హైదరాబాద్: ఇటీవల టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై పెద్ద వివాదం రేగింది. ఆయన
జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆడియో క్లిప్ బయటకు రావడంతో, ఆగస్ట్ 17న అభిమానులు ఎమ్మెల్యే ఆఫీస్ ముందు నిరసన తెలిపారు.
ఈ నేపథ్యంలోనే, ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా “ఇది జూనియర్ ఎన్టీఆర్ స్పందన” అని ప్రచారం చేస్తున్నారు.
ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, “మనం మాట్లాడే మాట మన వ్యక్తిత్వాన్ని చెబుతుంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ అవన్నీ ప్రజా సమస్యల వరకు మాత్రమే పరిమితం కావాలి. మహిళలను గౌరవించడం మన సంస్కృతి, అది తరతరాలకు అందించాల్సిన సంప్రదాయం,” అని అన్నారు.
వైరల్ వీడియోలో ఎన్టీఆర్ ఫొటోతో పాటు ఎమ్మెల్యే ప్రసాద్ దగ్గుబాటి ఫొటోను కలిపి, “నిన్నటి ఘటన నన్ను కలిచివేసింది”అని కూడా చూపించారు.
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని గుర్తించింది. ఈ వీడియోకు తాజాగా జరిగిన వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది 2021 నాటిది.
వైరల్ వీడియో కీలక ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 2021 నవంబర్ 21న ప్రచురితమైన
ఇండియా హెరాల్డ్ రిపోర్ట్ దొరికింది. ఆ రిపోర్ట్ ప్రకారం, ఎన్టీఆర్ ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి పై చేసిన వ్యక్తిగత విమర్శలను ఖండించాడు.
అలాగే ది
న్యూస్ మినిట్ నవంబర్ 20, 2021న ప్రచురించిన కథనంలోనూ ఇదే విషయాన్ని పేర్కొంది. చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో కంటతడి పెట్టిన మరుసటి రోజే, ఎన్టీఆర్ వీడియో విడుదల చేసి, “రాజకీయాలు ప్రజా సమస్యల వరకు మాత్రమే పరిమితం కావాలి, వ్యక్తిగత స్థాయిలోకి వెళ్లకూడదు” అని చెప్పినట్లు రిపోర్ట్ తెలిపింది.
అదే రోజు (2021 నవంబర్ 20)
ఎన్టీఆర్ తన అధికారిక X అకౌంట్‌లో అసలు వీడియోను పోస్టు చేశాడు. అయితే ఇటీవల ప్రసాద్ దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ స్పందించాడన్న నమ్మదగిన రిపోర్టులు లేదా వీడియోలు ఎక్కడా లభించలేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ దగ్గుబాటి వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన కాదు. ఇది 2021లో ఆయన నారా భువనేశ్వరి పై జరిగిన వ్యక్తిగత దాడులను ఖండిస్తూ విడుదల చేసిన వీడియో. కాబట్టి ఈ క్లెయిమ్ తప్పు.