మరింత తగ్గాయి. 250 మి.లీ. సీసా ధర ₹5/- కాగా, 500 మి.లీ. సీసా ధర ₹7/-గా ఉంది."
న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, AWWA ప్రతినిధి ఈ సీసాలు సాధారణ ప్రజలు మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో లేవని తెలిపారు. అలాగే, సేనా జల్ నీటి సీసాలు అధికారిక సమావేశాల్లో మాత్రమే ఉపయోగిస్తారని, ఇవి వాణిజ్య విక్రయానికి అందుబాటులో ఉండవని కూడా చెప్పారు.
కాబట్టి న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్‌లు తప్పు దారి పట్టించే విధంగా ఉన్నాయని నిర్ధారించింది.