Fact Check: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మీద మరో సారి ఇరాన్ మిస్సైల్ దాడి, మంటల్లో ఎయిర్పోర్ట్? కాదు, ఇది 2020 వీడియో
ఇరాన్ దాడుల తర్వాత దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంటలు చెలరేగాయి అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By - M Ramesh Naik |
Claim:ఇరాన్ దాడుల వల్ల దుబాయ్ ఎయిర్పోర్ట్లో మంటలు చెలరేగిన దృశ్యాలే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.
Fact:తప్పు. ఈ వీడియో 2020లో యుఏఈలోని అజ్మాన్లో జరిగిన మార్కెట్ అగ్ని ప్రమాదానికి సంబంధించినది. దీనికి తాజా ఘటనలతో ఎలాంటి సంబంధం లేదు.
హైదరాబాద్: ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి జరిగిందని చెప్పుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మార్చి 16న దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలోని ఇంధన నిల్వ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగినట్లు వార్తలు వచ్చిన తరువాత ఈ వీడియో మరింతగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ఘటనలో ఒక ఇంధన ట్యాంక్ దెబ్బతిని మంటలు చెలరేగాయని, అయితే అధికారులు మంటల్ని అదుపు చేశారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో, ఒక వీడియోను షేర్ చేస్తూ, దుబాయ్ ఎయిర్పోర్ట్ మంటల్లో కూరుకుపోయిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
వైరల్ వీడియోలో ఒక భవనం భారీ మంటల్లో కాలి పోతుండగా, దట్టమైన పొగ ఆకాశంలోకి ఎగిసిపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను ఒక కారు నుంచి చిత్రీకరించినట్లు కనిపిస్తోంది.
ఒక X యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, “దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మీద మరో సారి ఇరాన్ మిస్సైల్ దాడులు..” అని పేర్కొన్నారు. (Archive)
ఇలాంటి పోస్టులు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఇక్కడ చూడొచ్చు.(Archive1, Archive2, Archive3, Archive4)
Fact Check
న్యూస్మీటర్ పరిశీలనలో ఈ క్లెయిమ్ తప్పు అని తేలింది. వైరల్ వీడియో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంకు సంబంధించినది కాదు. ఇది 2020లో అజ్మాన్లో జరిగిన అగ్ని ప్రమాదానికి చెందినది.
వీడియో పరిశీలన
వైరల్ వీడియోలోని కీ ఫ్రేమ్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఖచ్చితమైన ఫలితం దొరకలేదు. అయితే, 2020లో యుఏఈలోని అజ్మాన్లో జరిగిన మార్కెట్ అగ్ని ప్రమాదంపై పలు వార్తలు కనిపించాయి. వీడియోలోని దృశ్యాలు వాటికి సమానంగా ఉన్నప్పటికీ, అదే ఘటన అని నిర్ధారించడానికి మరింత పరిశీలన చేపట్టాం.
మొదట కీవర్డ్ సెర్చ్ చేయగా, 2020 ఆగస్టు 6న యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఒక వీడియో కనిపించింది. ఆ వీడియోలో అజ్మాన్లో జరిగిన మార్కెట్ అగ్ని ప్రమాదం దృశ్యాలు ఉన్నాయి.
ఆ వీడియోను వైరల్ వీడియోతో పోల్చి చూసినప్పుడు, రెండింటిలోనూ ఒకే విధమైన దృశ్యాలు కనిపించాయి. రెండు వీడియోల్లోనూ కారు నుంచి చిత్రీకరించిన దృశ్యాలు ఉండటం, భారీ మంటలు, అలాగే పక్కనే చిన్న గది వంటి నిర్మాణం, ఇంకా ముందుగా ఉన్న స్ట్రీట్ లైట్ ఒకే విధంగా కనిపించాయి.
ఘటన ఎక్కడ జరిగింది?
వైరల్ వీడియోను మరింతగా పరిశీలించగా, ఒక దిశా సూచిక బోర్డు కనిపించింది. దానిపై “School Complex”, “Government Buildings” అనే పదాలు చదవగలిగాం.
ఈ ఆధారాలతో గూగుల్ మ్యాప్స్లో పరిశీలించగా, ఆ ప్రదేశం యుఏఈలోని అజ్మాన్లోని షేఖ్ జాయెద్ స్ట్రీట్గా గుర్తించబడింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ లో కూడా అదే బోర్డు కనిపించింది.
అదే ప్రాంతంలో “SALEM SHOPPING CENTER” అనే మార్కెట్ ఉంది. వైరల్ వీడియోలో కూడా “SAL” అనే అక్షరాలు క్షణం పాటు కనిపించడం గమనించాం.
ఈ ఆధారాలన్నింటిని పరిశీలించగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్న అగ్ని ప్రమాదం 2020లో అజ్మాన్లో జరిగినదే అని నిర్ధారించాం.
దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగినట్లు వార్తలు ఉన్నప్పటికీ, ఈ పాత వీడియోను తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
కాబట్టి, ఈ క్లెయిమ్ తప్పు.