Fact Check: పాక్ క్షిపణులను గాల్లోనే పేలుస్తున్న భారత్? లేదు, ఇజ్రాయెల్‌లో ఐరన్ డోమ్‌ పాత వీడియో

జమ్మూలో ఒక్క పాకిస్తాన్ క్షిపణి కూడా పడకుండా రక్షిస్తున్న భారత వాయు రక్షణా వ్యవస్థను చూపిస్తోంది అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By K Sherly Sharon
Published on : 9 May 2025 12:48 PM IST

Fact Check: పాక్ క్షిపణులను గాల్లోనే పేలుస్తున్న భారత్? లేదు, ఇజ్రాయెల్‌లో ఐరన్ డోమ్‌ పాత వీడియో
Claim:పాక్ క్షిపణులను గాల్లోనే పేలుస్తున్న భారత వాయు రక్షణా వ్యవస్థను చూపిస్తున్న వీడియో.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఇజ్రాయెల్‌లో ఐరన్ డోమ్‌ క్షిపణులను పేలుస్తున్న, ఆగస్టు 4, 2024 నాటి వీడియో ఇది. భారత వాయు రక్షణా వ్యవస్థను చూపించడం లేదు.

Hyderabad: పాకిస్తాన్ క్షిపణుల నుండి దేశాన్ని రక్షిస్తున్న భారత దేశ వాయు రక్షణ వ్యవస్థను చూపిస్తుంది అనే క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. మే 7 భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై చేప్పట్టిన 'ఆపరేషన్ సింధూర్' అనంతరం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో రాత్రి సమయంలో దాడికి పాల్పడుతున్న క్షిపణులను అడ్డగించడాన్ని చూడవచ్చు. ఈ వీడియోని, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికారిక X ఖాతాలో షేర్ చేశారు. పోస్టు క్యాప్షన్‌లో, "మన దేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను చూడండి! ఒక పాకిస్తాన్ క్షిపణి కూడా జమ్మూ మీద పడకుండా మన ఎయిర్ డిఫెన్స్ రక్షిస్తోంది! ఇది భారత్ శక్తి… ఇది భారత సైన్యం!" అని రాశారు. (ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఇది ఆగస్టు 4, 2024న కిర్యాట్ ష్మోనాలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ క్షిపణులను అడ్డగిస్తున్న వీడియో. వీడియోకి భారత వైమానిక రక్షణ వ్యవస్థకు సంబంధం లేదు.

వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆగష్టు 4న, 2024 పలు సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయబడినట్లు గమనించాం.

దక్షిణ ఫ్లోరిడాలో వార్తా సంస్థ UHN Plus X అకౌంట్ వైరల్ వీడియోని ఆగష్టు 4న, 2024 షేర్ చేసి "హిజ్బుల్లా కనీసం 50-60 క్షిపణులను ప్రయోగించిన తర్వాత ఉత్తర ఇజ్రాయెల్‌లోని కిర్యాట్ ష్మోనాపై అడ్డగింపబడ్డాయి," అని పేర్కొంది. (స్పానిష్ నుండి అనువదించబడింది)

@izzetmuratguler అనే X వినియోగదారు కూడా వైరల్ వీడియోని అదే రోజు షేర్ చేశారు. క్యాప్షన్‌లో... "ఈ రాత్రి మళ్ళీ మా తలలపై నుండి వెళ్లిన క్షిపణులు. ఉత్తర ఇజ్రాయెల్‌లోని కిర్యాట్ ష్మోనా నగరంపై హిజ్బుల్లా 50 కి పైగా రాకెట్లను ప్రయోగించింది. ఎవరైనా మరణించినట్లు లేక గాయ పడినట్లు సమాచారం ఇంకా రాలేదు. పూర్తిగా ఇజ్రాయెల్ సాంకేతికతతో ఉత్పత్తి చేయబడిన ఐరన్ డోమ్‌, ట్జ్-3 వైమానిక రక్షణ వ్యవస్థ లేకుంటే, వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా వందలాది మంది ఇప్పుడు చనిపోయి ఉండేవారు..." (ట్రూకిష్ నుండి అనువదించబడింది)

వైరల్ వీడియోలో ఉన్నది ఇజ్రాయెల్‌లో కిర్యాట్ ష్మోనాపై జరిగిన క్షిపణుల దాడి అని ధ్రువీకరిస్తూ Independent Turkish ప్రధాన సంపాదకుడు @nevzatcicek అకౌంట్లో ఆగష్టు 4న 2024లో షేర్ చేయబడిన పోస్టు కనుగొన్నాం. "ఇజ్రాయెల్ మీడియా: కిర్యాట్ ష్మోనా, ఐమెక్ హోలా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని లెబనాన్ నుండి 50 కి పైగా క్షిపణులను ప్రయోగించారు," అని క్యాప్షన్‌లో రాసి వైరల్ వీడియోని షేర్ చేశారు.

Times of Israel ఆగష్టు 4న 2024లో "ఉత్తరాన లెబనాన్ నుండి క్షిపణుల దాడి; చాలా వాటిని ఐరన్ డోమ్ అడ్డగించింది" అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో కూడా వైరల్ వీడియో ఉన్న ఒక X పోస్టును అనుసంధానించారు.

వైరల్ వీడియోలో ఉన్నది ఇజ్రాయెల్‌లో కిర్యాట్ ష్మోనాపై ఆగష్టు 4న, 2024లో జరిగిన క్షిపణుల దాడిని ఆ దేశ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ అడ్డగిస్తున్న ఘటన అని తేలింది.

ఈ వీడియో భారత్ వాయు రక్షణ వ్యవస్థను చూపించడం లేదు. కాబట్టి, న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది.

Claim Review:పాక్ క్షిపణులను గాల్లోనే పేలుస్తున్న భారత వాయు రక్షణా వ్యవస్థను చూపిస్తున్న వీడియో.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఇజ్రాయెల్‌లో ఐరన్ డోమ్‌ క్షిపణులను పేలుస్తున్న, ఆగస్టు 4, 2024 నాటి వీడియో ఇది. భారత వాయు రక్షణా వ్యవస్థను చూపించడం లేదు.
Next Story