Fact Check: కేటీఆర్ 'నా పాలిట విలన్..' అన్న కవిత? లేదు ఈ వార్త క్లిప్పింగ్ నకిలీది
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలనే పార్టీ కార్యక్రమాలకు తనను దూరంగా ఉంచుతున్నాడని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నట్లు ఆరోపించారని చూపిస్తున్న వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon
Claim:వార్తాపత్రిక క్లిప్పింగ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు చూపిస్తోంది.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. 'తెలంగాణ స్క్రైబ్' అనే వార్తా సంస్థ ఉనికిలో లేదు, దాని పేరుతో ప్రసారం అవుతున్న వార్తలు నకిలీవి.
Hyderabad: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చిట్ చాట్ సందర్భంలో మాజీ మంత్రి, పార్టీ కార్యనిర్వాహణధ్యక్షుడు, తన అన్న కేటీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపిస్తున్న ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కవిత, కేటీఆర్ చిత్రాలతో "మా అన్నే నా పాలిట విలన్..!" అనే శీర్షిక వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో కనిపిస్తుంది. కేటీఆర్‌ను ఉద్దేశించి కవిత మాట్లాడినట్లు క్లెయిమ్ చేస్తూ "కావాలనే పార్టీ కార్యక్రమాలకు నన్ను దూరంగా ఉంచుతున్నాడు. నాతో సన్నిహితంగా ఉండే నాయకులందరిని బెదిరిస్తున్నాడు. పార్టీని నడిపించడంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను పూర్తిగా విఫలమయ్యాడు.. బీఆర్ఎస్ పార్టీలో అడ్డుకుంటే జాగృతి సంస్థ నుండే నా పోరాటం కొనసాగిస్తా." అని రాశారు.
ఈ న్యూస్ క్లిప్పింగ్‌పై తేదీ మార్చి 25, 2025 అని, బైలైన్ ‘తెలంగాణ స్క్రైబ్ డిజిటల్’ అని కనిపిస్తుంది. బ్యానర్ మీద తెలంగాణ స్క్రైబ్ లోగో, తేదీ, X ఖాతాకు లింక్, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల లోగోలు ఉన్నాయి.
ఈ న్యూస్ క్లిప్పింగ్ ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ, "మా అన్నే నా పాలిట విలన్..! కేటీఆర్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు," అని రాశారు. (ఆర్కైవ్)
ఇదే క్లెయిమ్ చేస్తున్న పోస్టు ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. తెలంగాణ స్క్రైబ్ వార్తా సంస్థ ఉనికిలో లేదు, వైరల్ అవుతున్న వార్త క్లిప్పింగ్ నకిలీది.
ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు, తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్‌పై వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో కనిపిస్తున్న వ్యాఖ్యలు చేసారని చూపించే విశ్వసనీయ వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు ఏవి మాకు కనిపించలేదు.
వార్త క్లిప్పింగ్‌లో కనిపిస్తున్న చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, 2023 మార్చి 9న ప్రచురింపబడిన ETV Bharat కథనం దొరికింది.
'కవిత విచారణ కోసం ED ని ఇంటికి రమ్మన్నారు, కానీ ఏజెన్సీ ఢిల్లీ వైపే మొగ్గు చూపిస్తుంది’ అనే శీర్షికతో ప్రచురించారు. ఈ కథనంలో ఉపయోగించిన చిత్రం అదే రోజు జరిగిన మీడియా సమావేశంలో తీసినట్లు తెలుస్తోంది. వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో ఉపయోగించిన కవిత చిత్రాన్ని పరిశీలిస్తే, ఈ మీడియా సమావేశంలో వేసుకున్న దుస్తులే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి.
ఈ కథనంలో కేటీఆర్ పై కవిత ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు ప్రస్తావించలేదు.
