హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత గురించి ఒక ఈ-పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్పింగ్ ప్రకారం, కవిత తన తీహార్ జైలులో ఉన్నప్పుడు ప్రజలు సానుభూతి చూపలేదని, తండ్రి (మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు - కేసీఆర్) లేదా సోదరుడు (కేటీఆర్) అరెస్టయినా ప్రజలు సానుభూతి చూపరని అన్నారు.
ఈ క్లిప్పింగ్‌లో ‘కాళేశ్వరం, యాదాద్రి థర్మల్ స్టేషన్ కేసులు’ గురించి ప్రస్తావన ఉంది. ఇదే కాకుండా, "బీఆర్‌ఎస్ పార్టీని నడిపించగల సామర్థ్యం నాకు మాత్రమే ఉంది" అని ఆమె చెప్పినట్లు పేర్కొంది.
ఈ క్లిప్పింగ్‌ను "మీడియాతో చిన్న చర్చలో" చెప్పిన మాటలుగా చూపించారు. క్లిప్పింగ్ కంటెంట్‌లో కల్వకుంట్ల కుటుంబం పట్ల తెలంగాణ ప్రజల అప్యాయత లేదని ఆరోపణలు ఉన్నాయి.
ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ క్లిప్పింగ్‌ను, “బీఆర్‌ఎస్ పార్టీని నడిపించగల సామర్థ్యం నాకే ఉంది...” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
ఇలాంటి మరో పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ లింక్)
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ వరల్ అవుతున్న దావా తప్పు అని గుర్తించింది. ఈ-పేపర్, అందులోని వార్త ఫేక్. ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ క్లిప్పింగ్‌లో హెడ్ లైన్, ముఖ్యాంశాలు, లోగో, తేదీ, ఆర్టికల్ లింక్ వంటి అంశాలు ఉన్నాయి. అయితే, ఆ లింక్‌పై క్లిక్ చేస్తే పని చేయని పేజీలకు వెళ్లాం. అంటే ఆ లింక్‌లు అసలే లేవు.
మేము గూగుల్, బింగ్‌లలో కీవర్డ్ సెర్చ్ చేయగా, ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే ఈ-పేపర్ లేదా వెబ్‌సైట్‌కు సంబంధించిన సమాచారం దొరకలేదు. డొమైన్ ‘telangananewstodaydaily’ కూడా నమోదు కాలేదని Whois సైట్ ద్వారా తెలిసింది.
దీనిపై ఇంకా స్పష్టత కోసం, భారత ప్రభుత్వం న్యూస్‌పేపర్ రిజిస్ట్రార్ వెబ్‌సైట్‌లో ‘తెలంగాణ న్యూస్ టుడే’, ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ పేర్లను వెతికాము. కానీ ఇలాంటి పేరు నమోదవ్వలేదు.
ఈ ఆధారాల ప్రకారం, ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే ఈ-పేపర్ అసలు లేదని, దాని క్లిప్పింగ్ పూర్తిగా ఫేక్ అని స్పష్టమవుతోంది.
అలాగే, ఎమ్మెల్సీ కవిత అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్, పబ్లిక్ స్టేట్‌మెంట్స్‌ను పరిశీలించగా, అలాంటి వ్యాఖ్యలు ఎక్కడా కనిపించలేదు. కవిత తాజాగా పోస్ట్ చేసినవి ప్రధానంగా రాజకీయ కార్యక్రమాలు, వ్యక్తిగత కార్యక్రమాల గురించి మాత్రమే ఉన్నాయి.
గతంలో కూడా ‘తెలంగాణ న్యూస్ టుడే డైలీ’ అనే ఫేక్ న్యూస్‌పేపర్ పేరు మీద, బీఆర్‌ఎస్ పార్టీపై తప్పుడు సమాచారం వైరల్ చేశారు.
కేసీఆర్, కేటీఆర్‌ల గురించి తప్పుడు క్లెయిమ్స్ ఉన్న క్లిప్పింగ్‌లు గతంలోనూ వైరల్ అయ్యాయి. ఇవి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అందువల్ల, ఎమ్మెల్సీ కవిత గురించి వైరల్ అవుతున్న ఈ-పేపర్ క్లిప్పింగ్ పూర్తిగా ఫేక్ అని తేలింది.