Fact Check: 'పదే పదే అబద్ధాలు.." CM రేవంత్‌ని నిలదీసిన మంత్రి సీతక్క? నిజం ఇక్కడ తెలుసుకోండి...
ఎన్నికల సమయంలో చేసిన హామీల గురించి కాంగ్రెస్ మంత్రి సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు అంటూ క్లెయిమ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By K Sherly Sharon Published on 11 March 2025 4:24 PM IST
Claim: 'పదే పదే అబద్ధాలు.." అంటూ CM రేవంత్‌ని నిలదీసిన మంత్రి సీతక్క.
Fact: ఈ క్లెయిమ్స్ తప్పు. తన మీద, కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారి గురించి సీతక్క ఈ వ్యాఖ్యలు చేశారు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి కాదు.
Hyderabad: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రమాణాలను మంత్రి సీతక్క నిలదీశారని ఆరోపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేసిన పలు ప్రమాణాల వీడియో క్లిప్పులను, మంత్రి సీతక్క కూడా ఉన్న ఒక క్లిప్పును ఉపయోగించి ఈ వీడియోను రూపొందించారు.
"బ్యాంకుకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాంగానే మాఫీ చేస్తా... వచ్చే నెల డిసెంబర్ తొమ్మిది నాడు 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది... ప్రతి నెలా 4,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది.. 2,500 రూపాయలు ప్రతి నెల, ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.. కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాలకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000," అని ముఖ్యమంత్రి అంటున్న వీడియో క్లిప్పులను చూడగలం.
"ఏమైనా సిగ్గు, లజ్జ ఉండాలి కదా ఇట్లాంటివి మాటలనేటప్పుడు, పెట్టేటప్పుడు. ఒక విషయాన్నీ పదే పదే అబద్ధాల్ని చేస్తే జనం నిజం అనుకుంటారేమో గాని. నీకు నైతిక విలువ అనేది ఉండాలి కదా. నీకు, పెట్టేటప్పుడు అనేటప్పుడు నైతిక విలువ అనేది ఉంటది," అని సీతక్క అంటున్న క్లిప్ ఈ వీడియోలో ఉపయోగించారు.
ఈ వీడియోని KTR Youth Force అనే ఫేస్‌బుక్ అకౌంట్ షేర్ చేస్తూ, "ఇప్పుడు సీతక్క కూడా నిన్ను నిలదీస్తుంది గుంపుమేస్త్రి.." అని క్యాప్షన్‌లో రాశారు.(ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. తన మీద, కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారి గురించి సీతక్క ఈ వ్యాఖ్యలు చేశారు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి కాదు.
వీడియో కీ ఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా BIG TV Breaking News Xలో షేర్ చేసిన వీడియో దొరికింది. 2025 మార్చి 5న షేర్ చేసిన ఈ పోస్టులో సీతక్క ఇంటర్వ్యూ ఇస్తున్న వీడియో ఉంది. ఈ ఇంటర్వ్యూ వీడియో, వైరల్ వీడియో మధ్య దృశ్య సరిపోలికలు ఉన్నాయని కనుగొన్నాం.
గడిచిన పదేళ్లు స్వర్ణయుగమే అయితే ప్రజలు మార్పు ఎందుకు కోరుకుంటారు? : సీతక్క
— BIG TV Breaking News (@bigtvtelugu) March 5, 2025
పదవులు పోయాయనే అక్కసుతో ఏ మంచి పని చేసినా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
మేము వర్క్ బిజీలో ఉంటే బీఆర్ఎస్, బీజేపీ వాగుడు బిజీలో ఉన్నాయి
వాళ్ల తప్పులను వాళ్లు తెలుసుకోకుండా ప్రజలదే తప్పు అనే విధంగా… pic.twitter.com/coZmfLs3rt
ఈ ఇంటర్వ్యూ పూర్తి వీడియో కోసం యూట్యూబ్‌లో కీ వర్డ్ సెర్చ్ నిర్వహించం. "Minister Seethakka Special Interview | తమ్ముడు రేవంత్ కి నా సూచన ఇదే.. | CM Revanth Reddy | BIGTV" అనే శీర్షికతో 2025 మార్చి 6న BIG TV Nalgonda యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేయబడిన వీడియో దొరికింది.
యూట్యూబ్ వీడియోలో 6:17 నిమిషం మార్కు వద్ద వైరల్ వీడియోలో ఉన్న క్లిప్ మొదలౌతుంది అని కనుగొన్నాం. ఈ సందర్భంలో మంత్రి సీతక్క మాటలాడుతూ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వాళ్లకి నచ్చవన్నారు.
"బీఆర్ఎస్, బీజేపీకి మేము చేసినవన్నీ కూడా, పబ్లిక్‌కు రీచ్ అయ్యేట్వంటి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేట్వంటి కార్యాక్రమాలు... వాళ్ళుకు నచ్చవు. మేము ఏ స్కీం మొదలు పెట్టినా వెంటనే రివర్స్ టాక్," అని ఇంటర్వ్యూలో సీతక్క అన్నారు.
"ఇంతగా గతంలో ఏ ప్రభుత్వం ఇయ్యలేదు, కేసీఆర్ ఇయ్యలేదు, మోడీ ఇయ్యడం లేదు. అయినా కూడా పదే పదే విమర్శలు. వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ చానెల్స్ పెట్టుకొని లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా... ఎంత దుర్మార్గం అంటే, వాళ్ళ ప్రచారం, అబద్ధాలు మీద అబద్ధాలు, అబద్ధాలు.." అని కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం జరుగుతోంది అన్నారు.
తప్పుడు వార్తల గురించి మాట్లాడుతూ "ఏమైనా సిగ్గు, లజ్జ ఉండాలి కదా ఇట్లాంటివి మాటలనేటప్పుడు, పెట్టేటప్పుడు.. ఒక విషయాన్నీ పదే పదే అబద్ధాల్ని చేస్తే జనం నిజం అనుకుంటారేమో గాని. నీకు నైతిక విలువ అనేది ఉండాలి కదా. నీకు, పెట్టేటప్పుడు అనేటప్పుడు నైతిక విలువ అనేది ఉంటది..," అన్నారు సీతక్క. పదవులు పోయాయనే అక్కసుతోనే ఏది పడితే అది స్ప్రెడ్ చేస్తున్నారు అని సీతక్క అన్నారు.
అయితే వైరల్ వీడియోలో కనిపిస్తున్న మంత్రి సీతక్క వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినవి కావని తేలింది. తన మీద, కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఉద్దేశించి చేసిన వక్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు అని అర్ధం అవుతోంది. కాబట్టి వైరల్ వీడియోలో ఉన్న క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.