హైదరాబాద్: నవంబర్ 22న ‘కేశవ చంద్ర రామవత్’ అనే సినిమా థియేటర్లలో విడుదలైంది. తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా పేరు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ని స్పష్టంగా సూచిస్తుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ, ఈ చిత్రం కేసీఆర్‌కు అంకితం చేసిన ఒక ఫ్యాన్స్ స్టోరీ అని అన్నారు. (Archive)
సినిమా విడుదల తర్వాత రాకింగ్ రాకేష్ ఇచ్చిన ఇంటర్వ్యూ పేరుతో ఓ న్యూస్ పేపర్ కటింగ్ వైరల్ అయింది. అందులో రాకేష్, కేసీఆర్ నుంచి రూ. 20 కోట్లు తీసుకున్నానని, ఆ డబ్బుతో ఆయనను గ్లోరిఫై చేసే సినిమా తీయడం జరిగింది అని చెప్పినట్లు ఉంది.
ఈ కటింగ్‌ను ఒక వ్యక్తి X (ట్విట్టర్)లో షేర్ చేస్తూ, కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాలేకపోయినా, తన మీద సినిమా తీయడానికి రూ. 20 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించాడు.(Archive)
ఇంటర్వ్యూలో, సినిమాకు స్టోరీ లేకపోవడంతో చాలా మంది ఇంటర్‌వెల్‌కు ముందే థియేటర్ వదిలి వెళ్లిపోయారనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఇకపై రాజకీయ అంశాలపై సినిమాలు చేయబోనని రాకేష్ చెప్పినట్లు అందులో నివేదించారు.
ఫ్యాక్ట్ చెక్:
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్‌ను పరిశీలించిగా, ఈ న్యూస్ పేపర్ కటింగ్ పూర్తిగా ఫేక్ అని తేలింది.
న్యూస్ పాపర్ కటింగ్‌లో ‘తెలంగాణ న్యూస్ టుడే’ అనే పేరు చూడవచ్చు. కానీ, ఆ పేరుతో ఎలాంటి న్యూస్ పేపర్ లేదా వెబ్‌సైట్ లేనేలేదు. కటింగ్‌లో ఉన్న వెబ్‌సైట్ లింక్ కూడా ఏదీ పనిచేయలేదు.
కటింగ్‌లో కుడి చివర భాగంలో ఒక గుడ్లగూబ (owl) లోగో మనం చూడవచ్చు. ఇది ‘ReadWhere’ అనే వెబ్‌సైట్ లోగో. ఈ వెబ్‌సైట్‌లో యూజర్లు తాము కోరుకున్న కంటెంట్‌ను తయారు చేసి, ప్రచురించేందుకు ఉపయోగిస్తారు.
ఈ ఫేక్ న్యూస్ పేపర్ కటింగ్‌ను, అసలు వార్తలా కనిపించడానికి డిజైన్ లేదా ఎడిట్ చేసి, తరువాత ‘Readwhere’ లోగోను ఉంచి, అది ఈ వెబ్‌సైట్‌లో ప్రచురించబడినదిగా చూపే ప్రయత్నం చేశారు.
రాకేష్ సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించగా, అలాంటి ఇంటర్వ్యూ మాకు ఎక్కడా కనబడలేదు. ఆయన కేవలం సినిమా ప్రమోషన్‌కి సంబంధించిన పోస్టులు మాత్రమే షేర్ చేశారు.
న్యూస్‌మీటర్ రాకింగ్ రాకేష్‌ను సంప్రదించగా, "కేసీఆర్ రూ. 20 కోట్లు ఇచ్చి ఉంటే, నా సినిమాకు థియేటర్లు కోసం ఇబ్బంది పడేవాడినా? నిజంగా అదే నిజమైతే, బలగం సినిమాను ప్రమోట్ చేసినట్లు, కేటీఆర్ లేదా దిల్ రాజు నా సినిమాను ప్రమోట్ చేసేవారు కదా!" అని చెప్పారు.
కేసీఆర్ తన జీవితకథ ఆధారంగా రూపొందించిన సినిమా కోసం రాకింగ్ రాకేష్‌కు రూ. 20 కోట్లు ఇచ్చినట్లు చెప్పిన న్యూస్ పేపర్ కటింగ్ పూర్తిగా ఫేక్.