Hyderabad: ‘ద డైలీ షో’ సమర్పకుడు, కామెడియన్ జాన్ స్టీవర్ట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 50 శాతం సుంకం విధించినట్టు చేసిన ప్రకటనను విమర్శిస్తున్నారన్న క్లెయిమ్‌లతో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో జాన్ స్టీవర్ట్ ట్రంప్ మీద వ్యాఖ్యలు చేస్తూ ఇలా అన్నారు, "5,000 సంవత్సరాల చరిత్ర ఉన్న దేశాన్ని భయపెడుతుంది అనుకున్నాడేమో. ‘మేము బ్రిటిష్ పాలనను కూడా తట్టుకుని వచ్చాం, నీ లెక్కల్ని కూడా తట్టుకుంటాం’ అని భారత్ అన్నట్టుంది. అతను అక్కడినుండి కేకలు వేస్తూ ‘ఇకపై భారత్ నుంచి చీప్ వస్తువులు రావు’ అంటున్నాడు," అన్నట్లు చూడవచ్చు.
"ఇదిలా ఉంటే, అతని టై చైనా నుంచి వచ్చింది, అతని హోటల్ తువాలాలు ముంబై నుంచి వచ్చాయి, అతని జుట్టు కూడా ఎక్కడో వేరే చోట చేయించుకున్నదేమో. భారత్, దయచేసి ఈ వ్యక్తికి కొంచెం చాయ్, సమోసా పంపండి. తింటే, కాస్త సర్దుకుంటాడు, ఏ దేశాన్ని నడుపుతున్నాడో గుర్తు చేసుకుంటాడు,” అని జాన్ స్టీవర్ట్ మాట్లాడినట్లు చూడవచ్చు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. (ఆర్కైవ్)
ఇదే వీడియోలో వినిపిస్తున్న వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్టు షేర్ చేయబడింది. ఈ పోస్టులో "5000 సంవత్సరాల చరిత్ర కలిగిన, 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి నుండి బయటపడిన భారతదేశం మీ 50% సుంకాలను చూసి భయపడుతుందని మీరు నిజంగా అనుకుంటున్నారా? గుర్తుంచుకో, మీ గోల్ఫ్ ట్రిప్ ఖర్చు తో...... భారతదేశం చంద్రునిపైకి రాకెట్లను ప్రయోగిస్తోంది. ఇప్పుడు అమెరికన్ జర్నలిస్టులు కూడా భారతదేశానికి మద్దతు ఇస్తున్నారు మరియు ట్రంపు ఎగతాళి చేస్తున్నారు.. కానీ పేద పప్పు ఇప్పటికీ తన యజమానుల కోసం పనిచేస్తున్నాడు," అని రాసి ఉంది. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. భారత్‌పై 50 శాతం సుంకాలు విధించినందుకు అమెరికా అధ్యక్షుడిని జాన్ స్టీవర్ట్ ఎగతాళి చేస్తున్నట్లు చూపిస్తున్న ఆ వీడియో ఏఐ ద్వారా తయారుచేయబడింది.
కీవర్డ్ శోధనలు చేసి జాన్ స్టీవర్ట్ సుంకాలపై వ్యాఖ్యల గురించి ఏ విశ్వసనీయమైన వార్తా కథనాలు లేవని గుర్తించాం. అలాగే జాన్ స్టీవర్ట్ హోస్ట్ చేస్తున్న ‘ది డైలీ షో’ యూట్యూబ్ ఛానల్‌ను కూడా పరిశీలించాం, వైరల్ వీడియోని ఈ ఛానెల్‌లో పోస్ట్ చేయలేదు అని తేలింది.
జాన్ స్టీవర్ట్ చేసే 'ది డైలీ షో' జులై చివరి వారం నుండి విరామంలో ఉంది. సెప్టెంబర్ 8న తిరిగి ప్రసారం ప్రారంభం అవుతుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతానికి సుంకాలు పెంచుతున్నట్లు ఆగష్టు 6న ప్రకటించారు. అంటే సుంకాల గురించి ప్రకటన చేయక ముందు నుండే 'ది డైలీ షో' విరామంలో ఉంది. కొత్త ఎపిసోడ్స్ ఏవి ఈ సమయంలో చిత్రీకరించబడలేదు, కాబట్టి జాన్ స్టీవర్ట్ వైరల్ వీడియోలో ఉన్న వ్యాఖ్యలు చేయలేదు అని తేలింది.
వైరల్ వీడియోని కృత్రిమ మేధస్సుని (ఏఐ) ఉపయోగించి తయారు చేసారా అని తెలుసుకోవడానికి హియా డీప్‌ఫేక్ వాయిస్ డిటెక్టర్ ఉపయోగించాం. వైరల్ వీడియోలో నుండి ఒక ఆడియో శాంపిల్ ఉపయోగించగా ప్రామాణికత స్కోరు 100 కి 30 అని నిర్ధారించింది. అంటే ఆడియోని ఏఐ ఉపయోగించి రూపొందించారని తేలింది.
మరొక ఏఐ గుర్తింపు సాధనం, హైవ్ మోడరేషన్‌ను కూడా ఉపయోగించాం. ఇది వీడియో ఏఐని ఉపయోగించి రూపొందించబడి ఉండే అవకాశం 77 శాతానికి పైగా ఉందని నిర్ధారించింది.
కాబట్టి, న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది. వైరల్ అవుతున్నా వీడియో ఏఐ ద్వారా రూపొందించబడింది.