హిందుస్థాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెన్సిల్స్ ప్యాకేజింగ్ కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఆఫర్ చేస్తున్న మెసేజ్ అనేక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతోంది.
ఆసక్తి ఉన్నవారికి ప్యాకేజింగ్ (నటరాజ్ & అప్సర) పెన్సిల్స్ పార్ట్-టైమ్ ఉద్యోగం అందుబాటులో ఉందని మెసేజ్ పేర్కొంది.నెలకు రూ.30,000/- జీతం మరియు రూ. 15,000/- అడ్వాన్స్‌తో ఇంటి నుండి పని చేయవచ్చు.మెసేజ్‌లో ఉద్యోగంలో చేరడానికి సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ కూడా ఉంది, ఇది ఒక పోస్ట్‌కి మరొక పోస్ట్‌కు భిన్నంగా ఉంటుంది.
కొన్ని మెసేజ్‌లలో వారు మెసేజ్‌పై ప్రజలను ఆకర్షించడానికి మరియు నమ్మకం కలిగించడానికి అమ్మాయిల మరియు యూట్యూబర్‌ల ఫోటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
న్యూస్‌మీటర్ ఈ దావా నకిలీదని మరియు అమాయక ప్రజలను ఆకర్షించే స్కామ్‌గా గుర్తించింది.మేము కీవర్డ్ శోధనను నిర్వహించినప్పుడు, ఆ మెసేజ్ నకిలీదని రుజువు చేసే అనేక ఫలితాలను మేము కనుగొన్నాము.
ముందుగా, హిందూస్తాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో చేసిన క్లెయిమ్‌లను ఖండించే వీడియోను [ వీడియో లింక్ ] మేము కనుగొన్నాము. హిందూస్తాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాంటి ఉద్యోగాలేవీ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల బారిన పడవద్దని, లేకుంటే దాని వల్ల రహస్య డేటా మరియు డబ్బును కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మేము మరింత శోధించినప్పుడు, మాకు X (ట్విట్టర్) లో కమీషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట ద్వారా ఒక పోస్ట్ కనిపించింది. ఇందులో హిందూస్థాన్ పెన్సిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న పెన్సిల్ ప్యాకేజింగ్ ఉద్యోగాలు అంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్‌లలో వైరల్ అవుతున్న మెసేజ్ పూర్తిగా మోసం అని వారు స్పష్టంగా పేర్కొన్నారు. ఫేక్ మెసేజ్‌లు వ్యాప్తి చెందుతున్నాయని వారు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
అందువల్ల, ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో ఫార్వార్డ్ చేయబడి పోస్ట్ చేయబడే మెసేజ్‌లు పూర్తిగా నకిలీవని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.