Fact Check : పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్? లేదు, ఇది పాత వీడియో
పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రతిజ్ఞ చేస్తున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon
Claim:పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రతిజ్ఞ చేస్తున్న వైరల్ వీడియో ఇది.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఇది పాత వీడియో, దీని ఆడియో సవరించి షేర్ చేస్తున్నారు.
Fact Check: Liberation Front of Afghanistan vows to avenge Pahalgam attack? No, video is old
Hyderabad: లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సభ్యులు ‘పహల్గామ్ కు ప్రతీకారం తీర్చుకుంటాం’ అన్నారు అనే క్లెయిమ్‌లతో ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు తుపాకీలు పట్టుకుని కెమెరా ముందు మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పహల్గామ్‌లోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ దాడిలో 26 మంది మరణించారు.
వీడియోపై ఇలా రాసి ఉంది, “మేము లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్… పహల్గాం మా జ్ఞాపకాలలో రక్తసిక్తమై ఉంది. విదేశీ చేతులు పిల్లల నవ్వులను మౌనంగా మార్చాయని గుర్తుంచుకుంటాం… ఇది ఇకపై ఆఫ్ఘనిస్తాన్ లేదా కాశ్మీర్ గురించి కాదు. ఇది ISI ఉగ్రవాద సిండికేట్‌ను కూల్చివేయడం గురించి... వజీరిస్తాన్ గుహల నుండి కరాచీ వీధుల వరకు - ప్రాక్సీ శిబిరాల నుండి లాహోర్‌లోని సేఫ్‌హౌస్‌ల వరకు - ఇది తెలుసుకోండి: మేము దాడి చేస్తాం.”
“పహల్గామ్‌కు ప్రతీకారం తీర్చుకుంటాం. మాటలతో కాదు... నిప్పు, నిశ్శబ్దంతో."
ఆడియోలో కూడా ఇదే విషయం వినిపిస్తుంది. ఆడియో ఇంగ్లీషులో ఉంది. అయితే, ఇది భారీగా మాడ్యులేట్ చేయబడినట్లు అనిపిస్తుంది.
ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసి క్యాప్షన్‌లో ఇలా రాశారు, "పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం ఇంకా పూర్తి అవ్వలేదు పాకిస్తాన్ తీవ్రవాదులు, ISI స్పాన్సర్ టెర్రరిస్టులను ఎక్కడున్నా వెంటాడి వేటాడి చంపుతామని హెచ్చరించిన - లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘన్ సంస్థ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా భారత్ కి మద్దతుగా పనిచేస్తుంది." (ఆర్కైవ్)
ఇలాంటి క్లెయిమ్‌లు చేసే పోస్ట్‌లను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2, ఆర్కైవ్ 3)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. వైరల్ వీడియోను తాలిబాన్‌ను వ్యతిరేకిస్తూ రూపొందించారు, ఇది కనీసం 2022 నుండి ఆన్‌లైన్‌లో ఉంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి, వైరల్ వీడియో ఫిబ్రవరి 4, 2022న Xలో షేర్ చేయబడిందని కనుగొన్నాం. "పంజ్‌షీర్ న్యూస్. ఆఫ్ఘన్ ఫ్రీడమ్ ఫ్రంట్ వీడియోను విడుదల చేసి తన ఉనికిని ప్రకటించింది" అని రాశారు. (పర్షియన్ నుండి అనువదించబడింది) (ఆర్కైవ్)
అదే రోజున Xలో వీడియోను షేర్ చేస్తూ, ఆఫ్ఘనిస్తాన్‌లో మాట్లాడే డారి భాషలో క్యాప్షన్‌లో ఇలా రాశారు"ఆఫ్ఘనిస్తాన్ ఫ్రీడమ్ ఫ్రంట్ అనే కొత్త సమూహం ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేయడం ప్రారంభించింది, తన ఉనికిని ప్రకటించింది." (ఆర్కైవ్)
ఫిబ్రవరి 6, 2022న ఫేస్‌బుక్‌లో వైరల్ వీడియోను షేర్ చేస్తూ, డారి భాషలో ఇలా రాశారు, “ఆఫ్గానిస్తాన్ ఫ్రీడమ్ ఫ్రంట్, దేశ జెండా పట్ల గౌరవంగా, తమ ఆవిర్భావాన్ని ప్రకటించింది”. (ఆర్కైవ్)
2022లో షేర్ చేయబడిన ఈ మూడు పోస్ట్‌లలోని ఆడియో, వైరల్ వీడియో నుండి భిన్నంగా ఉంది. ఈ వీడియోలలో ఎటువంటి టెక్ట్స్ లేదని కూడా గమనించాం.