బ్యానర్‌లోని లింక్ ద్వారా ‘im dharani’ అనే X ప్రొఫైల్ కనిపించింది. ఈ అకౌంట్లో చివరి పోస్ట్ ఫిబ్రవరి 2023లో చేసినట్లు తెలుస్తోంది. ‘తెలంగాణ స్క్రైబ్’కి సంబంధించిన పోస్ట్‌లు ఏవీ లేవు.
ఫేస్‌బుక్‌లో, Xలో 'తెలంగాణ స్క్రైబ్' సోషల్ మీడియా అకౌంట్స్ కోసం వెతకగా ఒక ప్రొఫైల్ దొరికింది. అయితే వైరల్ న్యూస్ క్లిప్పింగ్ గురించి ఈ ప్రొఫైల్‌లో ఎలాంటి పోస్టులు లేవు. ఈ ప్రొఫైల్‌లో ఉపయోగించిన లోగో కూడా వైరల్ న్యూస్ క్లిప్పింగ్ కి భిన్నంగా ఉన్నట్లు గుర్తించం. ఈ రెండు లోగోల పోలికలు క్రింద చూడవచ్చు.
Google, Bingలో వివిధ కీవర్డ్ సెర్చ్లను కూడా నిర్వహించాము, 'తెలంగాణ స్క్రైబ్ 'ఈ-పేపర్ లేదా దాని వెబ్సైట్ ఎక్కడా లేదని కనుగొన్నాం.
Whois ఉపయోగిస్తే telanganascribe, telanganascribedigital అనే డొమైన్లు కూడా ఇంకా నమోదు కాలేదని కనుగొన్నాం.
'తెలంగాణ స్క్రైబ్', 'తెలంగాణ స్క్రైబ్ డిజిటల్' వార్త పత్రికల రిజిస్ర్టేషన్ కోసం భారతదేశానికి సంబంధించిన వార్తాపత్రికల రిజిస్ట్రార్ కార్యాలయ వెబ్సైట్లో వెతికితే టైటిల్ లు నమోదు కాలేదని తేలింది.
అందువల్ల, 'తెలంగాణ స్క్రైబ్' పేరుతో ఈ-పేపర్ మనుగడలో లేదని, ఈ సంస్థకు చెందిన వార్తాపత్రిక క్లిప్పింగ్లు నకిలీవని నిర్ధారించాం.
ఈ క్లెయిమ్స్ పై న్యూస్‌మీటర్ ఎమ్మెల్సీ కవిత కార్యాలయాన్ని సంప్రదించినప్పుడు, వారు ఈ క్లెయిమ్స్ తోసిపుచ్చారు, కవిత ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, వైరల్ అవుతున్న వార్త క్లిప్పింగ్‌లు దురుద్దేశంతో చేస్తున్న ప్రచారం అని అన్నారు. ‘తెలంగాణ స్క్రైబ్’ ఉనికిలో లేదని, కవితకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఇంటర్నెట్‌లో ఇటువంటి నకిలీ వార్తల క్లిప్పింగ్‌లు తరచుగా కనిపిస్తున్నాయని కూడా వారు పేర్కొన్నారు.
లో ఇటువంటి నకిలీ వార్తల క్లిప్పింగ్‌లు తరచుగా కనిపిస్తున్నాయని కూడా వారు పేర్కొన్నారు.
గతంలో తెలంగాణ న్యూస్ టుడే డైలీ అనే మరో మీడియా సంస్థ పేరుతో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌ల ద్వారా చేసిన అనేక నకిలీ క్లెయిమ్‌లను న్యూస్‌మీటర్ పరిశీలించింది. ఈ వార్త సంస్థ కూడా ఉనికిలో లేదని, సంస్థ పేరు మీద వస్తున్న వార్త క్లిప్పింగ్‌లు కూడా నకిలీవి అని నిర్ధారించాం. ఆ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.
కాబట్టి, ‘తెలంగాణ స్క్రైబ్’ అనే వార్తా సంస్థ ఉనికిలో లేకపోవడమే కాకుండా, దాని పేరుతో ప్రసారం అవుతున్న వార్తలు కూడా నకిలీవని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.