Fact Check: గోపీనాథ్ ను హత్య చేయించిన నవీన్ యాదవ్ ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ-పేపర్ క్లిప్పింగ్ నకిలీది
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్‌ను హత్య చేయించాడని, ఒక తెలుగు ఈ-పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By - M Ramesh Naik |
Claim:రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసు వెల్లడించిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ హత్యకు కారణమని ఈ ఈ-పేపర్ క్లిప్పింగ్ పేర్కొంటోంది.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. న్యూస్‌మీటర్ పరిశీలనలో వైరల్ ఈ-పేపర్ క్లిప్పింగ్ నకిలీదని, ఎలాంటి విశ్వసనీయ తెలుగు పత్రిక దీనిని ప్రచురించలేదని తేలింది.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ సోషల్ మీడియాలో ఒక తెలుగు ఈ-పేపర్ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. ఇది నిజమైన పత్రికలా కనిపిస్తూ, “గోపీనాథ్ ను హత్య చేయించిన నవీన్ యాదవ్?” అనే శీర్షికతో వచ్చింది.
క్లిప్పింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఫోటోతో పాటు భవనం లోపల సీసీటీవీ ఫుటేజ్ చిత్రాలు ఉన్నాయి. ఇందులో ‘వార్తలు వెలుగు’ అనే లోగోతో, తేదీగా 2025 నవంబర్ 10 సోమవారం, వెబ్‌లింక్‌గా https://epaper.varthalvelugu.com/cఅని ఉంది.
ఒక ఎక్స్ యూజర్ ఈ క్లిప్పింగ్‌ను కొన్ని అంశాలతో షేర్ చేశాడు.(Archive)
వైరల్ క్లిప్పింగ్‌లో, “మీడియా ముందు సంచలన నిజాలను బయటపెట్టిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు” అని రాసి ఉంది.
అదే క్లిప్పింగ్‌లో నవీన్ యాదవ్ గోపీనాథ్ హాస్పిటల్‌లో ఉన్న సమయంలో సీసీటీవీలో కనిపించాడని, ఆయన మరణానికి ముందే పటాకులు పేల్చాడని, ఆస్పత్రి సిబ్బందితో సంబంధాలు ఉన్నాయని, గోపీనాథ్ తల్లి ఆయనకు అభినందనలు తెలిపిందని వంటి సంచలనాత్మక వ్యాఖ్యలు ఉన్నాయి.
మగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అవసరమైంది. బీఆర్ఎస్ పార్టీ ఆయన భార్య మగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది.
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ పరిశీలనలో ఈ వీడియో తప్పు అని తేలింది. ఇది పూర్తిగా నకిలీదని తేలింది.
ప్రధాన తెలుగు పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, ప్రభాత వెలుగు వంటి పత్రికల ఈ-పేపర్ వెబ్‌సైట్లలో కీవర్డ్ సెర్చ్ చేయగా, నవీన్ యాదవ్ పేరు లేదా ఇంటెలిజెన్స్ పోలీసుల ప్రకటన ఎక్కడా కనిపించలేదు.
ప్రభాత వెలుగు ఈ-పేపర్ తేదీ అక్టోబర్ 10 పేజీలను పరిశీలించినప్పటికీ, ఈ వైరల్ క్లిప్పింగ్ అందులో లేదు.
వైరల్ క్లిప్పింగ్‌లో ఉపయోగించిన డిజైన్, ఫాంట్స్, లేఅవుట్ మొదలైనవి నిజమైన పత్రికలకు దగ్గరగా ఉన్నా, కొన్ని తేడాలు స్పష్టంగా కనిపించాయి:
- క్లిప్పింగ్‌లో ఇచ్చిన వెబ్‌లింక్ పనిచేయడం లేదు లేదా ఖాళీ పేజీగా తెరుచుకుంటోంది.
- ‘వార్తలు వెలుగు’ లోగో, లేఅవుట్ అసలు పత్రికకు భిన్నంగా ఉంది.
- వాక్యశైలి అతిశయంగా, సంచలనాత్మకంగా ఉంది – ఇది నిజమైన వార్తా టోన్ లేదు.
వైరల్ క్లిప్పింగ్‌లో చూపిన సీసీటీవీ ఫుటేజ్ ఇమేజ్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇది Shutterstock వెబ్‌సైట్‌లో ఉన్న 2023 డిసెంబర్ 9 నాటి స్టాక్ ఫుటేజ్ అని తేలింది.
ఆ వీడియో వివరణలో ఇలా ఉంది:“Busy hospital hallway: Diverse doctors, professional medics, nurses and patients walking. Male physician gets into elevator…”
అంటే ఇది హాస్పిటల్‌లో సాధారణ దృశ్యం మాత్రమే, ఎటువంటి నిజమైన సంఘటనతో సంబంధం లేదు.
ఇంకా, తెలంగాణ పోలీసులు లేదా ఇంటెలిజెన్స్ విభాగం గోపీనాథ్ మరణంపై ఎటువంటి ప్రకటన లేదా నవీన్ యాదవ్‌పై ఆరోపణలు చేయలేదు.
ఎన్నికల ముందు ఇలాంటి నకిలీ ఈ-పేపర్ క్లిప్పింగ్‌లు తరచుగా వైరల్ అవుతుంటాయి. కొన్ని వారాలుగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం సమయంలో కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రభాత వెలుగు పత్రికల లేఅవుట్‌లను అనుకరించి వేర్వేరు పార్టీల నేతలపై తప్పుడు కథనాలు సృష్టించి ప్రచారం చేశారు.
ఈ నకిలీ క్లిప్పింగ్‌లు సాధారణంగా నిజమైన పత్రిక టెంప్లేట్‌లను ఉపయోగించి, చిన్న మార్పులు - ఉదా: హెడ్‌లైన్ మార్చడం, కొత్త లోగో లేదా ‘మన’, ‘వార్తలు’ వంటి పదాలు జోడించడం, కట్టుకథలు రాయడం - ద్వారా నిజమైనట్లుగా చూపిస్తారు.
“గోపీనాథ్‌ను ఎవరు చంపారు – నవీన్ యాదవా?” అనే వైరల్ ఈ-పేపర్ క్లిప్పింగ్ నకిలీది.
ఏ విశ్వసనీయ మీడియా సంస్థా లేదా పోలీసు అధికార సంస్థా ఇలాంటి ఆరోపణలు చేయలేదు. కాబట్టి ఈ క్లిప్పింగ్‌లో చేసిన దావా తప్పు.
డిస్క్లెయిమర్: న్యూస్‌మీటర్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మగంటి గోపీనాథ్ మరణంపై నవీన్ యాదవ్ ప్రమేయాన్ని పరిశీలించడం లేదు. ఈ ఫ్యాక్ట్ చెక్ పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ-పేపర్ క్లిప్పింగ్ నిజానిజాలపై మాత్రమే కేంద్రీకరించబడింది.