వీడియో చివరలో ఉన్న లోగోని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి, ‘లిబరేషన్ ఫ్రంట్ AFG جبههٔ آزادی افغانستان’ అనే ఫేస్‌బుక్ ఖాతాను కనుగొన్నాం. ఈ ఖాతాలోనే ఫిబ్రవరి 4, 2022న వైరల్ వీడియోను కూడా షేర్ చేయబడింది. (ఆర్కైవ్ 1) (ఆర్కైవ్ 2)
ఫిబ్రవరి 7, 2022న, లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గుర్తింపు, లక్ష్యం, సాయుధ ప్రతిఘటనకు కారణాలను తెలిపే ఒక చిత్రాన్ని వారి ఖాతాలో షేర్ చేశారు.
ఏప్రిల్ 1, 2022న, ఈ ఖాతా లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క మ్యానిఫెస్టోను షేర్ చేసింది. ఇదే ఈ ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన చివరి పోస్ట్.
మ్యానిఫెస్టోలో ISI వ్యతిరేకత లేదా పాకిస్తాన్ వ్యతిరేకత గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. పొరుగు, ప్రాంతీయ దేశాలతో సంఘర్షణలను గ్రూప్ వ్యతిరేకిస్తుందని కూడా మ్యానిఫెస్టో పేర్కొంది.
ఫేస్‌బుక్ ఖాతాలో ఒక వెబ్‌సైట్ లింక్ ప్రస్తావించబడింది. అయితే, ప్రస్తుతం వెబ్‌సైట్ పనిచేయడం లేదు. ఈ వెబ్‌సైట్ ఆర్కైవ్ చేసిన వెర్షన్‌ను కనుగొన్నాం. అది ఫిబ్రవరి 8, 2022 న ఆర్కైవ్ చేయబడిన వెర్షన్. అయితే, ఆ రోజు వెబ్‌సైట్ ఇంకా నిర్మాణంలో ఉంది అని ఆర్కైవ్ ద్వారా తెలుస్తోంది.
ఈ వెబ్సైటులో ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్, X వంటి ప్లాట్‌ఫారమ్‌ల సోషల్ మీడియా ఖాతాలకు లింక్‌లు ప్రస్తావించబడ్డాయి. ఫేస్‌బుక్ లింక్ ‘Liberation Front AFG جبههٔ آزادی افغانستان’ ఖాతాకు తిరిగి దారితీస్తుంది. ఇంస్టాగ్రామ్, X ఖాతాలు ఇక్కడ, ఇక్కడ లింక్ చేయబడ్డాయి. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)
ఇన్‌స్టాగ్రామ్, X ఖాతాలలో వైరల్ వీడియోతో పాటు మ్యానిఫెస్టో కూడా షేర్ చేశారు. ఫేస్‌బుక్ ఖాతాలో ఉన్న పోస్టులే ఇక్కడ కూడా ఉన్నాయని గుర్తించాం. ఈ ఖాతాలలో షేర్ చేయబడిన చివరి పోస్ట్‌లు కూడా ఏప్రిల్ 1, 2022న పోస్ట్ చేశారు. ఈ సోషల్ మీడియా ఖాతాలలో పాకిస్తాన్ వ్యతిరేక పోస్ట్‌లు ఏవీ మాకు కనిపించలేదు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ లేదా, ISIపై దాడి చేస్తాం అని పేర్కొన్న పోస్ట్‌లు లేదా వీడియోలు మాకు కనిపించలేదు. కీవర్డ్ సెర్చ్ ఉపయోగించి, లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ పహల్గామ్ దాడిపై వ్యాఖ్యానించిందని పేర్కొన్న వార్తా నివేదికలు లేదా సోషల్ మీడియా పోస్ట్‌లు లేవని కనుగొన్నాం.
అసలు ఆడియో పర్షియన్ భాషలో ఉన్నందున, ఆ వీడియోలో ఎం చెప్పారో ధృవీకరించలేకపోయాము. అయితే, లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అప్‌లోడ్ చేసిన వీడియోను పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఉద్దేశించి ఇంగ్లీషులో ఆడియో ట్రాక్‌తో కలిపి సవరించినట్లు తేలింది.
వైరల్ వీడియో ఫిబ్రవరి 4, 2022 నుండి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు అర్ధం అవుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఏప్రిల్ 22న జరిగింది. కాబట్టి ఈ వీడియోలో పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఉద్దేశించి లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రసంగించే అవకాశం లేదు.
కాబట్టి, వైరల్ వాదన తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.